Himachal landslide: ట్వీట్ చేసిన అరగంటలోపే అనంతలోకాలకు..

తాజా వార్తలు

Published : 27/07/2021 01:44 IST

Himachal landslide: ట్వీట్ చేసిన అరగంటలోపే అనంతలోకాలకు..

దిల్లీ: ‘సాధారణ ప్రజలకు అనుమతి ఉన్న భారతదేశపు చిట్టచివరి పాయింట్ వద్ద నేనిప్పుడు నిల్చొని ఉన్నా. ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో చైనా అక్రమించిన టిబెట్‌తో మనకు సరిహద్దు ఉంది’ అంటూ ట్వీట్ చేశారు దీపా శర్మ. ఆ ట్వీట్ చేసిన అరగంటలోపే కొండచరియల రూపంలో ముంచుకొచ్చిన ప్రమాదానికి ఆమె బలయ్యారు. ప్రకృతి ప్రేమికురాలు అయిన ఆమె ప్రకృతి ప్రకోపానికి బలి కావాల్సి వచ్చింది. ‘ఈ ప్రకృతి లేకపోతే మన జీవితమంటూ ఏదీ లేదు’ అంటూ ఆమె షేర్‌ చేసిన చిత్రాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఆదివారం హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా సాంగ్లా లోయలో కొండచరియలు విరిగి పర్యాటకుల వాహనంపై పడటంతో తొమ్మిది మంది మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తొమ్మిది మందిలో రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన దీపా శర్మ(34) కూడా ఉన్నారు. ట్విటర్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఆమె ఒక ఆయుర్వేద వైద్యురాలు. హిమాచల్ ప్రదేశ్‌లో ఆమె పర్యటనకు సంబంధించిన ప్రతి దృశ్యాన్ని ట్వీట్ చేశారు. అలా మధ్యాహ్నం 12.59కు నాగస్థి ఐటీబీపీ చెక్ పోస్టు వద్ద దిగిన చిత్రాన్ని ఆమె పోస్టు చేశారు. సాధారణ ప్రజలకు అనుమతి ఉన్న చివరి ప్రదేశం ఇదేనంటూ రాసుకొచ్చారు. అయితే అదే చివరి ట్వీట్ అవుతుందని ఆమెకు అప్పుడు తెలియలేదు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.25 గంటలకు ఆమె ప్రయాణిస్తోన్న వాహనంపై కొండచరియలు విరిగి పడటంతో ప్రాణాలు కోల్పోయారు. ఆమె వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే.. వైద్యం అందించడంతో పాటు ఫొటోగ్రఫీ, ట్రావెలింగ్‌, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం ఆమెకు ఇష్టమైన అంశాలని తెలుస్తోంది. అలాగే మహిళా సాధికారత కోసం ఒక ఎన్జీఓతో కలిసి పనిచేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఆ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఇటీవలే అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భూకంపం వచ్చినట్లుగా ఒక్కసారిగా కొండపై నుంచి రాళ్లు కిందకు వేగంగా దూసుకొచ్చాయి. దాంతో వంతెన రెండు ముక్కలైంది. పలు వాహనాలు, విశ్రాంతి గదులు ధ్వంసమయ్యాయి. కాగా, మృతుల కుటుంబ సభ్యులకు కేంద్రం రూ.2లక్షల పరిహారాన్ని ప్రకటించింది.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని