వెనకడుగు వేసే సమయం కాదు:డబ్ల్యూహెచ్‌ఓ

తాజా వార్తలు

Updated : 06/03/2020 10:19 IST

వెనకడుగు వేసే సమయం కాదు:డబ్ల్యూహెచ్‌ఓ

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా (కొవిడ్‌-19) మహమ్మారి ప్రపంచ దేశాల్ని కలవరపెడుతున్న నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు అన్ని ప్రభుత్వాలు సమర్థ చర్యల్ని చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పిలుపునిచ్చింది. కొన్ని దేశాలు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని సంస్థ చీఫ్‌ టెడ్రోస్ అధానోమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌తో పోరాడే క్రమంలో ఏ ఒక్క దేశం వెనకడుగు వేయొద్దని సూచించారు. ఉన్న అన్ని మార్గాల్ని వినియోగించుకోవాలని నొక్కి చెప్పారు. మరోవైపు బ్రిటన్‌లో తొలి కరోనా మరణం సంభవించింది. ఇదే దేశానికి చెందిన మరో వ్యక్తి గతంలో టోక్యోలో మరణించాడు. అతనికి డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో వైరస్‌ సంక్రమించింది. మరో 115 మందికి బ్రిటన్‌లో వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు.

> తొలుత వ్యాధి వెలుగులోకి వచ్చిన చైనాలో మరో 30 మంది వైరస్‌ వల్ల మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు అక్కడ మరణించిన వారి సంఖ్య 3,042కు చేరింది. మరో 143 కొత్త కేసులు నమోదుకావడంతో బాధితుల సంఖ్య 80,552కు చేరింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు చైనా అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. వైరస్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు కృత్రిమ మేధను ఉపయోగిస్తోంది. దీంతో తీసుకుంటున్న చర్యలు మరింత ప్రభావవంతంగా అమలయ్యేందుకు దోహదం అవుతోందని అధికారులు తెలిపారు. 

> ఆసియాలో చైనా తర్వాత అత్యధిక మరణాలు సంభవించిన ఇరాన్‌లో మృతుల సంఖ్య 107కు చేరింది. బాధితులు సంఖ్య 3,513ను తాకింది. గత 24 గంటల్లో 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఇళ్లలో ఉండేవారి కోసం వినోదభరితమైన కార్యక్రమాల్ని అందించాలని టీవీ ఛానళ్లకు అధ్యక్షుడు హసన్‌ రౌహానీ సూచించారు.

>అమెరికాలో వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 12కు చేరింది. వీరిలో 11 మంది వాషింగ్టన్‌కు చెందిన వారు కాగా, మరొకరు కాలిఫోర్నియా వాస్తవ్యులు. కొత్తగా మరో 53 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. దీంతో బాధితుల సంఖ్య 145కు చేరింది.

> యూరప్‌లో వైరస్‌కు కేంద్రంగా ఉన్న ఇటలీలో మరో 41 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మరణాల సంఖ్య 148కి చేరింది. మరో 769 కొత్త కేసులు నమోదుకావడంతో బాధితుల సంఖ్య 3,858కి చేరింది. దేశవ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. క్రీడాకార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు. వైరస్‌ కట్టడికి అక్కడి ప్రభుత్వం 8.4 బిలియన్‌ డాలర్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.

> అమెరికాలో కాలిఫోర్నియా తీరంలో ‘గ్రాండ్‌ ప్రిన్సెస్‌’ అనే భారీ నౌకను నిలిపి ఉంచారు. దీంట్లో 3,500 మంది ఉన్నారు. గతంలో ఈ నౌక నుంచి దిగిన ఓ వ్యక్తి వైరస్‌తో చనిపోయినట్లు గుర్తించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం వారికోసం హెలికాప్టర్‌ ద్వారా ప్రత్యేకంగా పరీక్ష కిట్లను పంపారు. వారందరినీ పరీక్షించే వరకూ బయటకు తీసుకొచ్చేది లేదని కాలిఫోర్నియా ప్రభుత్వం తేల్చి చెప్పింది.

> దక్షిణాఫ్రికాలో గురువారం తొలి కరోనా కేసు నమోదైంది. 

> వచ్చే వారం స్ట్రాస్‌బర్గ్‌లో జరగాల్సిన ఐరోపా సమాఖ్య పార్లమెంటు సమావేశ వేదికను వైరస్‌ ముప్పు నేపథ్యంలో బ్రస్సెల్స్‌కు మార్చారు.

దేశం      బాధితుల సంఖ్య  మరణాల సంఖ్య
చైనా    80,552   3,042
దక్షిణ కొరియా   6,284     42
ఇరాన్‌     3,513      107
ఇటలీ  3,858  148
అమెరికా  145  12
జపాన్‌   330   6
ఫ్రాన్స్‌  423    07
హాంకాంగ్‌    104    02
భారత్‌    30  00
ప్రపంచవ్యాప్తంగా      97,737  3,382

                        


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని