Pfizer: భారత్‌ కోరినా.. ముందుకురాని ఫైజర్‌..!

తాజా వార్తలు

Published : 06/07/2021 20:26 IST

Pfizer: భారత్‌ కోరినా.. ముందుకురాని ఫైజర్‌..!

ఇంకా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోని అమెరికా సంస్థ

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ఉత్పత్తిని దేశీయంగా చేస్తున్నప్పటికీ విదేశీ టీకాల అనుమతులను భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే మెడెర్నా టీకాను దిగుమతి చేసుకునేందుకు సిప్లా సంస్థకు అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో అమెరికాకు చెందిన మరో వ్యాక్సిన్‌ సంస్థ ఫైజర్‌కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు కోరినప్పటికీ ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.

రెండుసార్లు కోరినా..

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ వేగవంతంగా చేపడుతున్నప్పటికీ అవసరమైన డోసులు అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ చేయనవసరం లేకుండానే విదేశీ టీకాలకు అనుమతి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా విదేశీ టీకా సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మోడెర్నాకు అనుమతి ఇవ్వగా.. ఫైజర్‌తోనూ సంప్రదింపులు చివరిదశకు వచ్చాయని ఇరు వర్గాలు వెల్లడించాయి. అత్యవసర వినియోగ అనుమతి (EUA) కోసం దరఖాస్తు చేసుకోవాలని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) ఇప్పటికే రెండుసార్లు ఫైజర్‌ను కోరింది. తద్వారా అనుమతి ప్రక్రియ వేగవంతం చేస్తామని వెల్లడించింది. అంతేకాకుండా టీకాలు సరఫరా చేశాక వాటిపై ఏమైనా న్యాయపరమైన చిక్కులు, నష్టపరిహార సమస్యలు (ఇండెమ్నిటీ) ఎదురైతే బాధ్యత తీసుకోవడంపైనా కేంద్ర ప్రభుత్వం కొంతవరకు హామీ ఇచ్చేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఫైజర్‌ సంస్థ ఇప్పటికీ దరఖాస్తు చేసుకోలేదు.

అమెరికాకు చెందిన ఫైజర్‌- జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ సంస్థలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌ను నిరోధించడంలో 95శాతానికిపైగా సమర్థత కలిగివున్నట్లు వెల్లడైంది. మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ టీకాను అమెరికా, ఇజ్రాయెల్‌లో భారీస్థాయిలో పంపిణీ చేస్తున్నారు. దీంతో అక్కడ వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి రావడంతోపాటు కొత్త వేరియంట్లపైనా పనిచేస్తున్నట్లు తేలింది. ఈ సమయంలో భారత్‌లోనూ ఫైజర్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాంకేతిక, వాణిజ్య సమస్యలు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని