చైనా జల జగడానికి సన్నాహాలు
close

తాజా వార్తలు

Published : 12/03/2021 15:50 IST

చైనా జల జగడానికి సన్నాహాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-చైనా మధ్య మరిన్ని వివాదాలు చెలరేగే పరిస్థితి తలెత్తుతోంది. సరిహద్దు వివాదాలకు తోడు భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితి వచ్చేట్లుంది. తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌ వద్ద సమస్యలు సృష్టించడానికి యత్నాలు మొదలుపెట్టింది. టిబెట్‌ నుంచి భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై ఒక భారీ డ్యామ్‌ నిర్మాణానికి చైనా నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ పచ్చజెండా ఊపింది. 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు.  గతేడాది ‘పవర్‌ చైనా’ ఛైర్మన్‌ యాన్‌ ఝియాంగ్‌ ప్రస్తావించడంతో వెలుగులోకి వచ్చింది.

భారీ ప్రాజెక్టుకు సన్నాహాలు..

టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర (యార్లుంగ్‌) నది దాదాపు 2,900 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది చైనా భూభాగాలను దాటుకొని 1625 కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌, బంగ్లాదేశ్‌లలో కూడా ప్రజలకు మంచినీటి అవసరాలు తీరుస్తుంది. చైనాలోని జలవిద్యుత్తులో నాలుగో వంతు ఉత్పత్తి సామర్థ్యం టిబెట్‌కు ఉన్నట్లు అంచనా వేశారు. 2010 నుంచి ఈ నది మధ్యభాగాల్లో చైనా చాలా హైడ్రోపవర్‌ ప్రాజెక్టులను నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.

కాకపోతే అప్పట్లో రెండు పంచవర్ష ప్రణాళికల్లో ఈప్లాన్‌ ముందుకు కదల్లేదు. ఈ నది మధ్య భాగంలోని పరీవాహక ప్రాంతం ఎల్‌ఏసీకి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడ కనీసం 11 హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. వీటిల్లో అతిపెద్దదైన జాంగ్మూ ప్రాజెక్టు 2015 నుంచి పనిచేస్తోంది. మిగిలిన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు నది దిగువ భాగాన అరుణాచల్‌ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో ఓ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది. దీని సైజు ప్రపంచంలోనే అతిపెద్దదైన త్రీగోర్జెస్‌ డ్యామ్‌ కంటే ఎక్కువగా ఉంటుందని చైనా వర్గాలు చెబుతున్నాయి.

ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ భాగాలకు నీటి లభ్యతపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు వరదలు వచ్చిన సమయంలో ఒక్కసారిగా గేట్లు తెరిస్తే దిగువ ప్రాంతాలు నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారత్‌ భూభాగంగా గుర్తించమని చైనా చెబుతోంది. తాజాగా భారీ ఆనకట్ట నిర్మించి దిగువ ప్రదేశాలపై పట్టు సాధించాలని చూస్తోంది. ఈ ఆనకట్టకు బంగ్లాదేశ్‌ కూడా బాధిత దేశంగా మారే ప్రమాదం ఉంది. భారత్‌కు ఈ కొత్త డ్యామ్‌పై ఎటువంటి సమాచారం అందజేయలేదు. ఇప్పటికే  చైనా చేపడుతున్న నిర్మాణాలపై భారత్‌ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నదిజలాల వివరాలకు సంబంధించిన హైడ్రోలాజికల్‌ డేటాపై ఇరు దేశాలు గతంలో సమాచారం ఇచ్చిపుచ్చుకొనేవి. 2017లో డోక్లాం వివాదం తర్వాత నుంచి చైనా సమాచారం ఇవ్వడం మానేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని