ఇక డ్రోన్ల కోసం ప్రత్యేక నడవాలు

ప్రధానాంశాలు

Published : 16/07/2021 06:00 IST

ఇక డ్రోన్ల కోసం ప్రత్యేక నడవాలు

వినియోగం, మంజూరు ప్రక్రియ మరింత సులభతరం
 కొత్త ముసాయిదా నిబంధనలను ప్రకటించిన కేంద్రం

దిల్లీ: దేశంలో డ్రోన్ల వినియోగాన్ని మరింత సులభతరం చేసేలా కేంద్రం కొత్త విధానంతో ముందుకు వచ్చింది. అనుమతుల ప్రక్రియ నుంచి ఫీజుల వరకు భారీగా మార్పులు చేసింది. డ్రోన్లు తిరిగేందుకు ప్రత్యేక నడవా(కారిడార్‌)లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ.. డ్రోన్‌ నియమాలు-2021 పేరిట కొత్త ముసాయిదాను రూపొందించింది. ఇది అమల్లోకి వస్తే ఈ ఏడాది మార్చిలో తెచ్చిన మానవరహిత ఎయిర్‌ క్రాఫ్ట్‌ సిస్టమ్‌ (యూఏఎస్‌) నిబంధనలు రద్దు అవుతాయి. ఈ కొత్త నియమాలు.. డ్రోన్ల రంగ అభివృద్ధికి ఉపయోగపడతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా డ్రోన్లు సరికొత్త సాంకేతిక విప్లవాన్ని తీసుకొస్తున్నాయి. ఖర్చులను తగ్గిస్తున్నాయి. సమయాన్ని ఆదా చేస్తున్నాయి. ఈ కొత్త సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ముఖ్యంగా అంకుర సంస్థలకు ఇది ఎంతో మేలు చేస్తుంది’’ అని సింధియా ట్విట్‌ చేశారు. ఈ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను ఆగస్టు 5లోపు తెలపాలని పౌర విమానయాన శాఖ కోరింది.

ఆగస్టు 16 వరకూ దిల్లీలో డ్రోన్లపై నిషేధం

పంద్రాగస్టు వేడుకలను దృష్టిలో పెట్టుకుని దేశ రాజధానిలో డ్రోన్లు, పారాచూట్లు, హాట్‌-ఎయిర్‌-బెలూన్ల వంటి ఎగిరే వస్తువులను నిషేధిస్తున్నట్టు దిల్లీ పోలీసు కమిషనర్‌ బాలాజీ శ్రీవాస్తవ గురువారం వెల్లడించారు. శుక్రవారం నుంచి ఆగస్టు 16 వరకూ 32 రోజులపాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. జమ్ములో కట్టుదిట్టమైన భద్రత ఉన్న భారత వాయుసేన స్థావరాలకు సమీపంలో ఇటీవల డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పౌరుల భద్రతకు ముప్పు పొంచి ఉందని పోలీసు వర్గాలకు హెచ్చరికలు అందాయి.

ముసాయిదాలో కీలకాంశాలు
* విశ్వసనీయత, స్వీయ ధ్రువీకరణ ఆధారంగా కొత్త ముసాయిదా నిబంధనలను రూపొందించారు.

* ఆన్‌లైన్‌లో సింగిల్‌ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తారు. ఇందులో మానవ ప్రమేయాన్ని చాలా వరకు తగ్గించారు.

* గత నిబంధనల ప్రకారం 25 ధ్రువపత్రాలు భర్తీ చేయాలి.. దీన్ని 6కు పరిమితం చేశారు.

* ఫీజుల ధరలను భారీగా తగ్గించారు. డ్రోన్‌ సైజుతో సంబంధం లేకుండా వీటిని వసూలు చేయనున్నారు.

* వాణిజ్యేతర ప్రయోజనాల కోసం వాడే మైక్రో డ్రోన్లకు, పరిశోధన, అభివృద్ధి సంస్థలు వినియోగించే నానో డ్రోన్లకు పైలెట్‌ లైసెన్సు అవసరం లేదు.

* గ్రీన్‌జోన్లలో 400 అడుగులు, విమానాశ్రయాలకు 8 నుంచి 12 కిలోమీటర్ల మధ్యలో 200 అడుగులు ఎత్తు వరకు సంచారం కోసం ఎలాంటి అనుమతులు అక్కర్లేదు.

* డ్రోన్ల బదిలీ, రిజిస్ట్రేషన్‌ రద్దు ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

* సరకుల రవాణా కోసం డ్రోన్ల నడవాలను అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం డ్రోన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు.

* భారత్‌లో నమోదైన విదేశీ సంస్థలు కూడా డ్రోన్లతో కార్యకలాపాలు నిర్వహించవచ్చు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన