close

తాజా వార్తలు

Published : 08/03/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

50శాతం కోటా: అన్ని రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు!

అభిప్రాయం తెలపాలని వెల్లడి

దిల్లీ: మహారాష్ట్రలో 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై అన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయం తెలపాలని భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఇందులో భాగంగా, అన్ని రాష్ట్రాలకు తాజాగా నోటీసులు జారీచేసింది. మరాఠా రిజర్వేషన్లు 50శాతానికి మించరాదన్న తీర్పును పరిశీలనకు స్వీకరించిన సుప్రీం కోర్టు కేసును మార్చి 15కు వాయిదా వేసింది.

50శాతం రిజర్వేషన్లపై గత తీర్పును సమీక్షించాలో వద్దో కూడా నిర్ణయిస్తామని మరాఠా రిజర్వేషన్ల విషయంలో ఏర్పాటైన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌లతో కూడిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం వెల్లడించింది. అయితే, దీనిపై సుప్రీం ఇచ్చే తీర్పు అన్ని రాష్ట్రాలపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో, 50శాతానికి మించి రిజర్వేషన్లపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. అనంతరం ఈ కేసు విచారణను మార్చి 15కు వాయిదా వేసింది. రిజర్వేషన్లు 50శాతానికి మించి ఉండరాదని 1992లో ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును కూడా ధర్మాసనం పరిశీలించే అవకాశం ఉంది.

వెనుకబడిన తరగతులకు సామాజికంగా, విద్యాపరంగా రిజర్వేషన్‌ కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం (SEBC) చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ నిర్ణయం రిజర్వేషన్లపై ఉన్న 50శాతం పరిమితిని దాటింది. ఈ అంశం తొలుత బాంబే హైకోర్టుకు చేరింది. విచారణ జరిపిన హైకోర్టు, రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని అసాధారణ పరిస్థితుల్లో అధిగమించవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. అనంతరం సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్లింది. దీనిపై స్టే విధించిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. తాజాగా దీనిపై విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు, మార్చి 15నుంచి రోజు విడిచి రోజు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, మరాఠా రిజర్వేషన్‌ చట్టాన్ని తీసుకొచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆది నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ చట్టం అమలులోకి వచ్చే వరకూ ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని మరాఠా క్రాంతి మోర్చా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుండడంతో ఉద్యోగ నియామకాలపైనా మహారాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని