250 మంది తాలిబన్ల హతం

ప్రధానాంశాలు

Published : 02/08/2021 04:52 IST

250 మంది తాలిబన్ల హతం

వంద మందికి గాయాలు
తీవ్రవాద స్థావరాలపై అఫ్గాన్‌ ప్రభుత్వ వైమానిక దాడులు
కాందహార్‌ విమానాశ్రయంపైకి మిలిటెంట్ల రాకెట్లు

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లను నగరాల నుంచి ఖాళీ చేయించడానికి భద్రత బలగాలు వైమానిక దాడులను ముమ్మరం చేశాయి. గత 24 గంటల్లో దాదాపు 250 మంది తాలిబన్‌ మిలిటెంట్లను మట్టుబెట్టాయి. ఈ దాడుల్లో మరో 100 మంది గాయపడ్డారు. కాందహార్‌ ప్రావిన్స్‌లోని ఝెరాయ్‌ జిల్లాలో జరిగిన దాడుల్లో భారీగా ఉగ్రవాదులు మరణించారని అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియో ఉంచింది. తాలిబన్ల రహస్య స్థావరంగా భావిస్తున్న కట్టడం ఒకటి అందులో ధ్వంసమైంది. దేశం నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ చివరి దశకు చేరుకున్న తరుణంలోనే తాలిబన్లు తిరిగి వివిధ ప్రాంతాలను ఆక్రమించుకోవడం మొదలు పెట్టడంతో తాజా దాడులు జరిగాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలను, కీలకమైన సరిహద్దు ప్రాంతాలను, ప్రావిన్స్‌ రాజధానులను ఆక్రమించుకున్న తాలిబన్లు శనివారం రాత్రి కాందహార్‌ విమానాశ్రయంపై రాకెట్ల దాడికి పాల్పడ్డారు. దీంతో అధికారులు అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. ‘‘శనివారం రాత్రి విమానాశ్రయంపై మూడు రాకెట్లను ప్రయోగించారు. వాటిలో రెండు రన్‌వేను తాకాయి. ఎలాంటి ప్రాణనష్టం లేదు’’ అని తెలిపారు. దక్షిణ కాందహార్‌ ప్రావిన్స్‌లో ప్రయాణికుల ట్యాక్సీపై మోర్టార్‌ షెల్‌ పడడంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. అఫ్గానిస్థాన్‌ సాయుధ దళాల అధికార ప్రతినిధి జనరల్‌ అజ్మర్‌ ఒమర్‌ షిన్వారీ మాట్లాడుతూ.. దక్షిణ, పశ్చిమ అఫ్గానిస్థాన్‌లోని మూడు ప్రావిన్స్‌లలో భద్రత పరిస్థితులు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మాండ్‌ ప్రావిన్స్‌లో తాలిబన్ల కదలికలను అడ్డుకోవడానికి సైన్యం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. దక్షిణ కాందహార్‌, హెల్మాండ్‌, హెరాత్‌ ప్రావిన్స్‌లలో భారీస్థాయిలో దాడులు జరుగుతున్నట్లు చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన