పతకం లేదు.. ఆట పర్వాలేదు

ప్రధానాంశాలు

Updated : 26/07/2021 04:26 IST

పతకం లేదు.. ఆట పర్వాలేదు

తొలి రోజు మీరాబాయి రజతం గెలిచింది. రెండో రోజు స్వర్ణమే దక్కుతుందా అంటూ ఆశగా చూసిన భారత క్రీడాభిమానులకు నిరాశే మిగిలింది. పసిడి కాదు కదా.. ఆదివారం ఏ పతకమూ దక్కలేదు. షూటింగ్‌లో మళ్లీ విఫల బాటే. హాకీ, టెన్నిస్‌లోనూ నిరాశాజనక ఫలితాలే. అయితే స్వర్ణమే తన లక్ష్యం అంటూ టోక్యోలో అడుగు పెట్టిన షట్లర్‌ పి.వి.సింధు.. మరో ఒలింపిక్‌ పతకంతో కెరీర్‌ను ఘనంగా ముగిస్తానని పంతం పట్టిన దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ ఘనవిజయాలు సాధించి అభిమానులకు ఊరట కలిగించారు. టీటీ స్టార్‌ మనిక బాత్రా సంచలన విజయం కూడా ఆదివారం ఆటలో మరో హైలైట్‌.


సింధు శుభారంభం
తొలి మ్యాచ్‌లో సాధికారిక విజయం
టోక్యో

ఒలింపిక్స్‌ను భారత స్టార్‌, ప్రపంచ ఛాంపియన్‌ పి.వి.సింధు ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో సాధికారిక విజయంతో సత్తాచాటింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ గ్రూపు-జె పోరులో ఆరో సీడ్‌ సింధు 21-7, 21-10తో 58వ ర్యాంకర్‌ సెనియా  పొలికర్పోవా (ఇజ్రాయెల్‌)పై గెలుపొందింది. కేవలం 29 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తుచేసింది. గ్రూపులో తర్వాతి మ్యాచ్‌లో చూంగ్‌ నాన్‌ (హాంకాంగ్‌)తో సింధు తలపడుతుంది. మ్యాచ్‌ ఏదైనా ఏకాగ్రత విషయంలో రాజీపడనని సింధు మరోసారి నిరూపించింది. పొలికర్పోవా తనకంటే తక్కువ ర్యాంకు క్రీడాకారిణే అయినా సింధు తేలిగ్గా తీసుకోలేదు. తొలి గేమ్‌లో మొదటి రెండు పాయింట్లు కోల్పోయిన సింధు గాడిన పడటానికి ఎంతోసేపు పట్టలేదు. 3-4తో ప్రత్యర్థిని సమీపించిన సింధు వరుస పాయింట్లతో 11-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్‌ షాట్‌లతో పొలికర్పోవాను హడలెత్తించింది. వరుసగా 13 పాయింట్లు నెగ్గిన సింధు   21-7తో 13 నిమిషాల్లోనే తొలి గేవ్‌ నెగ్గింది. రెండోది తొలి గేమ్‌కు రిప్లేలా సాగింది. 9-3తో ఆధిక్యం సంపాదించిన సింధుకు ప్రత్యర్థి నుంచి పోటీయే లేదు.   11-4తో ముందంజ వేసిన సింధు విరామానంతరం మరింతగా చెలరేగింది. పొలికర్పోవాను ర్యాలీలతో కోర్టు చుట్టూ తిప్పిన సింధు కళ్లుచెదిరే స్మాష్‌తో మ్యాచ్‌ను ముగించింది.


ప్రత్యర్థి తక్కువ ర్యాంకు క్రీడాకారిణే అయినా మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోలేదు. కోర్టు వాతావరణం అలవాటయ్యేందుకు కొన్నిసార్లు ర్యాలీలు ఆడా. అన్ని స్ట్రోక్‌లు ఆడటం కీలకం. రియో ఒలింపిక్స్‌తో పోలిస్తే ఇప్పుడు మానసికంగా, శారీరకంగా, అనుభవం పరంగా చాలా మార్పొచ్చింది. గత కొన్నేళ్లుగా ఎంతో కష్టపడ్డా. ఇప్పుడు సత్తాచాటే సమయం వచ్చేసింది. దూకుడు, టెక్నిక్‌ మీద చాలా శ్రమించా. కచ్చితంగా భిన్నమైన సింధును చూస్తారు.

- సింధు


అదర గొట్టిన మనిక

టేబుల్‌ టెన్నిస్‌లో భారత యువ కెరటం మనిక బాత్రా స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో 94వ ర్యాంకర్‌ మనిక 4-11, 4-11, 11-7, 12-10, 8-11, 11-5, 11-7తో ప్రపంచ 32వ ర్యాంకర్‌ పెసోకా (ఉక్రెయిన్‌)ను కంగుతినిపించింది. తొలి రెండు గేమ్‌లు కోల్పోయినా ఒత్తిడిని తట్టుకుంటూ వరుసగా రెండు గేమ్‌లు గెలిచి మ్యాచ్‌లో నిలిచిన మనిక.. ఆ తర్వాత 6, 7 గేమ్‌లను సొంతం చేసుకుని విజయాన్ని అందుకుంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో సత్యన్‌ 3-4తో లామ్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓడాడు. రోయింగ్‌లో అర్జున్‌ లాల్‌ జాట్‌-అరవింద్‌ సింగ్‌ పురుషుల లైట్‌ వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. రెపిచేజ్‌ రౌండ్లో భారత జోడీ 6 నిమిషాల 51.36 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంతో రేసును ముగించింది. 27న సెమీఫైనల్‌ జరగనుంది.


మేరీ తొలి అడుగు

భారత స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ టోక్యో ఒలింపిక్స్‌లో తొలి అడుగు వేసింది. మహిళల 51 కిలోల తొలి రౌండ్లో ఆమె 4-1తో హెర్నాండెజ్‌ గర్సియా (డొమినికా)ను ఓడించింది. ఈ పోరు ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన మేరీ బౌట్‌పై పట్టు సాధించింది. తన ఆయుధమైన కుడి చేతి పంచ్‌తో పాయింట్లు సాధించిన ఆమె.. ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వలేదు. చివర్లో గర్సియా కొన్ని మెరుపు పంచ్‌లు విసిరినా.. పటిష్టమైన డిఫెన్స్‌తో మేరీ బౌట్‌ను చేజిక్కించుకుంది. ప్రిక్వార్టర్స్‌లో ఇన్‌గ్రిట్‌ వాలెన్సియా (కొలంబియా)తో మేరీ తలపడనుంది. వాలెన్సియా 2016 రియో ఒలింపిక్స్‌ కాంస్యం గెలిచింది. అయితే 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్‌ఫైనల్‌తో పాటు ఆమెతో ఇప్పటిదాకా ఆడిన రెండు బౌట్లలో మేరీదే పైచేయి అయింది. మరోవైపు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత మనీశ్‌ కౌశిక్‌ (63 కిలోలు) ఓడిపోయాడు. పురుషుల తొలి రౌండ్లో మనీశ్‌ 1-4తో ల్యూక్‌ మెక్‌కార్‌మక్‌ (బ్రిటన్‌) చేతిలో పరాజయం చవిచూశాడు.


సానియా జోడీ ఔట్‌

టెన్నిస్‌లో సానియామీర్జా-అంకిత రైనా జోడీ నిష్క్రమించింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో సానియా-అంకిత 6-0, 6-7 (0-7), 8-10తో ఉక్రెయిన్‌ జోడీ నాడియా-లిడ్‌మలా చేతిలో ఓటమి చవిచూశారు. తొలి సెట్లో ప్రత్యర్థికి ఒక్క గేమ్‌ కూడా ఇవ్వకుండా గెలిచిన సానియా జోడీ.. రెండో సెట్లో 5-3తో మ్యాచ్‌ కోసం సర్వీస్‌ చేసే స్థితిలో ఉండి ఓడిపోవడం గమనార్హం. రెండో సెట్‌ను టైబ్రేకర్‌లో గెలిచిన ఉక్రెయిన్‌ జంట.. మూడో సెట్లోనూ పట్టుదలగా ఆడి విజయాన్ని అందుకుంది.


హాకీలో చిత్తుగా..

పూల్‌-ఎ తొలి మ్యాచ్‌లో  న్యూజిలాండ్‌పై స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకున్న భారత  పురుషుల హాకీ జట్టు రెండో మ్యాచ్‌లో 1-7 గోల్స్‌తో ప్రపంచ నంబర్‌వన్‌ ఆస్ట్రేలియా చేతిలో చిత్తయింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడి గోల్‌ మీద గోల్‌ చేసిన ఆస్ట్రేలియా 23 నిమిషాల తర్వాత  4-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. మధ్యలో దిల్‌ప్రీత్‌ సింగ్‌ (34వ ని) బంతిని గోల్‌పోస్టులోకి పంపి భారత్‌ ఖాతా తెరిచినా.. ఆస్ట్రేలియా జోరు తగ్గలేదు. 40, 42, 51 నిమిషాల్లో గోల్స్‌ సాధించిన ఆ జట్టు మన్‌ప్రీత్‌ బృందానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.


జిమ్నాస్టిక్స్‌లో ప్రణతి విఫలం

భారత్‌ తరఫున జిమ్నాస్టిక్స్‌లో ఏకైక అథ్లెట్‌గా బరిలో దిగిన ప్రణతి నాయక్‌ ఆర్టిస్టిక్‌ ఆల్‌రౌండ్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌, వాల్ట్‌, అన్‌ఈవెన్‌ బార్స్‌, బ్యాలెన్స్‌ బీమ్‌లో కలిపి 42.565 స్కోరు సాధించిన ప్రణతి.. ఓవరాల్‌గా 29వ స్థానంలో నిలిచింది. ప్రణతి.. తానాడిన అన్ని ఈవెంట్లలో ఆఖరి స్థానంలో నిలిచింది. గత ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్‌ వాల్ట్‌ ఫైనల్‌ చేరి నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. సెయిలింగ్‌లో భారత క్రీడాకారులు వెనకబడ్డారు. తొలిరోజు లేజర్‌ రేడియల్‌ రెండు రేసుల తర్వాత నేత్ర కుమనన్‌ 27వ స్థానంలో.. ఒక రేసులో పాల్గొన్న విష్ణు 14వ స్థానంలో నిలిచారు. స్విమ్మింగ్‌లో మానా పటేల్‌ ఓవరాల్‌గా 39వ స్థానానికి పరిమితమైంది. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ఆమె విఫలమైంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన