close

తాజా వార్తలు

ఐపీఎల్‌ 12లో వివాదాలు

వార్తల్లోకెక్కిన ప్రధాన ఆటగాళ్లు

ఐపీఎల్‌ 2019 లీగ్‌ దశ ముగిసింది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ తొమ్మిది వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. దీంతో నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా కోల్‌కతా ఇంటికి చేరి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. కాగా పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానం సంపాదించింది. ఇదిలా ఉండగా 44 రోజుల పాటు నిర్విరామంగా జరిగిన లీగ్‌ దశలో ఎన్నో మరుపురాని ఘటనలు చోటుచేసుకోడంతో పాటు కొన్ని వివాదాలు నెలకొన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ ఐదు అంశాలు వార్తల్లో నిలవడంతో ఐపీఎల్‌ 12వ సీజన్‌ కాస్త రసవత్తరంగానే జరిగిందని చెప్పాలి. 

అశ్విన్‌ మన్కడింగ్‌: ఈ సీజన్‌లో మొట్టమొదటి వివాదం అశ్విన్‌ చేసిన మన్కడింగ్‌ ఔట్‌. రాజస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌బట్లర్‌ను అశ్విన్‌ ఈ విధంగా ఔట్‌ చేసి వార్తల్లో నిలిచాడు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొందరు ఆటగాళ్లు వ్యాఖ్యానించగా అశ్విన్‌ క్రికెట్‌ నిబంధనల మేరకే వ్యవహరించాడని మరికొందరు అతడికి మద్దతిచ్చారు. అయితే ఈ వివాదం ఇంతటితో ఆగకుండా తర్వాత కూడా అశ్విన్‌ను వెంటాడింది. నాన్‌స్ట్సైకర్‌ ఎండ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లీ, శిఖర్‌ ధావన్‌ లాంటి బ్యాట్స్‌మెన్‌ మన్కడింగ్‌ వివాదాన్ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. 

కెప్టెన్‌ (నాట్‌) కూల్‌ ధోనీ: రాజస్థాన్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్‌ కూల్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ధోనీ ఆ మ్యాచ్‌లో అంపైర్లపై కస్సుబుస్సులాడాడు. బెన్‌స్టోక్స్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో చెన్నై 3 బంతుల్లో 8 పరుగులు చెయ్యాల్సిన పరిస్థితి. ఆ సమయంలో స్టోక్స్‌ వేసిన బంతిని ఫీల్డ్‌ అంపైర్‌ మొదట నోబాల్‌గా ప్రకటించాడు. అనంతరం లెగ్‌ అంపైర్‌ ఈ నిర్ణయాన్ని కాదనడంతో బాల్‌ కౌంటైంది. దీంతో ఆగ్రహించిన ధోనీ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అయితే ధోనీ ఇలా వ్యవహరించడం సరికాదని పలువురు మాజీలు పేర్కొన్నారు. 

కొంపముంచిన నోబాల్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ నోబాల్‌ వివాదం తీవ్ర దుమారం లేపింది. ఆఖరి బంతికి బెంగళూరు 7 పరుగులు చేయాల్సిన స్థితిలో ముంబయి బౌలర్‌ లసిత్‌ మలింగ నోబాల్‌ వేశాడు. అంపైర్‌ అది గమనించకపోవడం రీప్లేలో తేలింది. ఈ కారణంగా ఈ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ ఆరు పరుగులతో ఓటమిపాలైంది. అంపైర్‌ ఆ బంతిని గమనించి ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది. దీనిపై కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.

కోల్‌కతాపై రసెల్‌ రుసరుస: ఐపీఎల్‌ తొలి సగభాగంలో వరుస విజయాలు నమోదు చేసిన కోల్‌కతా తర్వాత వరుస ఓటములు చవిచూసింది. ఆ జట్టు కీలక ఆటగాడు, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఆండ్రీ రసెల్‌ కోల్‌కతా యాజమాన్యంపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో వాతావరణం కూడా బాగోలేదని, తప్పుడు నిర్ణయాలవల్లే జట్టు ఓటముల పాలైందని అన్నాడు. రసెల్‌ని బ్యాటింగ్‌ లైనప్‌లో ముందుకు తీసుకురాకపోవడంతో కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ సైతం విమర్శలు ఎదుర్కొన్నాడు. వీటితో పాటు ఆ జట్టు కోచ్‌ సైమన్‌ కటిచ్‌ కూడా డ్రెస్సింగ్‌ రూమ్‌లో సరైన వాతావరణం లేదని చెప్పాడు.

రెండు రోజుల టీ20 మ్యాచులు: ఈ సీజన్‌లో కొన్ని మ్యాచులు రెండు రోజులు జరిగాయి. అదెలాగంటే స్లో ఓవర్‌రేట్‌ కారణంగా రాత్రి 8 గంటలకు ప్రారంభమైన మ్యాచ్‌లు అర్ధరాత్రి 12 తర్వాత కూడా కొనసాగాయి. దీంతో ఈ మ్యాచులకు రెండు రోజుల టీ20లు అనే పేరొచ్చింది. స్లో ఓవర్‌రేట్‌ కారణంగా బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, పంజాబ్‌ కెప్లెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ జరిమానా ఎదుర్కొన్నారు. స్లో ఓవర్‌ రేట్‌ అంశం పెద్దగా చర్చకురాకపోయినా ఐపీఎల్‌ నిర్వాహకులు గుర్తించారు. అందువల్లే ప్లే ఆఫ్‌ మ్యాచుల సమయాన్ని మార్చారని వినికిడి. మే 7 నుంచి ప్రారంభమయ్యే ప్లే ఆఫ్స్‌ మ్యాచులు 8 గంటలకి బదులు 7:30కే మొదలౌతాయి.

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.