
తాజా వార్తలు
దేశంలో రికవరీలు 50 రెట్లు
వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ
దిల్లీ: దేశంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల కంటే రికవరీలు 50 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది. కరోనాను ఎదుర్కోవడంలో ఇదొక మైలురాయిగా వారు అభివర్ణించారు. సోమవారం క్రియాశీల కేసులు 2లక్షల ఎనిమిదివేలు ఉండగా, రికవరీలు కోటీ రెండు లక్షల 11వేలు ఉన్నట్లు వారు వెల్లడించారు. దీంతో భారత్లో కొవిడ్-19 రికవరీ రేటు 96.59శాతానికి చేరింది. గడచిన 24 గంటల్లో 13,788 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 14,457 రికవరీలున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల్లో స్థిరమైన క్షీణత నమోదవుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. సుమారు ఎనిమిది నెలల తర్వాత 150కన్నా తక్కువ (145) మరణాలు నమోదైనట్లు వారు పేర్కొన్నారు.
గడచిన 24 గంటల్లో 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కువ (71.70 శాతం) రికవరీలు నమోదయ్యాయని వారు తెలిపారు. రికవరీల్లో కేరళ (4,408) మొదటిస్థానంలో ఉండగా, మహారాష్ట్ర (2,342), కర్ణాటక (855) తర్వాతి స్థానాల్లో ఉన్నాయన్నారు. 76శాతం పాజిటివ్ కేసులు ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదవుతున్నాయన్నారు. పాజిటివ్ కేసుల్లో కేరళ (5,005) మొదటి స్థానంలో ఉండగా, మహరాష్ట్ర (3,081), కర్ణాటక (745) కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కరోనా మరణాల్లో మహారాష్ట్ర ఎక్కువగా 50 మరణాలు నమోదు చేసింది.
ఇవీ చదవండి..
పాక్లో మోదీకి జేజేలు.. ఎందుకంటే
నోటితో కారును వెనక్కు లాగిన పులి