IOT: సాగులో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌..!

ప్రధానాంశాలు

Updated : 24/10/2021 14:38 IST

IOT: సాగులో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌..!

నగరవాసులకు తాజా ఆకుకూరలు అందిస్తోన్న అర్బన్‌ కిసాన్‌ అంకుర సంస్థ

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: ఆరోగ్య స్పృహ అందరిలో పెరుగుతోంది...ధర కాస్త ఎక్కువైనా పర్లేదు...తాజా కూరగాయలు, ఆకుకూరలు దొరికితే చాలు అనుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మిద్దెతోటల పెంపకం వైపు నగరవాసులు అడుగులు వేస్తున్నారు. తక్కువ నీటి వినియోగంతో తాజా, పోషక విలువలున్న ఆకుకూరలు, కూరగాయలను పెంచుతోంది అర్బన్‌ కిసాన్‌ అంకుర సంస్థ. ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) సాఫ్ట్‌వేర్‌ అనుసంధానంతో హైడ్రోఫోనిక్స్‌ విధానంలో ఆకుకూరలు, కూరగాయల సాగు చేపట్టింది.

ఏం కావాలో చెప్పేస్తుంది...

 ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సాంకేతికత ద్వారా మొక్కలకు ఎప్పుడెప్పుడు నీరు అందించాలి. సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, మొక్కలకు అందాల్సిన పోషకాలేంటి..? దేని మోతాదు తగ్గుతోంది..? తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పోషకాలు తగ్గితే ఏ మేరకు వాటిని అందించాలనేది సందేశాల రూపంలో ఇవ్వడం ఈ సాఫ్ట్‌వేర్‌ ప్రత్యేకత.

5 శాతం నీటి వినియోగం

మట్టిలో 5 టన్నుల ఆకు కూరల ఉత్పత్తికి సుమారు 100 లీటర్ల నీరు ఉపయోగపడితే ఈ నూతన సాగు విధానం ద్వారా కేవలం 5 లీటర్ల ద్వారా అదే ఉత్పత్తిని రాబట్టొచ్చని చెబుతున్నారు అంకుర సంస్థ నిర్వాహకులు. హైడ్రోఫోనిక్స్‌ విధానంతో సాధారణంతో పోల్చితే కూరగాయలు, ఆకు కూరలు పండించడానికి నీటి వినియోగం 95శాతం తగ్గుతోంది. పై నుంచి నీటి సరఫరా చేస్తూ కింద ఉన్న మొక్కలకు నీరు అందేలా పైపులతో ఏర్పాట్లు ఉంటాయి. మొక్కలు నిటారుగా నిల్చోవడానికి, నీటిని పీల్చుకోవడానికి ఆధారంగా ‘క్లే బాల్స్‌’ వేస్తుంటారు. పైపుల ద్వారా వచ్చిన నీరు మళ్లీ గట్టర్‌ ద్వారా తిరిగి మళ్లీ ప్రధాన నీటి పంపిణీ వ్యవస్థ (ట్యాంక్‌)లోకి వెళ్తుంది. ఈ చర్య పునరావృతం అవుతూ ఉంటుంది. దీని వల్ల ఎక్కువ నీటి అవసరం ఉండదు. వృథా అవదు. 

ప్రత్యేకంగా కిట్లు లభ్యం...

ప్రత్యక్షంగా పెంపకాన్ని చూసి కేజీల రూపంలో వినియోగదారులు వీటిని కొనుగోలు చేయొచ్చు. సొంతంగానే సాగు చేసుకుంటాం అనేవారికి ప్రత్యేకంగా కిట్లు లభ్యం అవుతున్నాయి.
వెబ్‌సైట్‌లో ఆర్డర్‌ ఇచ్చేవారికి ఒక కేజీ ఇండియన్‌ బాక్స్‌లో పాలకూర, పుదీనా, కరివేపాకు తదితరాలు అందిస్తారు. సలాడ్‌ కోసం అన్ని కూరగాయలు ఉన్న ప్రత్యేకమైన బాక్స్‌లు ఇక్కడ లభిస్తాయి. ప్రస్తుతం ఇక్కడ ఇండియన్‌ మిక్స్, ఎగ్జాటిక్‌ మిక్స్, ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ బాక్సులను అందిస్తున్నారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన