Covovax: చిన్నారులపై ప్రయోగాలు వద్దు
close

తాజా వార్తలు

Updated : 01/07/2021 12:54 IST

Covovax: చిన్నారులపై ప్రయోగాలు వద్దు

దిల్లీ: రెండు నుంచి 17ఏళ్ల మధ్యవయస్సు వారి పై కొవొవాక్స్‌ క్లినికల్‌ ప్రయోగాలు ఇప్పుడే వద్దని నిపుణుల కమిటీ తెలిపింది. ఈ మేరకు పిల్లలపై ప్రయోగాల కోసం సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని కేంద్రానికి సిఫార్సు చేసింది. 

అమెరికాకు చెందిన నొవావాక్స్‌ అభివృద్ధి చేసిన ఈ కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో ‘కొవొవాక్స్‌’ పేరుతో ఉత్పత్తి చేసేందుకు సీరమ్‌ సంస్థ ఒప్పందంద కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 18ఏళ్లు పైబడినవారిపై ఈ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ను కంపెనీ ప్రారంభించింది. జులై నుంచి చిన్నారులపై కూడా ప్రయోగాలు జరపాలని భావించింది. ఇందుకోసం గత సోమవారం కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది. దేశ వ్యాప్తంగా 10 కేంద్రాల్లో 920 మంది చిన్నారుల (2-11 ఏళ్ల వారు 460 మంది, 12-17 ఏళ్ల వారు 460 మంది)పై రెండు, మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ దరఖాస్తును డీసీజీఐ.. నిపుణుల కమిటీకి పంపించింది.

సీరమ్‌ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ.. ఈ వ్యాక్సిన్‌ ఇంకా ఏ దేశంలోనూ అనుమతి పొందలేదనే విషయాన్ని గుర్తించింది. అందువల్ల ముందు పెద్దలపై ప్రయోగాలు పూర్తి చేయాలని కమిటీ సీరమ్‌కు సూచించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ‘‘ప్రస్తుతం పెద్దలపై జరుగుతున్న కొవొవాక్స్‌ క్లినికల్‌ ప్రయోగాల భద్రత, సమర్థత ఫలితాలను కంపెనీ సమర్పించాలి. ఆ ఫలితాలను పరిశీలించిన తర్వాతే చిన్నారులపై ప్రయోగాల అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం’’ అని కమిటీ సూచించింది. ఈ మేరకు చిన్నారులపై ప్రయోగాలకు సీరమ్‌కు ఇప్పుడే అనుమతులు ఇవ్వొద్దంటూ కేంద్రానికి సిఫార్సులు చేసినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. 

గతేడాది ఆగస్టులో నొవావాక్స్‌తో సీరమ్‌ లైసెన్స్‌ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది మార్చిలో 18ఏళ్లు పైబడినవారిపై క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించింది. సెప్టెంబరు నాటికి ఈ టీకాలను అందుబాటులోకి తీసుకురావాలని సీరమ్‌ భావిస్తోంది. అయితే, అమెరికాలో నొవావాక్స్‌కు అనుమతులు లభించిన తర్వాతనే భారత్‌లోనూ వినియోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే సీరమ్‌ కొవిషీల్డ్‌ టీకాను ఉత్పత్తి చేస్తోన్న విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని