2 నిమిషాలు తొందర.. జీతంలో కోత!

తాజా వార్తలు

Updated : 18/03/2021 09:13 IST

2 నిమిషాలు తొందర.. జీతంలో కోత!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆఫీసుకు సమయానికి వెళ్లడం.. సమయానికి విధులు ముగించుకొని తిరిగి రావడం ఉద్యోగులకు పెద్ద సవాలే. ఇతర పనులు, ట్రాఫిక్‌ జామ్‌ వంటివి ఇందుకు కారణమవుతుంటాయి. అయినా ఎలాగో అలా కష్టపడుతూ ఉద్యోగంలో సమయపాలన పాటిస్తుంటారు. అయితే, అప్పుడప్పుడు ఏదైనా పని పడితే.. ఆఫీసు పని గంటలు పూర్తికాక ముందే కొందరు తొందరగా ఇంటికి వెళ్లిపోవడం చూస్తూనే ఉంటాం. ఇది పెద్ద నేరమేమి కాదు. కానీ, జపాన్‌లోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు పనిగంటల కంటే రెండు నిమిషాల ముందు ఇంటికి వెళ్లిపోతున్నారని తెలిసి ప్రభుత్వం వారి జీతాల్లో కోత విధించింది. 

జపాన్‌లోని ఫునబషి నగరంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ పనిచేసే కొంత మంది ఉద్యోగులు మే 2019 నుంచి జనవరి 2021 కాలం మధ్య 316 సార్లు ఆఫీసు టైం కంటే రెండు నిమిషాలు ముందుగా ఇంటికి వెళ్లిపోయారట. అంతేకాదు, వారి విధుల సమయాన్ని రికార్డుల్లో తప్పుగా నమోదు చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ కార్యాలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అసిస్టెంట్‌ సెక్షన్‌ చీఫ్‌ అధికారిణే ఇందుకు బాధ్యురాలిగా తేలింది. ఆమె తొందరగా వెళ్లడమే కాకుండా.. ఆమె ప్రోత్సాహంతోనే ఇతర ఉద్యోగులు కూడా ఆఫీస్‌ టైం కంటే ముందే వెళ్తుండటంపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఈ ఘటనలో ప్రధాన బాధ్యుల జీతాల్లో మూడు నెలలపాటు పదిశాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే మరికొందరు ఉద్యోగులకు హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసింది. జపాన్‌లో సంస్థలైనా, ప్రభుత్వమైనా పని విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాయని తెలిసిందే. సమయపాలన పాటించకపోవడాన్ని అస్సలు ఉపేక్షించవు. అక్కడి రైళ్లు కాస్త ఆలస్యమైనా రైల్వే అధికారులు ప్రయాణికులకు క్షమాపణ చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఆలస్యానికి రైలే కారణమని ప్రయాణికులకు ధ్రువీకరణ పత్రాలు కూడా ఇస్తుంటారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఆఫీసుల్లో సమయపాలన ఏ విధంగా ఉంటుందో..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని