Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 137370
            [news_title_telugu_html] => 

చిన్న వయసు... పెద్ద మనసు!

[news_title_telugu] => చిన్న వయసు... పెద్ద మనసు! [news_title_english] => [news_short_description] => వారంతా... బాల్యం నుంచే బతుకు పాఠాలు నేర్చుకున్నారు. సమాజంలోని సమస్యలకు సమాధానం వెతకాలనుకున్నారు. మురికివాడలు మార్చాలని ఒకరు... మహిళా విద్య కోసం మరొకరు... పర్యావరణ హితం కోరి ఇంకొకరు... ఇలా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. [news_tags_keywords] => Young inspirational, Champakumar, Aishwarya sridhar, Davanshi radhi, Vedika podar, Mahila jayaho, Vasundhara special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-06 00:48:17 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చిన్న వయసు... పెద్ద మనసు! - EENADU
close

తాజా వార్తలు

చిన్న వయసు... పెద్ద మనసు!

వారంతా... బాల్యం నుంచే బతుకు పాఠాలు నేర్చుకున్నారు. సమాజంలోని సమస్యలకు సమాధానం వెతకాలనుకున్నారు. మురికివాడలు మార్చాలని ఒకరు... మహిళా విద్య కోసం మరొకరు... పర్యావరణ హితం కోరి ఇంకొకరు... ఇలా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా ఇటీవల ఒకప్పటి వేల్స్‌ యువరాణి డయానా జ్ఞాపకార్థం బ్రిటన్‌ ప్రభుత్వం యువతకు అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. ఇంతకీ వాళ్లెవరంటే...


పిట్ట కొంచెం... కూత ఘనం

చంపాకుమార్‌ స్వస్థలం ఝార్ఖండ్‌ గిరిది జిల్లాలోని జమ్‌దర్‌. మూడేళ్ల క్రితం వరకు మైకా గనుల్లో కుటుంబంతో కలిసి పని చేసేది. అది నక్సల్‌ ప్రభావిత ప్రాంతం. అక్కడి పరిసర ప్రదేశాల్లోని ప్రజలంతా మైకా గనుల్లో ఏర్పడిన వ్యర్థాలను ఏరుకుని జీవనం సాగిస్తారు. ఈ గనుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు చాలామందే ఉన్నారు. ఒక రోజు పనిలోకి వెళ్లకుంటే ఆరోజు పస్తులుండాల్సిన దుస్థితి. ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చింది చంపా. తండ్రి మహేంద్ర ఠాకుర్‌. తల్లి వసంతి దేవి. ఆరుగురు సంతానంలో ఆమే చిన్నది. ఇక్కడి వారు పిల్లల్ని పనికే తప్ప బడికి పంపరు. అబ్బాయిల చదవూ అంతంత మాత్రమే. అమ్మాయిలకు చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేస్తారు. అలాంటిచోట ఓ రోజు నోబెల్‌ గ్రహీత కైలాస్‌ సత్యార్థి అనుచరులు బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పించమంటూ ర్యాలీ నిర్వహించారు. ఇది చంపాను ఆకట్టుకుంది. చదువుకోవాలనే తన కోరికను వారికి వివరించింది. వారి సాయంతో తన తండ్రిని ఒప్పించడానికి ప్రయత్నించింది. ఆయన అంగీకరించలేదు. చదువు అవసరాన్ని తెలియజేస్తూ తనకు తెలిసిన జానపదం పాడింది. ఆమె గొంతులోని మాధుర్యాన్ని గ్రహించిన ఆయన ‘నీవు చదువుకోకుండానే ఇంత బాగా పాడుతున్నావు. అక్షరజ్ఞానం ఉంటే ఇంకెంత బాగా పాడతావో’ అని ప్రశంసించారు. ఆ వెంటనే ముంబయిలో ఉన్న తన పెద్దన్నకు విషయం చెప్పింది. అతనూ ఒప్పుకోవడంతో పదేళ్ల వయసులో పాఠశాలలో చేరింది. అప్పటి నుంచి ఓ వైపు చదువుకుంటూ మరోవైపు ఆ ఫౌండేషన్‌తో కలిసి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిస్తే కైలాస్‌ సత్యార్థి చిల్డ్రన్స్‌ ఫౌండేషన్‌ సహాయంతో అడ్డుకుంటుంది. పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోయినా, స్థానికంగా మౌలిక వసతుల కల్పనలో సమస్యలు వచ్చినా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తోంది. ఆ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని బాల పంచాయత్‌కు నేతృత్వం వహించే స్థాయికి చేరింది. రాష్ట్ర స్థాయిలో ముఖియాగా మారింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మూడేళ్లుగా సమాజాన్ని మార్చడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ ఆమె వదిలిపెట్టలేదు. చదువు కొనసాగించడానికి నెలలో 15 రోజులు, సాయంత్రం రెండున్నర గంటలు కష్టపడి మైకా సంబంధిత పనిచేస్తుంది. ఇలా సంపాదించిన డబ్బును తన చదువుకు వినియోగించుకుంటోంది ఈ పదమూడేళ్ల చిన్నారి.


అంధుల కోసం...

దిల్లీకి చెందిన దేవాన్షి రథి... బాల్యం నుంచే చదరంగంలో ప్రతిభ చూపేది. కామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ పాల్గొని రజత పతకం గెలుచుకుంది. చదరంగం మీద ఇప్పటివరకు రెండు పుస్తకాలు రాసింది. బ్లాగులూ నిర్వహిస్తోంది. ఆమె నేర్చుకున్న ఆటను ప్రపంచానికి పంచాలనుకుంది. ఇలా 2015లో ‘ప్రాజెక్ట్‌ చెక్‌మేట్‌’ ప్రారంభించింది. అప్పటి నుంచి నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌తో కలిసి పని చేస్తోంది. అంధుల్ని చెస్‌లో మెరికల్లా మారుస్తోంది. వారికి జీవన నైపుణ్యాలు నేర్పిస్తోంది. ఆత్మవిశ్వాసం పెంచడానికి, వారి మానసిక ఎదుగుదలకు కృషి చేస్తోంది. ఇందుకోసం ఆమె ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. అంధుల కోసం నార్త్‌ జోన్‌ ఛాంపియన్‌షిప్‌నూ నిర్వహించింది.


పర్యావరణ పరిరక్షణకై...

నవీ ముంబయిలో పన్వేల్‌కు చెందిన ఐశ్వర్యా శ్రీధర్‌కు చిన్నప్పటి నుంచే ప్రకృతి అంటే ఇష్టం. పర్యావరణానికి హాని కలిగించే పరిణామాలు ఆమెను కలచివేశాయి. చెట్లు, వ్యన్యప్రాణులను రక్షించడానికి తన వంతు ప్రయత్నం చేయాలనుకుంది. పాఠశాల, ఇంటర్‌ స్థాయి నుంచే పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసాలు, కవితలు రాసేది. అవి ప్రముఖ ఆంగ్ల పత్రికల్లో ప్రచురితమయ్యేవి. 2010లో ఓ ఛానల్‌ నిర్వహించిన టైగర్‌ టెలిథాన్‌లో పులుల సంరక్షణ గురించి మాట్లాడింది. వన్యప్రాణి సంరక్షణపై లఘు చిత్రాలు, ఫొటోల రూపంలో అవగాహన కల్పిస్తోంది. అవి ఎంతో మందిని ఆలోచించేలా చేస్తున్నాయి. పదిహేనేళ్లకే సాంక్చురి ఆసియా యంగ్‌ నాచురల్‌ అవార్డు అందుకుంది. భారత దేశం నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి బాలికగా అప్పుడామె రికార్డు సృష్టించింది. అనవసరంగా పాములు, చిన్న చిన్న జంతుజాలాలను చంపడం వల్ల కలిగే అనర్థాలను అందరికీ వివరిస్తోంది. వాటిని తన బృందంతో కలిసి అడవుల్లో వదిలేస్తోంది. ఇప్పటి వరకు సుమారుగా 20 వేల మంది పాఠశాల విద్యార్థులతో కలిసి అనేక మొక్కలు నాటింది. నవీ ముంబయిలో మడ అడవుల సంరక్షణ కోసం తీసిన లఘుచిత్రం అటవీ అధికారులను కదిలించడం విశేషం. ‘ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఇది నా బాధ్యతలను మరింత పెంచింద’ని చెబుతోంది 22 ఏళ్ల ఐశ్వర్య.


అందరూ చదవాలని...

రాజస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల వేదికా పొదార్‌ ఆనందీలాల్‌ పొదార్‌ ట్రస్ట్‌తో కలిసి అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతోంది. 2017 నుంచి బాలికా విద్య, ఆరోగ్యం, సంపాదన వంటి అంశాలపై రాజస్థాన్‌లోని మారుమూల పల్లెల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పొదార్‌ విద్యా సంస్థల వారసురాలైన వేదిక... ‘ఛేంజ్‌ ఫర్‌ ఛేంజ్‌’ కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకులు, సంఘాలతో కలిసి బాలికలు బడిబాట పట్టేలా చేస్తోంది. వాళ్లకు అవసరమైన సాయం అందిస్తోంది. పర్యావరణం, పరిసరాల పరిశుభ్రతపైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.


మురికివాడలు మారాలని...

తాన్యా చందా 23 ఏళ్లకే దిల్లీలో లాడ్లీ ఫౌండేషన్‌ను స్థాపించి, చిన్న వయసునుంచే మురికివాడల్లో ఉండే ప్రజల కోసం పాటుపడుతోంది. లైంగిక వేధింపులు, అత్యాచారాలకు గురైన బాధితులను చేరదీసి పునరావాసం కల్పిస్తోంది. ‘సహేలీ’ అనే కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు మురికివాడల్లోని 65 వేల మంది తల్లులు, పిల్లలకు సేవలందించింది. ఉచిత వైద్య సేవలు, నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తోంది. తన సంస్థ ద్వారా లింగ సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడుతోంది. వివక్షను రూపుమాపేందుకు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలూ నిర్వహిస్తోంది.


నెలసరిపై అవగాహన కల్పిస్తూ...

ఆడ పిల్లల అభ్యున్నతి కోసం 24 ఏళ్ల సుమతీ జోషి ముంబయిలో మిషన్‌ సంస్కార్‌ అనే సంస్థను స్థాపించింది. బాలికలు, మహిళలకు నెలసరి గురించి అవగాహన కార్యక్రమాలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్‌ డ్రాపవుట్లకు కారణం ఈ సమస్యలేనని గుర్తించింది. వీటిపై అవగాహన కల్పించేందుకే స్నేహితులతో కలిసి ఈ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. పాఠశాల విద్యార్థినులకు, గ్రామీణ ప్రాంతాల మహిళలకు రుతుక్రమం పట్ల ఉన్న అపోహలు, భయాలు పోగొట్టేందుకు తనవంతుగా కృషి చేస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రతపైనా అమ్మాయిలకు శిక్షణ అందిస్తోంది.


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.