close

తాజా వార్తలు

శ్రీదేవీ, నేనూ బురఖాలతో సినిమాలకెళ్లేవాళ్లం!

ఆ సమయంలో మానాన్న రజనీకాంత్‌ గొడవపడ్డారు!

జయసుధ సోదరిగా వెండితెరకు పరిచయమైనా తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి సుభాషిణి. ‘శివరంజని’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై దక్షిణాది భాషా చిత్రాల్లో నటించి మెప్పించారు. చేసింది తక్కువ చిత్రాలైనా గుర్తుండిపోయే పాత్రలు చేశారు. వివాహమైన తర్వాత వెండితెరకు దూరమైన ఆమె.. 2009లో వచ్చిన ‘అరుంధతి’లో పశుపతి తల్లి పాత్రలో క్రూరత్వం చూపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే ‘ఆలీతో స‌రాదాగా’ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన ఆమె ఎన్నో స‌ర‌దా సంగ‌తులు పంచుకున్నారు.

ఎలా ఉన్నారు సుభాషిణి గారు!
సుభాషిణి: బాగున్నాను అన్న‌య్యా! (వెంట‌నే ఆలీ ఆశ్చర్యపోతూ..అమ్మో నా వ‌య‌సు పెంచేస్తున్నారుగా! నాకు 35 మీకు 34. ఈ నెంబరుకు ఫిక్స్ అయిపోదాం)

జ‌య‌సుధ ఉండ‌టం వ‌ల్ల నేను ఏమీ ప‌ట్టించుకోను అన్న‌ట్లు ఉంటారు? ఆమె ఉన్నార‌ని ధైర్య‌మా?
సుభాషిణి: అంతే క‌దా! మ‌నం క‌ష్ట‌ప‌డి వ‌స్తే దాని విలువ తెలుస్తుంది. నాక‌న్నా ముందు మా అక్క ఉంది. అందుకే నాకు సుల‌భంగా అవ‌కాశాలు వ‌చ్చాయి. నేను జీవితంలో పెద్దగా క‌ష్ట‌ప‌డ‌లేదు.

మీరు అడక్కుండానే అవ‌కాశాలు వ‌చ్చాయా?
సుభాషిణి: ఆఫ‌ర్ ఇస్తామ‌ని అడిగేవారు. కానీ, చ‌దువుకుంటూ ఉండ‌టంతో ఇంట్లో ఒప్పుకోలేదు. ఏడో త‌ర‌గ‌తి వ‌ర‌కూ మాత్ర‌మే చ‌దివా. అది కూడా ఫెయిల్ అయ్యా. ఆ త‌ర్వాత చ‌దువు ఎక్క‌లేదు. ఇండ‌స్ట్రీలో తెలిసిన వాళ్లు ఉండ‌టంతో చ‌దువును త‌ప్పించుకునేందుకు ఇటువైపు వ‌చ్చా.

మీరు న‌టించిన తొలి చిత్ర‌మేది?
సుభాషిణి: ‘తూర్పు వెళ్లే రైలు’ తమిళ చిత్రాన్ని నేను చేయాల్సి ఉంది. భార‌తీరాజా ఇంటికి వ‌చ్చి అన్నీ చెప్పారు. భాగ్య‌రాజా డైలాగ్‌లు నేర్పించారు. డ్యాన్స్ కూడా నేర్చుకున్నా. రెండు మూడు రోజుల్లో షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌న‌గా, మా తండ్రిగారికీ వాళ్ల‌కూ ఏ విష‌యంలో మ‌న‌స్ప‌ర్ధలు వ‌చ్చాయో తెలియ‌దు. న‌న్ను క్యాన్సిల్ చేసి, రాధిక‌ను తీసుకున్నారు. ఆ త‌ర్వాత ‘శివ‌రంజ‌ని’లో ఆఫ‌ర్ వ‌చ్చింది.

మీ అక్క‌లాగే మీరు చాలా చిత్రాల్లో న‌టించారు? కానీ, ‘బొబ్బి‌లిపులి’లో ఐట‌మ్ సాంగ్ ఎందుకు చేయాల్సి వ‌చ్చింది?
సుభాషిణి: త‌మిళంలో ర‌జ‌నీకాంత్ సినిమాలోనూ ఓ ఐట‌మ్ సాంగ్ చేశా. అది దీని క‌న్నా బాగా ఫేమ‌స్‌. కానీ, ‘ఓ అప్పారావు.. ఓ సుబ్బారావు ’పాట ఎందుకు చేయాల్సి వ‌చ్చిందో మా పేరెంట్స్‌నే అడ‌గాలి. హీరోయిన్‌గా చేసిన త‌ర్వాత కొన్నిసార్లు సెకండ్ హీరోయిన్‌గా చేయాల్సి రావ‌చ్చు. అలా చాలామందికి జ‌రుగుతుంది. నా జీవితంలోనూ అదే జ‌రిగింది. నేను కూడా స‌న్న‌గా ఉండి, మంచి పాత్ర‌ల‌ను ఎంచుకుని ఉంటే, అక్కలాగా గొప్ప న‌టిని అయ్యేదాన్ని. కానీ, నేను బాగా తినేసి లావు అయిపోవ‌డం కార‌ణంగా అవకాశాలు తగ్గాయి. దీంతో ఏదైతే అది అయింద‌ని ఆ పాట చేయ‌డానికి ఒప్పుకొన్నా. కానీ ఆనందంగా మాత్రం చేయ‌లేదు.

మీ అస‌లు పేరు సుభాషిణినేనా?
సుభాషిణి: నా పేరులో ఏ మార్పూ లేదు. దాస‌రి నారాయ‌ణ‌రావు గారు, ఆయ‌న టీం న‌న్ను సుబ్బి అని పిలిచేవారు. ఎందుకంటే ‘శివ‌రంజ‌ని’లో నా పేరు సుబ్బి. ఇక రాఘ‌వేంద్ర‌రావుగారు ఇత‌ర ద‌ర్శ‌కులు సుబ్బ‌మ్మ అని పిలుస్తారు. (న‌వ్వులు)

జ‌య‌సుధ‌ బ్యాగ్రౌండ్ మీకు లేక‌పోతే మీరు ఏం చేసేవారు?
సుభాషిణి: అడుక్కు తినాల్సి వ‌చ్చేది. (న‌వ్వులు) చ‌దువు, బ్యాగ్రౌండ్ లేని వాళ్లు క‌ష్ట‌ప‌డి వ‌స్తారు. బ‌హుశా నేను కూడా అలాగే వ‌చ్చి ఉండేదాన్నేమో!

మీరు ఎక్క‌డి నుంచి వ‌చ్చారు?
సుభాషిణి: పుట్టి పెరిగింది మ‌ద్రాసులో. అక్క కూడా అక్క‌డే పుట్టింది. దాస‌రి, రాఘ‌వేంద్ర‌రావుగార్ల‌తో ఎక్కువ‌సినిమాలు చేయ‌డం వ‌ల్ల వాళ్ల కుటుంబంతో ఎక్కువ అటాచ్‌మెంట్ ఉండేది. (మ‌ధ్య‌లో అలీ అందుకుని.. ‘నిండు నూరేళ్లు’ చిత్రంలో మీరు మోహ‌న్‌బాబు సెకండ్ వైఫ్‌గా చేశారు. అందులో నేను చైల్డ్ ఆర్టిస్ట్‌ను. అది నా మూడో సినిమా. అందులో మోహ‌న్‌బాబు కుమార్తె మంచు ల‌క్ష్మి, రాఘ‌వేంద్ర‌రావు కూతురు, కొడుకు కె.ప్ర‌కాష్ కూడా న‌టించారు.) మీరు త‌ప్ప నాకు ఎవ‌రూ గుర్తులేరు.

మీ కెరీర్‌లో మొత్తం ఎన్ని సినిమాల్లో న‌టించారు?
సుభాషిణి: దాదాపు 100కు పైగా చిత్రాల్లో న‌టించి ఉంటా.

సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌కు సుభాషిణి అస్స‌లు గౌర‌వం ఇవ్వదని విన్నాం నిజ‌మేనా? అక్క బ్యాగ్రౌండ్ చూసుకొనా?
సుభాషిణి: అంతేగా! అక్క‌కూ నాకూ చాలా డిఫ‌రెన్స్ ఉంది. ఆమె ఎక్కువ మాట్లాడ‌దు. అంద‌రితోనూ చాలా గౌర‌వంగా ఉంటుంది. కానీ నేను అలా కాదు.. మాట్లాడ‌టం మొద‌లు పెడితే నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటా. అది రైటా? రాంగా? అన్న‌ది ఆలోచించ‌ను.

మీ ఇంట్లో మీరు శివ‌గామి అటగా?
సుభాషిణి: (న‌వ్వులు) సాధార‌ణంగా అంద‌రి దృష్టి అక్క‌పైనే ఉండేది. మ‌మ్మ‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు. ఇష్టానికి పెరిగాం. అందుకే చ‌దువు కూడా పెద్ద ఒంట ప‌ట్ట‌లేదు. నాకు బాగా కోపం ఉండేది. మా అన్న‌య్య‌ను స్పెష‌ల్‌గా చూడ‌టం నాకు న‌చ్చేది కాదు. నేను కూడా న‌టిని అయితే బాగా చూసుకుంటార‌ని అనిపించేది. బ‌హుశా నేను సినిమా ఫీల్డ్‌లోకి రావ‌డానికి ఇది కూడా ఒక కార‌ణ‌మేమో!

మీరూ శ్రీ‌దేవి బుర‌ఖాలు వేసుకుని సినిమాల‌కు వెళ్లేవార‌ట‌!
సుభాషిణి: అవును! చిన్న‌ప్ప‌టి నుంచి మేమిద్ద‌రం స్నేహితులం. కొన్నాళ్ల‌కు వాళ్లు మా ఎదురింటికి వ‌చ్చారు. ఇద్ద‌రం క‌లిసి తొక్కుడు బిళ్ల ఆడుకునేవాళ్లం. అయితే, అప్ప‌టికే త‌ను ఆర్టిస్ట్‌. సినిమాకు వెళ్తే జ‌నాలు ఎక్క‌డ గుర్తు ప‌డ‌తారోన‌ని బుర‌ఖా వేసుకుని వెళ్లే వాళ్లం. ఇద్ద‌రం క‌లిసి ఈత కూడా నేర్చుకున్నాం.

శ్రీ‌దేవి ఇక లేరు అని వార్త విన‌గానే మీకెలా అనిపించింది?
సుభాషిణి: షాకైపోయా. ఉద‌యాన్నే టీవీ చూడగానే నాకు నోట మాట రాలేదు. త‌ను హిందీ ఫీల్డ్‌కు వెళ్లినా కూడా న‌న్ను ఎప్పుడూ మ‌ర్చిపోలేదు. ఒక‌సారి హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు క‌లిస్తే, ‘సుబ్బ‌మ్మా..! ఎలా ఉన్నావ్‌’ అని ఆప్యాయంగా పలకరించింది. ఆ పిలుపుని ఎప్ప‌టికి మ‌ర్చిపోలేను.

మీది ప్రేమ వివాహ‌మా? పెద్ద‌లు కుదిర్చిన పెళ్లా?
సుభాషిణి: మావ‌య్య కొడుకునే వివాహం చేసుకున్నా. మాకు ఒక అమ్మాయి, పూజ‌. పూరి జ‌గ‌న్నాథ్ ‘143’లో న‌టించింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సినిమా చేయ‌లేదు.

ప్ర‌స్తుతం మీరు ఏం చేస్తున్నారు?
సుభాషిణి: గృహిణిని. ఇంట్లో ప‌నుల‌న్నీ నేనే చేసుకుంటా. ప‌ని మనుషులు కూడా లేరు. ఉద్యోగం చేస్తూ, ఇంట్లో కూడా ప‌నిచేసే మహిళ‌ల‌కు చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా చాలా క‌ష్టం.

మిమ్మ‌ల్ని ఉద‌యాన్నే షూటింగ్‌కి ర‌మ్మ‌ని, షాట్ తీయ‌డం ఆల‌స్య‌మైతే గొడ‌వ చేసేవాళ్ల‌ట‌?
సుభాషిణి: అంద‌రి ద‌గ్గ‌రా కాదు! కొంత‌మంది ద‌గ్గ‌ర‌. సీరియ‌స్‌గానే అడిగేదాన్ని. అయితే షూటింగ్ గురించి పెద్ద‌గా నాకు తెలియ‌దు. వెళ్ల‌డం.. కెమెరా ముందు నిల‌బ‌డి, న‌టించ‌డం మాత్ర‌మే తెలుసు.

మీ ఫాద‌ర్‌.. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ గొడ‌వ ప‌డ్డార‌ని విన్నాం. నిజ‌మేనా?
సుభాషిణి: ఏ విష‌యంలో గొడ‌వ‌ప‌డ్డారో నాకూ తెలియ‌దు. కాక‌పోతే హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గొడ‌వ జ‌రిగింది. నేనూ ఆయనా క‌లిసి ‘టైగ‌ర్’  సినిమాలో న‌టించాం. షూటింగ్ అయిపోయిన త‌ర్వాత ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తే, విమానం ఆల‌స్యం అన్నారు. రాత్రి 7గంటలు కాస్తా 8.. 9.. 10 గంట‌లైనా విమానం రాక‌పోతే ర‌జనీకాంత్‌కు కోపం వ‌చ్చింది. ఆక‌లి వేస్తోంద‌ని భోజ‌నం చేయ‌డానికి బ‌య‌ట‌కు వెళ్దామ‌ని అనుకున్నాం. అంద‌రం జీపులో వెళ్లాం. సగం దూరం వెళ్లాక ఏమ‌నుకున్నారో తెలియ‌దు వెన‌క్కి వ‌చ్చేశాం. ముందు నేను, మా నాన్న వెళ్తుంటే, వెనుక వ‌స్తున్న ర‌జ‌నీ స‌డెన్‌గా అరిచేశారు. పెద్ద పెద్ద కేక‌లు వేశారు. అప్పుడు మా నాన్న స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఇరువురి మ‌ధ్య మాట‌మాటా పెరిగి పెద్ద గొడ‌వ‌ జ‌రిగింది. అదే పేప‌ర్లో వ‌చ్చింది. ఆ మ‌రుస‌టి రోజు కూడా ఇద్ద‌రం వేర్వేరు విమానాల్లో వెళ్లాం. నెల రోజుల త‌ర్వాత మ‌ద్రాసులో ఏవీఎం స్టూడియోలో నాకు, ఆయ‌న‌కు వేర్వేరు సినిమా షూటింగ్‌లు జ‌రుగుతుండ‌గా, మా ఫాద‌ర్ వెళ్లి క‌లిసి మాట్లాడారు. ఆ త‌ర్వాత వాళ్లు మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

‘అరుంధ‌తి’ త‌ర్వాత మీకు అలాంటి పాత్ర‌లే వ‌చ్చాయా?
సుభాషిణి: అవును! దాదాపు అలాంటి పాత్ర‌లే వ‌చ్చాయి. కానీ, నాకు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క వ‌ద్ద‌నుకున్నా. ఆ సినిమా చేసిన‌ప్పుడు అంత పెద్ద హిట్ అవుతుంద‌ని నేను అనుకోలేదు. ప‌శుప‌తి త‌ల్లి పాత్ర కోసం మేక‌ప్ వేసుకోవ‌డానికి రెండు గంట‌ల స‌మ‌యం ప‌ట్టేది.

ఇప్పుడు అవ‌కాశాలు వ‌స్తే, సినిమాలు చేస్తారా?
సుభాషిణి: ఈ కార్య‌క్ర‌మం త‌ర్వాత అలీగారితో మాట్లాడిన త‌ర్వాత అన్నీ గుర్తొచ్చి సినిమాలు చేస్తానేమో!

మీకు మ‌ల‌యాళం వ‌చ్చా?
సుభాషిణి: అస్స‌లు రాదు.. ఆ సినిమాల్లో అవ‌కాశం వ‌స్తే ఏడ్చేసేదాన్ని. నోరు తిర‌గ‌దు. క‌న్న‌డం మాత్రం కొద్దిగా మాట్లాడ‌తా!

మీకు మీ ఆయ‌న కూడా భ‌య‌ప‌డ‌తార‌ట‌!
సుభాషిణి: ఇదేంటండీ! ఇందులో అస్స‌లు నిజం లేదు (న‌వ్వులు)

మీరు జీవితంలో బాధ‌ప‌డిన సంద‌ర్భం ఉందా?
సుభాషిణి: మా తండ్రి, మా బావ‌గారు చ‌నిపోయిన‌ప్పుడు చాలా బాధేసింది. ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నాం.

పెళ్ల‌యిన త‌ర్వాత సినిమాలు వ‌ద్ద‌నుకున్నారా?
సుభాషిణి: మొద‌ట్లో వ‌ద్ద‌నుకున్నా. కానీ, పాప పుట్టిన త‌ర్వాత ఇంట్లో బోరుకొట్టిన‌ప్పుడు సినిమాలు చేస్తే బాగుంటుంద‌నిపించింది.

ఐట‌మ్ సాంగ్ చేసిన‌ప్పుడు మీకెలా అనిపించింది?
సుభాషిణి: ఆ పాట కోసం అంద‌రూ ప్ర‌త్యేక డ్రెస్ వేసుకున్నారు. కానీ, నేను ఆ డ్రెస్ వేసుకోలేక‌పోయా. సిగ్గుతో షార్ట్ వేసుకుని ఆపైన డ్రెస్ వేసుకోవాల్సి వ‌చ్చింది. జ‌య‌మాలిని పిలిచి తిట్టారు. ‘ఇది మ‌న వృత్తి. దీనికి న్యాయం చేయాలంటే అంద‌రం ఒకే ర‌క‌మైన డ్రెస్ వేసుకోవాలి. అలా కాకుండా మీరు వేరుగా, మేము వేరుగా డ్రెస్ వేసుకుంటే బాగుండదు. వెళ్లి, డ్రెస్ మార్చుకుని రా’ అని కాస్త గట్టిగానే చెప్పారు.

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం

తెలుగు సినిమా: గొప్ప ఇండ‌స్ట్రీ
అక్క‌: ప్రాణం
జ‌య‌ప్ర‌ద‌: మ‌రో అక్క‌
శ్రీ‌దేవి: మ‌రో ప్రాణం
దాస‌రి: ఆయ‌న గురించి మాట్లాడే అర్హత నాకు లేదు
జ‌య‌మాలిని: బెస్ట్ డ్యాన్స‌ర్‌
బావ‌గారు: మా గుండెకు బాగా ద‌గ్గ‌రైన వ్య‌క్తి
పూజ‌: నా త‌ల్లి
జీవితం: పాఠం
పెళ్లి: మ‌రువ‌లేని జ్ఞాప‌కం
అరుంధ‌తి: ట‌ర్నింగ్ పాయింట్‌
అలీ: నా బ్ర‌ద‌ర్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.