6 రాష్ట్రాలు.. 116 జిల్లాలు.. 125 రోజులు!

తాజా వార్తలు

Published : 18/06/2020 18:59 IST

6 రాష్ట్రాలు.. 116 జిల్లాలు.. 125 రోజులు!

వలస కూలీలకు కేంద్రం కొత్త పథకం
20న ప్రారంభించనున్న మోదీ

దిల్లీ: కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు తరలివెళ్లిపోయిన వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గరీభ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ పేరిట దేశంలోని మొత్తం ఆరు రాష్ట్రాల్లో 116 జిల్లాల్లో వలస కూలీలకు పనులు కల్పించనుంది. రూ.50వేల కోట్లతో చేపట్టనున్న ఈ పథకం వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. 

‘‘కరోనాతో లాక్‌డౌన్‌ విధించిన సందర్భంలో దేశంలోని వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని కోరుకున్నారు. దీంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తగు ఏర్పాట్లు చేసి వారిని స్వస్థలాలకు తరలించాయి. ఏయే జిల్లాలకు వలస కూలీలు పెద్ద ఎత్తున తరలివెళ్లారో గుర్తించాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీల్లో బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని 116 జిల్లాలకు చెందినవారే అధికం. ఆయా జిల్లాల్లో 25వేల మందికి పైగా వలస కూలీలకు నైపుణ్యాల ఆధారంగా 125 రోజుల పాటు ఉపాధి కల్పించనున్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి నైపుణ్యాలపై అధ్యయనం చేసి మ్యాప్‌ రూపొందిస్తాయి.  125 రోజుల్లో ఈ జిల్లాల్లో దాదాపు 25 ప్రభుత్వ పథకాలను గరీభ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ కిందకు తీసుకొచ్చి వలస కార్మికులకు ఉపాధి కల్పనపై  చర్యలు చేపడుతున్నాం. ఆయా జిల్లాల్లోని గ్రామాలు కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, కృషి విజ్ఞాన్‌ కేంద్రాల ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. ఈ నెల 20న ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌లోని ఖగారియా జిల్లా తెలిహర్‌ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి నిరాశ్రయులైన వేలాది మంది కార్మికులకు ఈ పథకం ఉపశమనం కలిగించనుంది’’ అని అన్నారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని