close

తాజా వార్తలు

Updated : 25/02/2021 11:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇక మీడియాకు ఫేస్‌బుక్‌ డబ్బు చెల్లించాల్సిందే!

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో నూతన మీడియా చట్టం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచురించే కంటెంట్‌కు సంబంధించి మీడియా సంస్థలకు రుసుము చెల్లించేలా తయారు చేసిన ‘న్యూస్‌మీడియా బార్గైనింగ్‌ కోడ్‌’ బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంటు గురువారం ఆమోదించింది. ఈ విషయాన్ని ఆ దేశ కమ్యూనికేషన్స్‌ మంత్రి పాల్‌ ఫ్లెచర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ చట్టంతో ఇక నుంచి ఫేస్‌బుక్‌తో పాటు, గూగుల్‌ సంస్థలు తమ ప్లాట్‌ఫాంలలో ప్రచురించే న్యూస్‌ కంటెంట్‌పై ఆ దేశ మీడియా సంస్థలకు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

‘దేశంలోని మీడియా మాధ్యమాలతో వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంలో గూగుల్‌, ఫేస్‌బుక్‌లు పురోగతి సాధించడంపై సంతోషిస్తున్నాం. మీడియా సంస్థలు తాము సామాజిక మాధ్యమాలకు ఇచ్చే కంటెంట్‌పై రెమ్యూనరేషన్‌ పొందటానికి ఈ కోడ్‌ ఉపకరిస్తుంది. ఆస్టేలియాలో ప్రజా ప్రయోజన జర్నలిజం మరింత మెరుగ్గా కొనసాగించడానికి కూడా ఈ చట్టం ఉపయోగపడుతుంది’ అని ఫ్లెచర్‌ తెలిపారు. కాగా మూడేళ్లు విస్తృతమైన చర్చలు, విశ్లేషణలు జరిపిన అనంతరం ఈ కోడ్‌ తెచ్చేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందడుగు వేసింది. తాజాగా ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంతో ఇదే తరహాలో బిల్లులు తేవాలని ఆలోచిస్తున్న కెనడా, బ్రిటన్‌ వంటి దేశాలకు బలం లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సామాజిక మాధ్యమాల్లో వార్తలు ప్రచురించేందుకు సదరు కంటెంట్‌పై మీడియా సంస్థలకు రుసుము చెల్లించాలనే ప్రతిపాదనతో ఆస్ట్రేలియా బిల్లు రూపొందించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఫేస్‌బుక్‌ సహా గూగుల్‌ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌ ఆస్ట్రేలియాలో వార్తలను తన సామాజికవేదికపై పంచుకోవడాన్ని కొద్ది రోజుల పాటు నిలిపివేసింది కూడా. అనంతరం చర్చల ద్వారా ప్రభుత్వం పలు సవరణలకు ఓకే అనడంతో వివాదం ఓ కొలిక్కి వచ్చింది. దీంతో  ఫేస్‌బుక్‌ ఆస్ట్రేలియాలో వార్తలు పంచుకునే ప్రక్రియను రెండ్రోజుల క్రితం పునరుద్ధరించింది.  
 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని