Work From Home: జీతం.. జీవితం.. సమతూకం: ఇంటి నుంచి పనికి మహిళల ఆసక్తి 

తాజా వార్తలు

Updated : 19/10/2021 12:32 IST

Work From Home: జీతం.. జీవితం.. సమతూకం: ఇంటి నుంచి పనికి మహిళల ఆసక్తి 

 కొవిడ్‌ తర్వాత పెరిగిన అవకాశాలు 

కంపెనీలకు చాలా వరకు ఖర్చు ఆదా 

హైదరాబాద్‌ :కొవిడ్‌ అనంతర పరిణామాలు అనేక మార్పులను తీసుకొచ్చాయి. మహమ్మారి విజృంభణ తర్వాత జీవితకాలం ఒకేచోట ఉద్యోగం చేసే పరిస్థితులు తగ్గుతున్నాయి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, స్వతంత్ర ఉద్యోగాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇంటి నుంచి పని, వారానికి ఐదురోజుల పని, అనువైన పని గంటలు ఉన్న ఉద్యోగాలవైపు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. జీతంతో పాటు జీవితాన్నీ సమతూకం వేసుకుని పనిచేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన అనేక బహుళజాతి కంపెనీలు, కొన్ని అంకుర సంస్థలు ఇంటి నుంచి పనికి అవకాశాలు కల్పిస్తుండటంతో మహిళలు వాటిని అందిపుచ్చుకుంటున్నారు. 

ఆన్‌లైన్‌ టీచింగ్‌

ఎల్‌కేజీ నుంచి పదోతరగతి వరకు ఆంగ్లం, సైన్స్, గణితం, సోషల్‌ సబ్జెక్టులకు ఆన్‌లైన్‌ టీచింగ్‌కు సంబంధించి అనేక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. నెలకు సుమారు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆర్జిస్తున్నారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్, వెర్బల్‌ నైపుణ్యాలు, ఇన్నోవేటివ్‌ టీచింగ్‌ నైపుణ్యాలుంటే ఈ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. తమకిచ్చిన సమయంలో లైవ్‌ తరగతులు నిర్వహించడంతో పాటు వెబినార్లు, వర్క్‌షాపులకు సమన్వయం చేయాలి. కొన్ని సంస్థలు క్యూ అండ్‌ ఏ నిపుణులుగానూ అవకాశాలు కల్పిస్తున్నాయి. విద్యార్థుల నుంచి వచ్చే ప్రశ్నలకు యాప్‌లో సమాధానాలు చెప్పాలన్నమాట.

తాత్కాలికంగా ఇంటి నుంచి పని

కొన్ని బహుళజాతి కంపెనీలు కస్టమర్‌ కేర్‌ అసోసియేట్‌ వంటి ఉద్యోగాలకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి. వీరంతా వినియోగదారుల నుంచి వచ్చే సందేహాలు నివృత్తి చేస్తూ, ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్‌ స్కిల్స్, వెర్బల్‌ స్కిల్స్, డాక్యుమెంటేషన్‌ వంటి అవకాశాలు లభిస్తున్నాయి. విశ్లేషణ సామర్థ్యం, కంప్యూటర్‌ వ్యవస్థ మీద కనీస అవగాహన ఉండాలి. ఇంట్లో ఉండే మహిళలు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. చాట్‌ ప్రాసెస్, ఈమెయిల్‌ ప్రాసెస్‌ కోసం కంపెనీలే కంప్యూటర్, ఇతర కిట్‌లు అందిస్తున్నాయి.

ఇంటి నుంచి పనికే 46 శాతం మొగ్గు

చాలామంది ఇంటి నుంచి పని వెసులుబాటు కల్పించే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారని ‘ఇండీడ్‌’ అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది.

ఉద్యోగార్థుల్లో 46 శాతం మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉన్న వాటికే ప్రాధాన్యం ఇస్తుండగా, పని చేస్తున్న వారిలో 51 శాతం మంది మహిళలు, 29 శాతం పురుషులు ఇంటి నుంచి పని విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. 

సీనియర్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగుల్లో 52 శాతం మంది, మధ్యస్థ స్థాయి ఉద్యోగాల్లో ఉన్న వారు 36 శాతం మంది, జూనియర్‌ స్థాయి ఉద్యోగాల్లో ఉన్న 31 శాతం మంది ఇదే విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. 

 భిన్నాభిప్రాయాలున్నాయి

ప్రస్తుతం హైదరాబాద్‌లో 89.9 శాతం మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కనెక్టివిటీ పెరగడంతో చాలామంది అలాంటి ఉద్యోగాలే కావాలని కోరుకుంటున్నారు. కంపెనీలకు సైతం ఖర్చు తగ్గింది. సహాయ సిబ్బంది వేతనాలు, మౌలిక సదుపాయాల ఖర్చు తగ్గుతుంది. ఉదాహరణకు.. సైబర్‌ టవర్స్‌లో ఓ కార్యాలయంలో వర్క్‌ స్పేస్‌లో ఒకరికి రూ. 5,000 నుంచి రూ.15,000 వరకు ఖర్చవుతుంది. ఇంటి నుంచి పని వల్ల ఆ ఖర్చు తగ్గుతుంది.  - సందీప్‌ మక్తాల, టీటా అధ్యక్షుడు

డిసెంబరులోగా మళ్లీ ఆఫీసులకు 

ఐటీ రంగంలో చాలా కంపెనీలు ఇంటి నుంచి పనికి స్వస్తి పలకాలని ప్రయత్నిస్తున్నాయి. ముందుగా ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు, వైస్‌ ప్రెసిడెంట్లు తదితరులను ముందు కార్యాలయం నుంచి పని చేయాలని ఆదేశించాయి. అందరికీ టీకాలు వేయకపోవడంతో ఇది ఆలస్యమవుతోంది. డిసెంబరులోగా 60 శాతం మంది కార్యాలయాలకు హాజరుకావచ్చని అంచనా.- భరణి ఆరోల్, హైసియా అధ్యక్షుడు-

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని