Covishield: డోసు గ్యాప్‌ వివాదం.. కేంద్రం స్పష్టత
close

తాజా వార్తలు

Published : 16/06/2021 14:29 IST

Covishield: డోసు గ్యాప్‌ వివాదం.. కేంద్రం స్పష్టత

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధి పెంపుపై ఇటీవలు కొద్ది రోజులుగా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు స్పష్టతనిచ్చింది. శాస్త్రీయపరమైన డేటాను విశ్లేషించిన తర్వాత టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచామని, ఇది పూర్తిగా పారదర్శకంగా తీసుకున్న నిర్ణయమని కేంద్ర ఆరోగ్య మంత్రి డా. హర్షవర్ధన్‌ బుధవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

‘‘కొవిషీల్డ్‌ డోసుల వ్యవధి పెంపుపై శాస్త్రీయ డేటా ఆధారంగా చాలా పారదర్శకంగా నిర్ణయం తీసుకున్నాం. శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించడానికి భారత్‌కు చాలా పటిష్ఠమైన వ్యవస్థ ఉంది. ఇలాంటి ముఖ్యమైన విషయాలను రాజకీయం చేయడం దురదృష్టకరం’’ అని హర్షవర్ధన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

కొవిషీల్డ్‌ డోసుల వ్యవధిని 8-12 వారాలకు మాత్రమే పెంచాలని తాము సిఫార్సు చేశామని, కానీ 12-16 వారాలకు పెంచుతూ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందని నేషనల్‌ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌(ఎన్‌టీఏజీఐ) సభ్యులు కొందరు చెప్పినట్లు కొన్ని మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ల కొరత కారణంగానే కొవిషీల్డ్‌ డోసుల వ్యవధిని పెంచినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం నేడు స్పష్టతనిచ్చింది.

అటు ఎన్‌టీఏజీఐ ఛైర్మన్‌ డా.ఎన్‌కే అరోరా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. డోసుల మధ్య వ్యవధి పెంపు అనేది పూర్తిగా శాస్త్రీయత ఆధారంగా తీసుకున్న నిర్ణయమేనని అన్నారు. దీనిపై ఎన్‌టీఏజీఐ సభ్యుల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవంటూ మీడియా కథనాలను తోసిపుచ్చారు.

కొవిషీల్డ్ డోసుల వ్యవధిపై నిరంతరం చర్చలు జరుగుతూనే ఉన్నాయని అరోరా వెల్లడించారు. ఒకవేళ భవిష్యత్తుల్లో వ్యవధి తగ్గించే అవకాశం కూడా లేకపోలేదన్నారు. ‘‘కొవిడ్‌19, వ్యాక్సినేషన్‌ అనేది నిరంతరం మారే ప్రక్రియ. ఒక వేళ డోసుల మధ్య వ్యవధిని తగ్గిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని రేపు శాస్త్రీయంగా ఆధారాలు లభిస్తే వాటిని కూడా కమిటీ పరిశీలిస్తుంది. కనీసం 5 నుంచి 10శాతం మెరుగైన ఫలితాలు ఉన్నాయని తేలినా కమిటీ దానిపై నిర్ణయం తీసుకుంటుంది. లేదు.. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయమే మంచిదని తేలితే.. దాన్నే కొనసాగిస్తాం’’ అని అరోరా చెప్పుకొచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని