కరోనా: ఇప్పుడు బ్రెజిల్‌ను వణికిస్తోంది

తాజా వార్తలు

Updated : 04/03/2021 15:01 IST

కరోనా: ఇప్పుడు బ్రెజిల్‌ను వణికిస్తోంది

ఒకేరోజు ఐదు విమానాలు కూలితే..ఈ స్థాయి మరణాలు

2000 చేరువగా రోజూవారీ మరణాలు

బ్రసీలియా: కరోనా మహమ్మారి ఇప్పుడు లాటిన్ అమెరికన్ దేశం బ్రెజిల్‌ను వణికిస్తోంది. టీకాలు వచ్చిన వేళ.. అక్కడ వరసగా రెండోరోజు రికార్డు స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. తాజాగా 1,910 మంది వైరస్‌కి బలయ్యారు. మొత్తంగా మరణాల పరంగా ఆ దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం..అమెరికాలో 5,31,652 మంది మృత్యు ఒడికిచేరుకోగా..బ్రెజిల్‌లో 2,59,402 మంది ప్రాణాలు వదిలారు. 

‘దేశంలో కరోనా ఉద్ధృతి ఆందోళనకరంగా ఉంది. ఈ మహమ్మారి ప్రారంభమయిన ఇన్నిరోజుల్లో మొదటిసారి పరిస్థితులు దిగజారుతున్నాయి’ అని ప్రజారోగ్య సంస్థ ఫియోక్రజ్ హెచ్చరించింది. కాగా, అంతకు ముందు రోజు అక్కడ 1,641 మరణాలు సంభవించాయి. గత వారం నుంచి రోజుకు సగటున 1,331 మంది మృత్యువాత పడుతున్నారని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అమెజాన్ అడవుల నుంచి కొత్త రకం..

మొదటి నుంచి కూడా కరోనాను నియంత్రించే విషయంలో బ్రెజిల్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ దేశ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో..వైరస్‌ను నిర్లక్ష్యం చేసి, నిపుణుల సూచనలు ఖాతరు చేయకుండా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సెలవులు, కార్నివాల్స్ వంటి కారణాలతో ఇప్పుడు అక్కడ కరోనా ఉద్ధృతికి కారణమయ్యాయి. అమెజాన్‌ రెయిన్ ఫారెస్ట్‌లో ఉద్భవించిన పీ1 అనే కొత్త వేరియంట్ కూడా తాజా ముప్పునకు కారణమని నిపుణులు అంటున్నారు. ఆ దేశంలో మొత్తం 27 రాష్ట్రాలుండగా..17 రాష్ట్రాల్లో ఈ రకం కరోనా తన ఉనికిని చాటుతోందని చెప్తున్నారు. అలాగే 10కి పైగా దేశాలకు కూడా విస్తరింది. అసలు దానికి కంటే ఈ ఉత్పరివర్తన చెందిన రకం వేగంగా వ్యాపిస్తోందని పరిశోధనలు పేర్కొన్నాయి. ఇప్పటికే కొవిడ్ నుంచి కోలుకొన్న వారికి కూడా ఇది అంటుకుంటుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తుండటం ఆ దేశాన్ని మరింత కలవరపెడుతోంది. అక్కడ వైద్య వ్యవస్థ కూడా కుప్పకూలే స్థితికి చేరుకుంది. ఇప్పటికే 19 రాష్ట్రాల్లో ఐసీయూలు 80 శాతానికి పైగా వినియోగంలో ఉన్నాయని ఫియోక్రజ్ వెల్లడించింది. ఆసుపత్రులు కిక్కిరిసిపోయి ఉండటంతో రోగులను పొరుగు ప్రాంతాలకు పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. 

మరోవైపు మిగతా దేశాలతో పోల్చుకుంటే ఆ దేశంలో టీకా కార్యక్రమం కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. అదీకాక టీకాల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం ఆ దేశం చైనా అభివృద్ధి చేసిన కరోనావాక్‌, ఆక్స్‌ఫర్డ్ టీకాలను వినియోగిస్తోంది. ఈ టీకాలను రెండు డోసులుగా ప్రజలకు అందించాల్సి ఉంటుంది. జనవరి మధ్యలో ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద ఇప్పటికే 7.1 మిలియన్ల మందికి మొదటి డోసు అందించగా, 2.1 మిలియన్ల మంది రెండో డోసును కూడా స్వీకరించారు. 212 మిలియన్లు కలిగిన ఆ దేశంలో..ఈ ఏడాది చివరి నాటికి అందరికి టీకాలు అందిస్తామంటూ ఆరోగ్యశాఖ మంత్రి చేసిన ప్రతిజ్ఞ నెరవేరడం దాదాపు అసాధ్యమని వైద్య నిపుణులు అంటున్నారు. 

‘ఈ ఉద్ధృతి ముందుగా ఊహించినదే. దేశంలో కొత్త రకం ఉందని తెలుసు. ఈ విజృంభణను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ విధించాలి’ అని బ్రెజిల్‌లోని అంటువ్యాధుల నియంత్రణ సొసైటీకి చెందిన ఇసాబెల్లా అన్నారు. మరోవైపు ఈ వైరస్ కట్టడికి అక్కడి ఫెడరల్‌ ప్రభుత్వం నుంచి ఏ స్పందనా లేకపోవడంతో..స్థానిక ప్రభుత్వాలే తమవంతుగా తాజాగా నియంత్రణ చర్యలకు పూనుకోవడం గమనార్హం. ‘ఈ పరిస్థితికి మీ నిర్లక్ష్య వైఖరే కారణం. రోజుకు 1,000కి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఒకేరోజు ఐదు విమానాలు కూలినప్పుడు..ఇంతమంది ప్రాణాలు వదులుతారు. మీ పని మీరు సరిగా చేయకపోవడమే ఈ దుర్భర పరిస్థితికి కారణం’ అంటూ అధ్యక్షుడిపై విపక్ష నేత జావో డోరియా తీవ్రంగా మండిపడ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని