షాకింగ్‌.. రద్దయిన చట్టం కింద ఇంకా కేసులా?

తాజా వార్తలు

Published : 05/07/2021 14:05 IST

షాకింగ్‌.. రద్దయిన చట్టం కింద ఇంకా కేసులా?

కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దిల్లీ: ఆరేళ్ల క్రితం సుప్రీంకోర్టు రద్దు చేసిన ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏ కింద ఇంకా దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదవుతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమైన పరిణామమని అభివర్ణించింది. దీనిపై సమాధానమివ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ఓ కేసు విచారణ సందర్భంగా ఐటీ చట్టంలో సెక్షన్‌ 66ఏను రద్దు చేస్తున్నట్లు 2015 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పోలీసు సిబ్బందికి సమాచారమివ్వాలని 2019లోనే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఇంకా పలు చోట్ల పోలీసులు సెక్షన్‌ 66ఏ కింద కేసులు నమోదు చేస్తుండటంపై పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ అనే ఎన్జీవో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ సెక్షన్‌ కింద గత ఆరేళ్లలో దేశవ్యాప్తంగా వెయ్యికి పైనే కేసులు నమోదయ్యాయని, దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎన్జీవో అభ్యర్థించింది.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఇది చాలా దిగ్భ్రాంతికరం. దారుణమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి’’ అని పేర్కొంది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

సోషల్‌మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర కంటెంట్‌ను పోస్ట్‌ చేసిన వారిని సెక్షన్‌ 66ఏ కింద అరెస్టు చేసేందుకు వీలుండేది. ఈ సెక్షన్‌ ప్రకారం.. నిందితులకు మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించొచ్చు. అయితే పలు రాష్ట్రాల్లో ఈ సెక్షన్‌ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. 2015లో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ విచారణ సందర్భంగా సెక్షన్‌ 66ఏను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని