close

తాజా వార్తలు

ఆ జట్టులో మూడోవంతు విదేశీ ఆటగాళ్లే..!

 రెస్టాఫ్‌ ది వరల్డ్‌ను తలపిస్తున్న ఇంగ్లాండ్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ వెక్కిరించారో.. సానుభూతి చూపారో.. ఎద్దేవా చేశారో.. తెలియదు కానీ.. వాస్తవం మాట్లాడారు. ఇంగ్లాండ్‌ జట్టు ‘రెస్టాఫ్‌ ది వరల్డ్‌’ జట్టును తలపిస్తోందని వ్యాఖ్యానించారు. అవును.. ప్రస్తుతం ఆ దేశ 2019 ప్రపంచకప్‌ జట్టులో మూడోవంతు మంది అసలు ఇంగ్లాండ్‌లోనే పుట్టలేదు. ఇప్పుడు వారే ఇంగ్లిష్‌ టీమ్‌కు వెన్నెముకగా మారారు. ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌ జట్టుకు 736 ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించగా.. వారిలో 107 మంది  విదేశీయులే. వీరిలో భారత్‌కు చెందిన వారు 17 మంది.. దక్షిణాఫ్రికాకు చెందినవారు 17 మంది ఉన్నారు. వేల్స్‌ నుంచి 14 మంది  ఆస్ట్రేలియా నుంచి 10 చొప్పున ప్రాతినిధ్యం వహించారు.  ఈ సారి ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టులో ఏకంగా సారథి ఇయాన్‌ మోర్గాన్‌ విదేశీయుడు. మొయిన్‌ ఆలీ, ఆదిల్‌ రషీద్‌లు పాక్‌ మూలాలు ఉన్న ఆటగాళ్లు. ఇంగ్లిష్‌ జట్టులో కీలకమైన విదేశీ ఆటగాళ్ల వివరాలు..

ఇయాన్‌ మోర్గాన్‌..
ఇంగ్లిష్‌ జట్టు సారథి ఇయాన్‌ మోర్గాన్‌ ఐర్లాండ్‌లోని డుబ్లిన్‌లో జన్మించాడు. తొలుత ఐర్లాండ్‌ జట్టులో 23 వన్డేలు ఆడి 744 పరుగులు చేశాడు. ఐర్లాండ్‌ తరపున మోర్గాన్‌ బ్యాటింగ్‌ సగటు 35.42. అదే సమయంలో ఇంగ్లాండ్‌ లయన్స్‌కు దక్షిణాఫ్రికాకు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. దీనిలో ఈ ఎడమ చేతివాటం క్రీడాకారుడు ఇంగ్లిష్‌ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2009లో ఐర్లాండ్‌ టీ20 వరల్డ్‌ కప్‌ జట్టుకు ఎంపికైన తర్వాత ఆడకూడదని నిర్ణయించుకొన్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ తరపున బరిలోకి దిగాడు. దాదాపు 200 వన్డేలు ఆడి  అత్యధిక పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుకు నాయకత్వం వహించిన మూడో ఐర్లాండ్‌ క్రీడాకారుడు మోర్గాన్‌.

బెన్‌ స్టోక్స్‌..

ఇంగ్లాండ్‌ జట్టులో మరో కీలక ఆటగాడు బెన్‌ స్టోక్స్‌. 1991 జూన్‌4న న్యూజిలాండ్‌లోని కాంటర్బరీలో జన్మించాడు. బెన్‌ తండ్రి గెరాల్డ్‌ న్యూజిలాండ్‌ తరపున రగ్బీజట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. బెన్‌ చిన్నతనంలో ఆయన  కుటుంబం ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయింది.  అక్కడ క్రికెట్‌లో ఓనమాలు దిద్దుకొని 19వ  ఏటే ఇంగ్లాండ్‌ జట్టులో స్థానం సంపాదించాడు. కానీ, క్రమశిక్షణ చర్యలకు గురై కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌ జట్టులో స్టోక్స్‌ కీలక ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

జేసన్‌ రాయ్‌

దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జన్మించిన జేసన్‌ రాయ్‌ కుటుంబం పదేళ్ల వయస్సులో యూకేకు తరలి వచ్చింది. తొలుత ఇంగ్లాండ్‌ టీ20 జట్టులో స్థానం సంపాదించిన రాయ్‌ ఆ తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. 2015లో ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌లో విఫలమై మార్పుల కోసం చూస్తుండగా రాయ్‌ టీమ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత జట్టు బ్యాటింగ్‌ లైనప్‌లో రాయ్‌ ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు.  ఇంగ్లాండ్‌ తరపున వన్డేల్లో అత్యధికంగా 180 పరుగులు చేసింది  ఇతనే.

టామ్‌ కుర్రాన్‌

జింబాబ్వే మాజీ క్రికెటర్‌ కెవిన్‌ కుర్రాన్‌ కుమారుడే టామ్‌ కుర్రాన్‌. ఈ ఆల్‌రౌండర్‌ కేప్‌టౌన్‌లో జన్మించాడు. సర్రే కౌంటీకి ప్రాతినిధ్యం వహించాడు. బాల్‌ను రెండువైపులా స్వింగ్‌ చేయగల సామర్థ్యంతో జట్టు కష్టకాలంలో బ్యాటింగ్‌లో కూడా రాణించగలడు. పరిమిత ఓవర్ల మ్యాచ్‌కు సరిగ్గా సరిపోతాడు. ఇంగ్లాండ్‌ జట్టులో మూడు ఫార్మాట్లకు టామ్‌ ప్రాతినిధ్యం వహించాడు.  

జోఫ్రా ఆర్చర్‌

జోఫ్రా ఇటీవలే ఇంగ్లాండ్‌ జట్టులోకి వచ్చాడు. టీ20లో అద్భుతంగా రాణించాడు. బార్బోడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జన్మించిన ఆర్చర్‌ వెస్టిండీస్‌ అండ్‌ 19  జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ అక్కడ క్రికెట్‌ వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగా గుర్తింపురాలేదు. అదే సమయంలో క్రిస్‌ జోర్డాన్‌ ఇంగ్లీష్‌ కౌంటీ సుసెక్స్‌ ఆర్చర్‌ పేరును రిఫర్‌ చేశాడు. దీంతోపాటు హోబార్ట్‌ హరికేన్స్‌ తరపున బీబీఎల్‌లో ఆడటంతో ఆర్చర్‌ పేరు మార్మోగిపోయింది. దీంతో అతని కోసం నిబంధనలను మార్చి మరీ వరల్డ్‌ కప్‌ ఆడే ఇంగ్లాండ్‌ జట్టులోకి తీసుకొన్నారు.  


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.