
తాజా వార్తలు
ఇంటర్నెట్ డెస్క్ : ఎన్నికల్లో ప్రచారమే ప్రధానం. ఇది ఎంత ముందుగా మొదలుపెడితే అంత సులువుగా ఓటర్లను ఆకర్షించవచ్చనేది అన్ని పార్టీలు నమ్మే సూత్రం. అందుకు ఖర్చుకు కూడా వెనకాడవు. అందులోనూ ఈ సార్వత్రిక సమరాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నందున ఖర్చు విషయంలోనే కాక అన్ని విషయాల్లోనూ ప్రత్యర్థి పార్టీల కన్నా ముందుండాలని భావిస్తున్నాయి. ప్రచారంలో తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాలు చుట్టి రావాలని చూస్తున్నాయి. రోడ్డు మార్గంలో కాకుండా వాయు మార్గంలో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఫలితంగా ప్రైవేటు జెట్లు, హెలికాఫ్టర్ల బుకింగ్‌లు రాకెట్ వేగంతో సాగుతున్నాయి. ప్రైవేటు జెట్లు, హెలికాప్టర్లు బుకింగ్‌లో ముందంజలో ఉన్నారు ప్రధాని మోదీ. ఎన్నికల నోటిఫికేషన్ కన్నా మూడు నెలల ముందే వాటిని బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రచారాన్ని పరిమితం చేయాలన్న ఉద్దేశంతో అందుబాటులో ఉన్న అన్ని హెలికాప్టర్లను ముందస్తుగా బుక్ చేసుకున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. నిజానికి ప్రతి సార్వత్రిక ఎన్నికల సమయానికి చాపర్స్ విమానాలకు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అందుకు తగ్గట్లుగా సేవలు అందించలేకపోతున్నాయి ఆ సంస్థలు. అందుకే ఈ విషయంలో భాజపా ముందు జాగ్రత్తతో వ్యవహరించింది. కమలదళం 20 ప్రైవేటు జెట్లు, 30 హెలికాప్టర్లు బుక్ చేసుకోగా.. కాంగ్రెస్ వాటిలో ఐదో వంతు సేవలే పొందగలిగింది. ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఒకేసారి 45 రోజులకు బుక్ అవుతున్నాయి. జెట్బుకింగ్కు గంటకు 5,700 డాలర్లు అద్దె తీసుకుంటుండగా.. చాపర్స్కి గంటకు 7,200 డాలర్లుగా నిర్ణయించాయి సంస్థలు. కొన్ని సంస్థలు కావాలనే ఓ పార్టీకి మద్దతు ఇస్తూ అన్ని ఎయిర్ క్రాప్టులను వారికి మాత్రమే అందుబాటులో ఉంచుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కానీ, ముందస్తుగా వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నామని ఏ పార్టీతోనూ తమకు సంబంధం లేదని ఆయా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. అంతేకాదు నష్టాల ఊబిలో కూరుకుపోయిన తమను ఈ ప్రచార పండుగ గట్టెక్కిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్క్రాప్టుల బుకింగ్ విషయంలో అన్ని పార్టీల్లో మధ్యవర్తులే కీలకంగా ఉంటారు. ఆపరేటర్స్ నుంచి ముందుగా వీళ్లు గంటల లెక్కన అద్దెకు తీసుకుంటారు. వాటిని రెట్టింపు ధరకు పార్టీలకు అద్దెకు ఇస్తుంటారు. భౌగోళిక విస్తీర్ణం అధికంగా ఉన్న భారత్‌లో అన్ని వైపులకు తిరిగి ప్రచారం చేయాలంటే మాటలు కాదు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అన్ని నియోజకవర్గాలు, గ్రామాలు రోడ్డు మార్గంలో చుట్టి రావాలంటే చాలా కష్టం. అందుకే పార్టీలు వాయుమార్గం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఫలితంగా మధ్యవర్తుల జేబులు నిండుతున్నాయి.
ఏప్రిల్ 6న ఒకే రోజు 6 ర్యాలీల్లో పాల్గొన్నారు భాజపా అధ్యక్షుడు అమిత్ షా. ఉదయం విజయవాడకు వెళ్లిన ఆయన మధ్యాహ్నం అస్సాంలోని దిబ్రుగర్‌కు చేరుకున్నారు. సాయంత్రం స్వస్థలం అహ్మదాబాద్‌కు పయనమయ్యారు. ఒక్క రోజులోనే 4,500 కిలోమీటర్లు ప్రయాణించారు. అదంతా ఎయిర్క్రాప్టుల వల్లనే సాధ్యమైంది. అయితే రాజకీయ నాయకుల రవాణా అంశం చర్చకు రావడం ఇదే తొలిసారి కాదు. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోదీ బిలియనీర్ గౌతమ్ అదానీ విమానాలు ప్రచారానికి వాడుకొన్నారని ఆరోపించింది కాంగ్రెస్. ఈ ఆరోపణలపై స్పందించి అదానీ మోదీకి వాటిని అద్దెకు ఇచ్చానని.. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని స్పష్టంచేశారు. ఈసారి ఎయిర్‌క్రాప్ట్ బుకింగ్‌కు సంబంధించిన లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోనే సాగుతున్నాయి. కొన్ని సంస్థలు తక్కువ ధరకే సేవలు అందిస్తున్నట్లు బిల్లులు చూపించి అనధికారికంగా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
2014 ఎన్నికల సమయంలో అద్దెకు తీసుకున్న పార్టీలు కొన్ని సంస్థలకు బకాయిలు చెల్లించలేదని సమాచారం. విచారణల భయంతోనే ఆ సంస్థలు కూడా మౌనం వహిస్తున్నాయని సమాచారం. ఏది ఏమైనా ప్రచారానికి హెలికాప్టర్లను వినియోగించడం ఓటర్లను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది ఓటర్లు తమ పల్లెల్లోకి జెట్లు వస్తున్నాయంటే ఆసక్తిగా చూస్తుంటారు. ఈ తరహా ప్రచారం ఓట్లు రాలుస్తుందని కచ్చితంగా చెప్పలేకపోయినా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
