close

తాజా వార్తలు

సప్తపదిలో కష్టమైనా... అష్టైశ్వర్యం!

‘ ఆడపిల్లని ఎంత చదివించినా మరో ఇంటికి పంపాల్సిందే  గౌడ గారూ...’ ఈ మాటలు విన్నప్పుడల్లా ఆమెలో చదవాలనే పట్టుదల పెరిగింది.  పెళ్లై, పిల్లలు పుట్టినా ఆ కసి పెరిగిందే తప్ప తగ్గలేదు. దాంతో చదువుల యజ్ఞమే చేసింది. ఇప్పుడు తన కళాశాలలో ఏకంగా ఎనిమిది స్వర్ణాలు సాధించింది. ఆమే కర్ణాటకకు చెందిన శైలజ శరణగౌడ.

‘నగరానికి పంపి మరీ ఆడపిల్లల్ని చదివించడం ఎందుకు... మనం నోరుకట్టుకుని వాళ్లను చదివించినా చివరకు ఓ అయ్యచేతిలో పెట్టాల్సిందేగా. అంతదానికే మనం కష్టాలు పడటం ఎందుకు...’ ఇలా నాన్నతో బంధువులు అనడం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నా. మొదట్లో కోపం వచ్చేది. కానీ దానికి పరిష్కారం అది కాదని, చదువు ద్వారానే సమాధానం చెప్పాలని తెలుసుకున్నా. అందుకే ఇంత కష్టపడ్డా. మాది కర్ణాటక కలబురిగి జిల్లాలోని మల్లా(బి) గ్రామం. మేము నలుగురం సంతానమైతే ముగ్గురం ఆడపిల్లలమే. నాన్న పదో తరగతి, అమ్మ ఐదో తరగతి వరకే చదువుకున్నారు. వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని మమ్మల్ని పోషించేవాళ్లు. ఉత్తర కర్ణాటక జిల్లాలో వ్యవసాయ భూములున్నా ప్రభుత్వ కరవు పరిహారం ఎప్పుడొస్తుందా అని చూడాల్సిందే. అందుకు నాన్న కూడా మినహాయింపు కాదు. మాకు పొలం ఉన్నా.. దానిపై వచ్చే ఆదాయంతో మా ముగ్గురు అక్కచెల్లెళ్లకు ఓ ఆధారం ఎలా కల్పించాలా అని నాన్న బాధపడేవారు. రోజులు గడిచేకొద్దీ మమ్మల్ని చదివించడం కష్టమయ్యేది. ఊళ్లో ఉన్న వ్యవసాయ భూమిని కౌలుకి ఇచ్చి మా చదువుల కోసం అద్దె ఇంటికి మారారు. అలా ఊరు వదలి జీవర్గికి మారిపోయాం. అది తెలిసే బంధువులు నాన్నను వారించారు. ‘అమ్మాయిలకు పెళ్లి చేయి చాలు. చదువులు వద్దు’ అని అన్నారు. ఆ మాటలు ఇప్పటికీ బాధనిపిస్తాయి. నాలుగో తరగతి వరకు ఊళ్లో చదివిన నేను జీవర్గిలో మిగతా చదువు కొనసాగించా. కౌలు ద్వారా వచ్చిన డబ్బుతోనే అన్నింటినీ నెట్టుకొచ్చేవారు నాన్న. 7వ తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలో చదివినా మాతో పాటు తమ్ముడికి కూడా ఫీజులు కట్టడం అమ్మావాళ్లకు సాధ్యం కాలేదు. దాంతో మేమే చొరవ తీసుకుని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తామని చెప్పాం. తమ్ముడిని మాత్రం ప్రైవేటు పాఠశాలలో చేర్పించాం. ఎలాగోలా పదో తరగతి, ఇంటర్‌ పూర్తి చేశా. నాన్నకు అండగా ఉండాలనే ఉద్దేశంతో డీఈడీ(ఇంటర్‌ తర్వాత టీచర్‌ ట్రైనింగ్‌) చేరా. ఏడాది శిక్షణ తరువాత అదే కళాశాలలో రూ.1500ల వేతనంతో టీచర్‌గా పని చేస్తూ... ఇంటికి సాయం చేసేదాన్ని.
పెళ్లికి ఒప్పుకొన్నా...
అక్క పీజీ చేసిన తరువాత పెళ్లి చేయాలని బంధువులు పట్టుబట్టారు. ఆ వెంటనే నాకూ చేస్తామన్నారు. నేను అప్పటికే ఉద్యోగం చేస్తూ... బీఏ రెండో సెమిస్టర్‌లో ఉన్నా. చదువుకోవాలని మనసులో ఉన్నా.. నాన్న కష్టం చూడలేక పెళ్లికి ఒప్పుకోవడంతో దూరపు బంధువుకు ఇచ్చి చేశారు. అలా పెళ్లయ్యాక బిఏ రెండో సెమిస్టరు పూర్తిచేశా. 60 శాతం మార్కులొచ్చాయి. మా వారు చంద్రకాంత్‌రెడ్డితో నా డిగ్రీ గురించి చెబితే ‘నాకు ఎలాగూ చదువు అబ్బలేదు. నువ్వయినా చదువుకో... నేను ప్రోత్సహిస్తా...’ అని అన్నారు. అత్తామామ కూడా అడ్డు చెప్పలేదు. అందరినీ ఒప్పించా సరే.. కానీ కాలేజీకి వెళ్లడం అంటే మాటలు కాదు కదా... ఇంటిపనులు చేసుకుంటూనే చదువుకోవాల్సిన పరిస్థితి. దాంతో నాకంటూ ప్రణాళిక వేసుకున్నా. రోజు ఉదయం ఐదు గంటలకు లేవటం, పదిలోపు ఇంటి పనులు పూర్తిచేసుకుని కాలేజీకి వెళ్లడం దినచర్యగా మార్చుకున్నా.  మధ్యాహ్నం మూడు గంటల వరకు కళాశాల. ఇంటికొచ్చాక మళ్లీ పనులు.ఇంట్లో ఓ పట్టాన పని తెమిలేది కాదు. రాత్రి పది తరువాత గానీ పుస్తకాల తిరగేసేందుకు సమయం దొరికేది. అలా రాత్రి రెండు గంటల వరకు చదువుకుని మళ్లీ ఉదయం ఐదు గంటలకు లేచేదాన్ని. పెళ్లి తరువాత చదువుకోవడం ఎంత కష్టమో అప్పుడే తెలిసొచ్చింది. కానీ ఏమాత్రం పట్టువదల్లేదు. బీఏ 6వ సెమిస్టర్‌లో నాకు ఎనిమిదో నెల. బస్సులో కష్టమని ఆటోలో వెళ్లి మరీ పరీక్షలు రాసొచ్చా. చివరి పరీక్ష తరువాత కాన్పు అయ్యింది. అత్తింట్లోనూ నాకు పని చెప్పకుండా సహకరించేవారు. అప్పుడప్పడు తరగతలకు హాజరు కాకపోయినా బీఏలో 70శాతం మార్కులొచ్చాయి.

 

శుక్రవారం కర్ణాటకలోని గుల్బర్గ విశ్వవిద్యాలయం నిర్వహించిన స్నాతకోత్సవంలో ఎంఏ కన్నడంలో ఎనిమిది స్వర్ణాలు సాధించింది శైలజ శరణగౌడ. మొత్తం 237 మంది పీహెచ్‌డీలు, 76 మంది స్వర్ణపతకాలు, మరో తొమ్మిది మంది స్వర్ణాలతో సమానమైన నగదు ప్రోత్సాహకాన్ని అందుకుంది. 

ఆపేద్దామనుకున్నా కానీ...
బీఏ తరువాత బీఈడీలో ప్రభుత్వ సీటు వచ్చింది. బీఈడీ పరీక్షల సమయానికి మళ్లీ గర్భం. అప్పుడు మాత్రం కాస్త కష్టమైంది. అక్కడితో చదువు ఆపేయాలనుకున్నా. కానీ మా వారు వారించటంతో పరీక్షలు రాశా. ఆపై ఎంఏలో చేరినా ఇంటి పని, పిల్లలు, చదువు... అన్నింటినీ సమన్వయం చేసుకోవడం నాకో సవాలుగా అనిపించింది. ఎంఏలో ఆంగ్ల భాష, కంప్యూటర్‌ వంటి తరగతులు ఉండేవి. కష్టపడి చదివా. ఎంఏ మొదటి సంవత్సరంలో మా కాలేజీ స్నాతకోత్సవానికి వెళ్లా. అక్కడ మేం చదువుతున్న ప్రభుత్వ మహా విద్యాలయ విద్యార్థిని రేఖ అనే అమ్మాయి ఏకంగా ఏడు  స్వర్ణాలు సాధించింది. చాలా ఆనందంగా అనిపించింది. ఆమె 75 శాతం మార్కులు వచ్చాయి. అది చూశాక నేను ఎలాగైనా సరే ఆమెకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకున్నా. ఇదిగో చివరకు 77.7 శాతం మార్కులతో ఎనిమిది స్వర్ణాలు వచ్చాయి. మా బ్యాచ్‌ తరువాత మా కళాశాలకు స్వయం ప్రతిపత్తి వస్తుంది. నేను సాధించిన ఎనిమిది స్వర్ణాలతో కాలేజీకి పేరొస్తుందంటే అంతకన్నా సంతోషమేముంది. మా అక్కచెళ్లలంతా బీఏలో చేరగానే మా ఊళ్లో వాళ్లంతా ‘మీ పిల్లలు ఏం సాధించారయ్యా’ అని అన్నారు. ఇప్పుడు నా విజయం చూశాక మెచ్చుకుంటున్నారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఎంత కష్టమైనా సరే... వాళ్లను కూడా ఉన్నతంగా చదివించడమే నా లక్ష్యం.

- కె.ముకుంద, ఈనాడు డిజిటల్‌, బెంగళూరు

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.