close

తాజా వార్తలు

జీతాలు తీసుకోరు పాఠాలు చెబుతారు

నేడు ఉపాధ్యాయుల దినోత్సవం

వ్యక్తిగా, శక్తిగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్రే కీలకం. ఎదుటివారికి మంచి చేయాలనే సంకల్పం ఉంటే చాలు... టీచరుగా హోదా అక్కర్లేదు. అనుభవం అంతకన్నా అవసరం లేదు. జీతాల ఊసే ఎత్తక్కర్లేదు. పాఠాలు చెప్పడానికి ఫుట్‌పాత్‌లే పాఠశాలలు అవుతాయి. మాటలే మంత్రంగా పనిచేసి విద్యాబుద్ధులు నేర్పించే ఉత్సాహం ఇస్తాయి. అలాంటి వ్యక్తులే వీరు. స్వచ్ఛందంగా గురువులుగా మారి నిరుపేద చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.

ఆంగ్లంతో ఆత్మవిశ్వాసం నింపుతోంది! 
- సంధ్యా గోడె

ర్థికంగా వెనకబడిన కుటుంబాల్లోని పిల్లలు ఎంత చలాకీగా ఉన్నా... ఆంగ్లంపై పట్టులేక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంటారు. ఓ ఇంటర్‌ స్కూల్‌ పోటీలో ఇది చూశారు సంధ్య. ఆ పోటీకి ఓ పాఠశాలకు చెందిన తొమ్మిది, పదోతరగతి విద్యార్థులు తోటివారితో కలవలేక దూరంగా నిలబడటం గమనించారామె. ఆ విద్యార్థులతో మాట కలిపితే ఆంగ్లం మాట్లాడటం రాకపోవడం వల్లే తమలో ఆత్మవిశ్వాసం తగ్గిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఎంతోమందికి ఉంటుందని అర్థంచేసుకున్న సంధ్య వారికి ఉచితంగా ఆంగ్లం నేర్పించాలనుకున్నారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి ప్రతి గురువారం ఆ రెండు తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్‌ చెప్పడం మొదలుపెట్టారు. ఏడాది తరువాత వారిలో కొంత మార్పు కనిపించింది. మరికొందరి స్నేహితుల సాయంతో ఇతర పాఠశాలలకూ తన సేవల్ని విస్తరించాలనుకున్నారామె. అలా స్పీకింగ్‌చాక్‌ పేరుతో ఓ సేవా సంస్థను ఏర్పాటు చేశారు. 

పబ్లిక్‌ స్పీకింగ్‌ నైపుణ్యాలు: అది మొదలు విశాఖపట్నంలోని కొన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని చిన్నారులకు ప్రతి గురువారం స్పోకెన్‌ ఇంగ్లిష్‌, పబ్లిక్‌ స్పీకింగ్‌ తరగతుల్ని నిర్వహిస్తోంది నలభైమంది సభ్యులతో కూడిన సంధ్య బృందం. విద్యార్థుల అవసరాల్ని బట్టి ప్రత్యేక తరగతులు నిర్వహించడమే కాదు...ఒకటో తరగతి నుంచే అనర్గళంగా ఆంగ్లం మాట్లాడే మెలకువలు వారికి నేర్పిస్తున్నారు. విశాఖపట్టణంలోని ఏయూ ఆంగ్లమాధ్యమ, గాయత్రీ విద్యాపరిషత్‌, ప్రేమసమాజం పాఠశాలల్లోని సుమారు పదిహేను వందల మంది విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు వీరు. మత్స్యకారులు, డ్రైవర్లు, చిన్న చిన్న పనులు చేసుకునే పేద కుటుంబాలకు చెందిన పిల్లలే వాళ్లంతా. ఇప్పుడు చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ పాఠశాలల ఉపాధ్యాయులూ వీరికి అండగా నిలుస్తున్నారు. సంధ్య తండ్రి ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన స్కూల్‌లో టీచర్‌. పేదపిల్లలకు చదువులు చెప్పడం, వారికి సాయం చేయడం ఆయనకు అలవాటు. ఎంబీఏ చదివి, దిల్లీలో కొన్నాళ్లు పనిచేసి, పెళ్లయ్యాక విశాఖ వచ్చారామె.. తండ్రి అందించిన స్ఫూర్తితోనే ఇవన్నీ చేస్తున్నానని అంటారు.

పై వంతెనపై పాఠాలు 
- హైమంతి సేన్‌

సేవ చేయాలంటే అనుభవం కన్నా మంచి మనసుండాలి. ఆ మంచి మనసుతోనే చదువుకి దూరమైన చిన్నారులను బడిబాట పట్టిస్తోంది ఇరవై రెండేళ్ల హైమంతి సేన్‌. రైల్వేస్టేషన్‌లో పాదచారులు నడిచే పై వంతెనను పాఠశాలగా మార్చేసిందీ నవతరం పంతులమ్మ. అది ముంబయిలోని కాండివాల్‌ రైల్వేస్టేషన్‌. రోజూ ఆమె అటు నుంచే ఆఫీసుకి వెళ్లేది. ఆ ప్రాంతంలోని రోడ్లపై, అక్కడి ఎస్కలేటర్‌ దగ్గర ఆడుకుంటూ, భిక్షమెత్తుకునే చిన్నారుల్ని చూసేది. వారిని పాఠశాలలో చేర్చాలనుకుంది. అది మొదలు ఆ చిన్నారులకు రోజూ తినుబండారాలు కొనిచ్చి....వారి తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్లమని అడిగేది. వాళ్లు మాత్రం అవి తీసుకుని ఆమెకు అబద్ధాలు చెప్పి వెళ్లిపోయేవారు. హైమంతి పట్టువదల్లేదు. చివరికు ఎలాగోలా ఆ పిల్లల తల్లిదండ్రుల్ని కలిసి వారికి చదువు చెప్పించమని అడిగింది. 

చదువు బాట పట్టారు: పిల్లల అమ్మానాన్నలు వారిని పాఠశాలకు పంపించడానికి ససేమిరా అన్నారు. అయినా హైమంతి వెనుకడుగు వేయలేదు. చిన్నారులతో స్నేహం చేస్తూనే వారిని చదువుల బాట పట్టించాలని నిర్ణయించుకుంది. రైల్వే స్కైబ్రిడ్జ్‌ వేదికగా రోజూ మధ్యాహ్నం మూడుగంటలకు ఆటపాటలు, బొమ్మల తయారీ నేర్పిస్తానంటూ పిల్లల్ని పిలిచింది. వారంతా అనుకున్న సమయానికి వచ్చేశారు. ఆసక్తిగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. వారిలో కొందరిని స్థానిక పాఠశాలలో చేర్పించే ప్రయత్నం చేసిందామె. ఆ బడి వాళ్లు ఒప్పుకోలేదు. ఈ పిల్లలకు పరిశుభ్రత ఉండదని, భోజనం ఎవరు పెడతారని ప్రశ్నించారు. వీటన్నింటినీ అర్థంచేసుకున్న హైమంతి తన స్నేహితులతో మాట్లాడింది. వారి సాయం తీసుకుంది. అంతా కలిసి చదువు చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఎనిమిది మంది సభ్యులతో జునూన్‌ అనే స్వచ్ఛంద సంస్థను రిజిస్టర్‌ చేయించింది. క్రమంగా ఆ స్కైబ్రిడ్జే పాఠశాలగా మారిపోయింది. మొదట్లో రోజు విడిచి రోజు పాఠాలు చెప్పేవారు. ఇప్పుడు రోజూ తరగతులు ఉంటున్నాయి. శని, ఆదివారాల్లో ఆట-పాటలు, ఆర్ట్స్‌-క్రాఫ్ట్స్‌, మంగళ, గురు, శుక్రవారాల్లో సబ్జెక్టులు, బుధవారం వీధి నాటకాలు వీరి కరిక్యులమ్‌లో భాగం. తమ తల్లిదండ్రులు ఎంత బలవంతపెట్టినా సరే! ఇప్పుడా పిల్లలు భిక్షాటన చేయడానికి ఒప్పుకోవడం లేదు. వీరిలో చాలామందిని ఈ ఏడాది రెగ్యులర్‌ స్కూల్‌కి పంపించింది ఈ పంతులమ్మ. 

మార్పుకోసం ప్రయత్నిస్తూ
- లావణ్య గూడెల్లి

మాజంలో మార్పు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ అది మన నుంచే ప్రారంభం కావాలనే ఆలోచన మాత్రం మనకి రాదు. ఆ మొదటి అడుగు తన నుంచే మొదలవ్వాలనుకుంది హైదరాబాద్‌కి చెందిన లావణ్య గూడెల్లి. మురికివాడల్లోని పిల్లలకు సంస్కారం అలవాటు చేసి... ఆరోగ్యం, చదువుపై ఆసక్తి పెంచాలనుకుంది. అందుకోసం మియాపూర్‌ మురికివాడను ఎంచుకుంది. అక్కడి పిల్లలకే కాదు వారి తల్లులకూ అవగాహన కల్పిస్తోంది. ఆరోగ్యం, విద్య వంటి అంశాలపై పాఠాలు చెబుతోంది. లావణ్యది మహబూబాబాద్‌ జిల్లాలోని మరిపడ గ్రామం. పది పూర్తయ్యాక ఆమె కుటుంబం హైదరాబాద్‌ వలస వచ్చేసింది. ఆపై దూరవిద్యలో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ పూర్తిచేసింది. ‘బీ ద ఛేంజ్‌’ పేరుతో సేవా సంస్థను ఏర్పాటు చేసి మురికివాడల్లో మార్పుకోసం ప్రయత్నిస్తోంది. ప్రగతినగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని యోగా, కంప్యూటర్స్‌, ఆర్ట్స్‌-క్రాఫ్స్ట్‌, క్రీడలు-సాంస్కృతిక అంశాల్లో శిక్షణ అందిస్తోంది. వివిధ అనాథాశ్రమాల్లోని విద్యార్థులకు ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ వంటి అంశాలను బోధిస్తోంది. తాజాగా చావిడి అనే ఎన్‌జీవోలోని పిల్లలకు ఆర్ట్స్‌ అండ్‌   క్రాఫ్ట్స్‌పై శిక్షణ అందివ్వడంతో పాటు చిన్న చిన్న టెక్నికల్‌ ప్రాజెక్టులను ఎలా పూర్తిచేయాలో నేర్పిస్తోంది. ఇవన్నీ చేస్తున్నందుకే లావణ్యకు నవంబరులో జరిగే ఎడ్యుకేషన్‌ త్రూ ఇన్నోవేషన్‌ అనే ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడే అవకాశం లభించింది.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.