close

ప్రధానాంశాలు

Updated : 12/04/2021 05:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

30 ఏళ్లకే వీలునామాలు!

చైనా యువతకు కరోనా తెచ్చిన ప్రాణ భయం

బీజింగ్‌: చైనా వాసులను ముఖ్యంగా యువతను కరోనా బాగా వణికిస్తోంది. ఇది ప్రాణం మీదికి తెస్తుందేమోనని అనుమానిస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా తమ ఆస్తులు ఎవరికి చెందాలో వీలునామా రాస్తున్నారు. ఇలా రాస్తున్న వారిలో 30 ఏళ్ల వారు అధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. 18 ఏళ్లు దాటిన వారు ఎవరైనా వీలునామా రాసేందుకు అవకాశం ఉంది. 2013లో ప్రభుత్వం వీలునామా రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటికి వెళ్తున్న వారి సంఖ్య ప్రస్తుతం బాగా పెరిగింది. దీనిపై సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక కథనాన్ని ప్రచురించింది. వీలునామాలు రాసే ధోరణి 2019-20 నుంచి అధికంగా కనిపిస్తోంది. 1990 తర్వాత జన్మించిన వారు ఎక్కువగా వీలునామాలు రాస్తున్నారు. దాదాపు 80 శాతం మంది యువత తమ పొదుపు సొమ్ముపై వీలునామాలు సిద్ధం చేస్తున్నారు. కనీసం 70 శాతం మంది స్థిరాస్తులపై పత్రాలు రాస్తున్నారు. విదేశాలలో ఉండేవారు కూడా ఇక్కడ ఉన్న తమ ఆస్తులను చక్కబెట్టే పనుల్లో ఉన్నారు. గ్వాంగ్డాంగ్‌లోని వీలునామా కేంద్రం డైరెక్టర్‌ యాంగ్‌ యింగి మాట్లాడుతూ ‘‘కరోనా వైరస్‌ వచ్చిన దగ్గర నుంచి చాలా మంది మరణం గురించి ఆలోచిస్తున్నారు. అందులో యువతే ఎక్కువగా ఉంది. తాము మరణిస్తే ఆస్తులు ఏమైపోతాయో, పిల్లలను, తల్లిదండ్రులను ఎవరు పోషిస్తారో అని బెంగపడుతున్నారు’’ అని చెప్పారు. గ్వాంగ్జౌ పట్టణానికి చెందిన జియా హో అనే మహిళ కూడా వీలునామా రాశారు. అమె మాట్లాడుతూ ‘‘వీలునామా రాసిన తర్వాత సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తోంది. నా మరణం తర్వాత కూడా నా వారికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అందుకే వారి పేరున రాశాను’’ అని చెప్పారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన