
తాజా వార్తలు
రష్యా టీకా వినియోగానికి బ్రెజిల్ నిరాకరణ!
రియో డీ జెనీరో : రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్-V అత్యవసర వినియోగానికి బ్రెజిల్ ప్రభుత్వం నిరాకరించింది. అనుమతికి కావాల్సిన కనీస వివరాలను సమర్పించలేదని ఆ దేశ జాతీయ ఆరోగ్య నిఘా సంస్థ అన్విసా వెల్లడించింది. ‘రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’(ఆర్డీఐఎఫ్) భాగస్వామ్యంతో పనిచేస్తున్న యునియావో క్విమికా ఇటీవలే టీకా వినియోగానికి అనుమతించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు చైనాకు చెందిన సినోవాక్, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కొవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి మాత్రం బ్రెజిల్ ఆమోద ముద్ర వేయడం గమనార్హం.
స్పుత్నిక్-V మూడో దశ ప్రయోగాలకు పూర్తి స్థాయి అనుమతులు లేవని అన్విసా తెలిపింది. అలాగే టీకా తయారీకి అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంలోనూ సందేహాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అనుమతులు జారీ చేయలేకపోతున్నామని వివరించింది. డిసెంబరులోనే టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు క్విమికా దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. బ్రెజిల్లో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో టీకాకు వీలైనంత త్వరగా అనుమతి ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది. భారత్‌లో రెడ్డీస్ ల్యాబ్ స్పుత్నిక్ టీకా మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి...