Human Lifespan: మనిషి ఎంతకాలం బతకొచ్చు?

తాజా వార్తలు

Updated : 26/07/2021 10:54 IST

Human Lifespan: మనిషి ఎంతకాలం బతకొచ్చు?

ఆశ్చర్యపోయే సంఖ్య చెప్పిన పరిశోధకులు
శరీర సమస్థితిని కాపాడుకుంటే సాధ్యమే!

లండన్‌: 60 ఏళ్లు రాగానే వృద్ధాప్యం అనుకుంటాం. మహా అయితే 80 ఏళ్లు బతకొచ్చని భావిస్తాం. జపాన్, బ్రిటన్‌ వంటి దేశాల్లో శతాధిక వృద్ధులున్నా, వారి సంఖ్య మరీ ఎక్కువేం కాదు. దేశకాల పరిస్థితులను బట్టి... ప్రజల సగటు ఆయుష్షు మారిపోతుంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్రెంచి మహిళ జీనె కాల్మెంట్‌ 122 సంవత్సరాలు బతికినట్టు చెబుతారు. 1875లో ఆమె జన్మించినప్పుడు మనిషి సగటు జీవితకాలం 43 ఏళ్లు! మరి- ఎన్నో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన ‘ప్రస్తుత కాలంలో మనిషి గరిష్ఠంగా ఎంతకాలం బతికే అవకాశముంది?’ అన్న ప్రశ్న మరోసారి పరిశోధకులను తొలిచింది. ఇంతకుముందు పలు అధ్యయనాలు... మనిషి గరిష్ఠంగా 140 సంవత్సరాలు బతికే అవకాశముందని పేర్కొన్నాయి. అయితే సింగపూర్, రష్యా, అమెరికాలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు తాజాగా మరో అధ్యయనం చేపట్టారు. 19వ శతాబ్దం నాటి ‘గోంపెట్జ్‌ ఈక్వేషన్‌’ ఆధారంగా లెక్కలు వేశారు. మనిషి గరిష్ఠంగా 150 సంవత్సరాలు బతికే అవకాశముందని నిర్ధారణకు వచ్చారు! మనం ఇప్పుడు అనుకుంటున్న 70-80 ఏళ్లు... అందులో దాదాపు సగమేనన్న మాట. అంతేకాదు. కంప్యూటర్‌ మోడల్‌ సహాయంతో వయసు, అవయవాల క్షీణత, ఏ వయసులో పనిచేయడం నిలిపివేస్తారు... తదితర అంశాల ఆధారంగా మరో లెక్క కూడా వేశారు. అందులో కూడా మనిషి 150 ఏళ్లు బతికే అవకాశముందని తేల్చారు.

‘‘శరీరం తన ధర్మాన్ని నిర్వర్తించే    సామర్థ్యాన్ని క్రమంగా క్షీణించే దశను వృద్ధాప్యంగా పేర్కొంటాం. ఒక్కో అవయవం పనిచేయడం మానేస్తున్నప్పుడు శరీరం సమస్థితి (హోమియోస్టాసిస్‌) కోల్పోతుంది. ఫలితంగా వ్యాధుల నుంచి కోలుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. చివరికి మరణం గుప్పిట్లో దేహం చేరిపోతుంది. ఒకవేళ ఈ సమస్థితిని స్థిరంగా ఉంచుకుని, వ్యాధుల నుంచి కోలుకునే సామర్థ్యం తగ్గకుండా చూసుకుంటే... మనిషి భేషుగ్గా 150 ఏళ్లు జీవించే అవకాశముంది’’ అని పరిశోధకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా వారు 70 వేల మంది రక్తనమూనాలను పరీక్షించారు. 

ఈ మూడూ ఉంటే మీరూ దీర్ఘాయుష్మంతులే!

దీర్ఘకాలం జీవించాలనుకునే వారికి పరిశోధకులు మూడు కీలక సూచనలు చేశారు. ‘‘దీర్ఘాయుష్మంతులు కావాలనుకునే వారికి మొదట ఉండాల్సినవి... మంచి జన్యువులు. వందేళ్ల మార్కును అందుకోవడానికి ఇవెంతో కీలకం. రెండోది... అద్భుతమైన ఆహార-వ్యాయామ ప్రణాళిక. దీన్ని పాటిస్తే జీవితకాలం మరో 15 ఏళ్లు పెరుగుతుంది. ఇక మూడోది- మంచి చికిత్సలు, ఔషధాలు. ఇవి నాణ్యమైన జీవితకాలం మరింత కొనసాగేలా చేస్తాయి’’ అని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రైటన్‌కు చెందిన పరిశోధనకర్త రిచర్డ్‌ ఫరాఘెర్‌ చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని