భారత్‌తో మా బంధం దృఢమైనది

తాజా వార్తలు

Updated : 21/03/2021 10:37 IST

భారత్‌తో మా బంధం దృఢమైనది

అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌

దిల్లీ: ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా నిశ్చయించాయి. ఇందుకు ఉభయ సైన్యాల మధ్య సహకారాన్నీ, లాజిస్టిక్‌ సాయాన్నీ పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. చైనా దురాక్రమణ, ఆధిపత్య ధోరణి కనబరుస్తున్న ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో... భారత్‌తో తమకు దృఢమైన భాగస్వామ్యం ఉందని అమెరికా ఉద్ఘాటించింది. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ల మధ్య శనివారమిక్కడ విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. ఉభయ దేశాలు ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లు, తూర్పు లద్దాఖ్‌లో చైనా దూకుడు వంటి అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం లాయిడ్‌ శుక్రవారం భారత్‌కు వచ్చారు.
మరిన్ని రంగాల్లో మున్ముందుకు...
భేటీ అనంతరం లాయిడ్‌ మాట్లాడారు. ‘‘ఇండో-పసిఫిక్‌ ప్రాంత సుస్థిరతకు భారత్‌-అమెరికా బంధం అత్యంత కీలకం. ఉభయ దేశాల మధ్య దృఢమైన రక్షణ బంధానికి బైడెన్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. సమాచార వినిమయం, లాజిస్టిక్‌ సహకారం, కృత్రిమ మేధ, అంతరిక్షం, సైబర్‌ రంగాల్లోనూ మరింతగా కలిసి ముందుకెళ్లాలని భావిస్తున్నాం. భావసారూప్య క్వాడ్, ఏసియాన్‌ దేశాలతో కలిసి పనిచేసే అంశంపైనా చర్చించాం’’ అని ఆయన చెప్పారు. అంతకుముందు దిల్లీలోని యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు ఆస్టిన్‌ నివాళులు అర్పించారు. విజ్ఞాన్‌భవన్‌లో సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.
30 డ్రోన్ల కొనుగోలుకు భారత్‌ ప్రతిపాదన
అమెరికా రక్షణ తయారీ సంస్థ జనరల్‌ ఆటోమిక్స్‌ నుంచి 30 మల్టీమిషన్‌ ఆర్డ్మ్‌ ప్రిడేటర్‌ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు భారత్‌ ప్రతిపాదించినట్టు సమాచారం. గాలిలో ఏకబిగిన 35 గంటలపాటు ఉండగల ఈ డ్రోన్లు... భూ, సాగరాలపై లక్ష్యాలను చేరుకోగలవు. వీటిని కొనుగోలు చేసేందుకు సుమారు రూ.21,732 కోట్లు (3 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) వెచ్చించాల్సి ఉంటుంది.

రష్యా క్షిపణుల కొనుగోళ్లపైనా... 
రష్యా నుంచి ఎస్‌-400 వైమానిక రక్షణ క్షిపణులను కొనుగోలు చేసేందుకు భారత్‌ 2018లో కుదుర్చుకున్న ఒప్పంద విషయమూ మంత్రుల మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఈ ఒప్పందం కారణంగా భారత్‌పై నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆంక్షలు విధించవచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ క్షిపణులను కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా ఆంక్షలు విధించింది.
భారత్‌లో మైనార్టీల హక్కులను ఉల్లంఘిస్తున్న విషయమై పలువురు కేంద్ర మంత్రులతో చర్చించినట్టు లాయిడ్‌ ఆస్టిన్‌ విలేకరులకు వెల్లడించారు. అయితే ఈ విషయంపై మోదీతో మాట్లాడే అవకాశం తనకు రాలేదని చెప్పారు.

చర్చలు ఫలప్రదం : రాజ్‌నాథ్‌
అమెరికా రక్షణమంత్రితో చర్చలు ఫలప్రదంగా జరిగాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ‘‘భారత సైన్యం- యూఎస్‌ ఇండో-పసిఫిక్, సెంట్రల్, ఆఫ్రికా కమాండ్ల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఆస్టిన్‌ అంగీకరించారు. 21వ శతాబ్దంలో చెప్పుకోదగ్గ భాగస్వామ్యంగా భారత్‌-అమెరికా రక్షణ బంధం ఉండాలని కోరుకుంటున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌ కూడా ఆస్టిన్‌తో భేటీ అయ్యారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని