
తాజా వార్తలు
ప్రొద్దుటూరు విద్యార్థుల సృష్టి ●
డ్రా లేకపోవడం ఈ ఆట ప్రత్యేకత
జిరాఫీ చెస్ బోర్డు
ఇంత వరకు మనకు చదరంగం (చెస్) ఆడటం మాత్రమే తెలుసు.. ఇపుడు సరికొత్తగా జిరాఫీ చెస్ గురించి తెలుసుకుందాం. చదరంగం బోర్డులో 64 గళ్లు ఉంటే.. జిరాఫీ చెస్ బోర్డులో 68 గళ్లు ఉంటాయి. చదరంగం ఆటలో సిఫాయిలు, గుర్రం, ఒంటె, ఏనుగు, రాణి, రాజు ఉంటే.. జిరాఫీ చెస్ ఆటలో వీటికి అదనంగా జిరాఫీ ఉంటుంది. చదరంగం ఆటలో డ్రాలు ఉంటాయి. కానీ ఈ ఆటలో డ్రా ఉండదు. ఈ ఆటలో గెలుపు ఓటములే ఉంటాయి. దీన్ని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాధరరెడ్డి కుమార్తె నందమాల భాగ్యశ్రీ, కుమారుడు నందమాల సాయికిరణ్‌రెడ్డి రూపొందించారు.
జాతీయ స్థాయి పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు
కడప క్రీడలు: చదరంగం ఆటలో సాధారణ క్రీడాకారులు తలపడినా.. అంతర్జాతీయ క్రీడాకారులు తలపడినా గెలుపు, ఓటములతో పాటు డ్రా జరిగే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో 53 శాతం చదరంగం ఆటలు డ్రాగా ముగుస్తున్నాయని సర్వేలు తెలియజేస్తున్నాయి. ఆటలు డ్రాగా ముగియడం వల్ల విజేతను నిర్ణయించలేక క్రీడాకారులు సంయుక్తంగా గెలుపొందుతున్నారు. దీన్నే దృష్టిలో ఉంచుకొనే ప్రొద్దుటూరుకు చెందిన విద్యార్థులు జిరాఫీ చెస్ ఆటను రూపొందించారు. దీన్ని ఎవరు ఆడినా గెలుపోటములే తప్ప డ్రాలు ఉండవు.
68 గళ్ల చదరంగం
చదరంగం బోర్డులో 64 గళ్లు, 32 పావులు ఉంటాయని అందరికీ తెలుసు.. జిరాఫీ చెస్ బోర్డులో 68 గళ్లు, 36 పావులు ఉంటాయి. ఈ బోర్డులో ఇరువైపులా రెండు గళ్లను అదనంగా చేర్చి అందులో జిరాఫీ కాయన్లను చేర్చారు. జిరాఫీలు 4 గళ్లను ఎల్ ఆకారంలో (3 ప్లస్ 1, 1 ప్లస్ 3) ఎటైనా ఎగరగలవు. మిగిలిన కాయన్లన్ని సాధారణ చెస్ లాగే కదులుతాయి. ఈ కొత్త జిరాఫీ పావులు ‘ఎల్’ ఆకారంలో నాలుగు గళ్లు దాటుతాయి. ఒక్కొక్కరు మొత్తం 18 కాయన్లతో ఆడతారు.
జిరాఫీ చెస్ ఆటలో గెలుపు మూడు రకాలు. చెక్ మేట్, స్టీల్ మేట్, క్రౌనింగ్. అంటే రాజును బందిస్తే గెలిచినట్లే. ఎవరి రాజైనా ప్రత్యర్థి ఇంటికి వెళ్లినా గెలిచినట్టుగానే లెక్కిస్తారు. ● ఈ ఆటలో డ్రా వుండదు కాబట్టి ఆడే వారిలో రాజీ పడేతత్వం ఉండదు. దీంతో రాజీ లేని తత్వం అలవడి చదువుల్లోనూ, అవకాశాల్లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతారు. ఒక వేళ ఓడినా తిరిగి గెలిచేందుకు ప్రయత్నిస్తాడు తప్ప రాజీపడటం అనేది ఉండదు.
దేశవ్యాప్తంగా పోటీలు
ఇప్పటి వరకు తమిళనాడులోని చెన్నై నగరంలో 68 సండే టోర్నమెంట్లు, విజయనగరంలోని బొబ్బిలి పట్టణంలో రెండు టోర్నమెంట్లు, కడప జిల్లా ప్రొద్దుటూరు నందు 75 టోర్నమెంట్లు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ●
గత సంవత్సరం డిసెంబరు నెలలో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య తొలి అంతర్జాతీయ జిరాఫీ చెస్ టోర్నమెంట్‌ను ప్రొద్దుటూరులో నిర్వహించగా ఇందులో ఇంగ్లాండ్‌కు చెందిన మన్విత్ గెలుపొందాడు. ఇటీవల కడప శ్రీహరి డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల మధ్య అంతరాష్ట్ర టోర్నమెంట్‌ను నిర్వహించగా తమిళనాడు క్రీడాకారుడు గెలుపొందాడు.
గెలుపు లక్ష్యమే జిరాఫీ చెస్ - భాగ్యశ్రీ, సాయికిరణ్‌రెడ్డి, జిరాఫీ చెస్ రూపకర్తలు
జిల్లాలోని ప్రతి క్రీడాకారుడు జిరాఫీ చెస్ ఆట గురించి తెలుసుకోవాలి. డ్రాలేని ఆటే జిరాఫీ చెస్ ఆటలో గెలుపే లక్ష్యంగా పోరాడుతాడు. దీని వల్ల విద్యార్థుల్లో పోరాటతత్వం పెరుతుంది. భవిష్యత్తులో ఈ ఆటను దేశం మొత్తానికి విస్తరిస్తాం. జిరాఫీ చెస్‌ను ఇప్పటికే మన రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు రాష్ట్రానికి కూడా పరిచయం చేశాం. త్వరలో దక్షిణాది రాష్ట్రాలన్నింటికి జిరాఫీ చెస్‌ను విస్తరిస్తాం. జిరాఫీ చెస్ ఆటను జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో ఆడించేందుకు ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారి శైలజ, ఆర్‌ఐపీఈ రామకృష్ణ అనుమతి ఇచ్చారు. అన్ని రకాల పాఠశాల విద్యార్థులకు జిరాఫీ చెస్ ఆటపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
నేటి నుంచి జిరాఫీ చెస్ లీగ్ పోటీలు
: అంతర్జాతీయ జిరాఫీ చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో నేటి నుంచి జిరాఫీ చెస్ లీగ్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాధర్ పేర్కొన్నారు. బుధవారం కడప నగరంలోని శ్రీచైతన్య పాఠశాలలో యోవేవి క్రీడా విభాగం కార్యదర్శి కె.రామసుబ్బారెడ్డి, శ్రీచైతన్య పాఠశాలల ఏజీఎం రమణయ్య ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రా లేని జిరాఫీ చెస్ ఆటలో గెలుపే లక్ష్యంగా ఆడాలని క్రీడాకారులకు సూచించారు. విద్యార్థులు, క్రీడాకారులు పోటీలు జరిగే వేదిక వద్దకు వచ్చి జిరాఫీ చెస్ గురించి తెలుసుకోవాలన్నారు. నిర్వహకులు గంగాధర్ మాట్లాడుతూ.. ఈనెల 16వ తేదీ నుంచి 25 వరకు నగరంలోని శ్రీచైతన్య హైస్కూల్లో పోటీలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
