మధుమేహానికి కృత్రిమ క్లోమంతో చెక్‌ 

ప్రధానాంశాలు

Updated : 06/08/2021 05:53 IST

మధుమేహానికి కృత్రిమ క్లోమంతో చెక్‌ 

వాషింగ్టన్‌  టైప్‌-2 మధుమేహంతోపాటు మూత్రపిండాల సమస్యలను ఎదుర్కొంటున్నవారికి ఇది శుభవార్త. వీరికోసం కృత్రిమ క్లోమం సిద్ధమైంది. దీన్ని మధుమేహం ఉన్న ఔట్‌ పేషెంట్లపై తొలిసారిగా పరీక్షించి చూశారు. ఇది బాధితుల రక్తంలో చక్కెర స్థాయిని సమర్థంగా, సురక్షితంగా నియంత్రిస్తుందని వెల్లడైంది. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం, స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ హాస్పటల్‌ ఆఫ్‌ బెర్న్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
మూత్ర పిండాల వైఫల్యానికి మధుమేహం ప్రధాన కారణమవుతోంది. టైప్‌-2 మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డయాలసిస్‌, మూత్రపిండాల మార్పిడి అవసరమయ్యే వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. మూత్రపిండాల వైఫల్యం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అసాధారణంగా పెరగడమో (హైపర్‌గ్లైసేమియా), తగ్గడమో (హైపోగ్లైసీమియా) జరుగుతోంది. దీనివల్ల కళ్లు తిరగడం, కోమాలోకి జారిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. మూత్రపిండాల వైఫల్యమున్న వారిలో మధుమేహాన్ని నియంత్రించడం చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. వారి సంరక్షణకు సంబంధించిన అనేక అంశాలపై శాస్త్రవేత్తలకు పూర్తి అవగాహన లేదు. ఇలాంటివారికి నోటి ద్వారా తీసుకునే మందులను సూచించడం లేదు. ఇన్సులిన్‌ ఇంజెక్షన్లను సూచిస్తున్నారు.

టైప్‌-1 మధుమేహం ఉన్నవారికి ఇన్సులిన్‌ ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయంగా కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ క్లోమాన్ని గతంలో అభివృద్ధి చేశారు. ఇది టైప్‌-2 మధుమేహం, మూత్రపిండాల వైఫల్య సమస్యను ఎదుర్కొంటున్నవారికీ ఉపయోగపడుతుందని బెర్న్‌ విశ్వవిద్యాలయ ఆసుపత్రి శాస్త్రవేత్తలతో కలిసి సాగించిన పరిశోధనలో గుర్తించారు. స్మార్ట్‌ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఈ కృత్రిమ క్లోమం పనిచేస్తుంది. రోగికి  అందే ఇన్సులిన్‌ స్థాయిని సర్దుబాటు చేయాలని ఒక పంప్‌నకు ఇది సంకేతాలు ఇస్తుంది. అనంతరం గ్లూకోజు మోనిటర్‌.. రోగి రక్తంలోని చక్కెర స్థాయిని కొలిచి, ఆ వివరాలను స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది. దీని ఆధారంగా అందులోని సాఫ్ట్‌వేర్‌ తదుపరి సర్దుబాట్లు చేస్తుంది. ఈ కృత్రిమ క్లోమం చాలా చిన్నగా ఉంటుంది. ఈ సాధనం వల్ల.. మధుమేహాన్ని కట్టడి చేయడానికి చాలా తక్కువ సమయాన్ని వెచ్చించామని ప్రతి పది మంది పరీక్షార్థుల్లో 9 మంది చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన