close

తాజా వార్తలు

వెదురుతో వైవిధ్యంగా...!

నిటారుగా పెరిగే వెదురు...ఆమె చేతిలో పడితే ఔరా అనిపించే కళాఖండంగా మారిపోతుంది. అంతేనా! కుంగుబాటు నుంచి బయటపడేందుకు నేర్చుకున్న ఈ కళ ద్వారా ఎందరో గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఆమే మహారాష్ట్రలోని చంద్రపూర్‌కి చెందిన మీనాక్షీ వాల్కే. ఆమె ప్రస్థానం ఇలా...!
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి కష్టకాలాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి పరిస్థితి నాకూ ఓ సారి ఎదురయ్యింది. దాన్నుంచి బయటపడేందుకు ఈ వెదురు కళే తోడయ్యింది. చంద్రపూర్‌లోని బెంగాల్‌ క్యాంపు మురికివాడలో మా నివాసం. నేను, అమ్మానాన్న, ఇద్దరన్నదమ్ములు,  ఇదే మా కుటుంబం. ఉన్న రెండు ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ బతికేవాళ్లం. పంటలు సరిగా పండక పస్తులున్న రోజులెన్నో. అయినా సరే! వ్యవసాయం మానలేదు. కొన్నాళ్లకు స్థానికంగా ఉండే ముఖేష్‌తో నా పెళ్లయ్యింది. అత్తింటివారి ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే. చాలీచాలని కుటుంబ ఆదాయంతో మా వారు నెట్టుకొచ్చేవారు. దాంతో నేనూ కొంతైనా సంపాదించాలనుకున్నా. మేముండే ప్రాంతం చుట్టూ అడవులు విస్తరించి ఉంటాయి. దాంతో వెదురు సులువుగా లభ్యమయ్యేది. వాటితో కుంకుమ భరిణెలు, ఆకు,వక్క పెట్టుకునే బాక్సులు, నగలు తయారు చేయడం చూసి సరదాగా నేర్చుకున్నా. ఈలోగా గర్భం దాల్చా. అనారోగ్యకారణాల వల్ల బిడ్డ గర్భంలోనే చనిపోయింది. దాంతో తీవ్రమైన ఆందోళన, నిరుత్సాహానికి గురయ్యా. అప్పుడు నా భర్త, సన్నిహితులు ఆ బాధ నుంచి నేను బయట పడేందుకు నాకు నచ్చే వ్యాపకాలను అలవాటు చేసుకోమని ప్రోత్సహించారు. నాకు వెదురు వస్తువుల తయారీపై ఉన్న ఆసక్తిని గమనించి బీచ్‌పల్లిలో ఉన్న బాంబూ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ ఇప్పించారు. అక్కడ డెబ్భై రోజుల శిక్షణ తీసుకున్నా.

కళాకృతులెన్నో...
శిక్షణ పూర్తయ్యాక స్థానికంగా ముడిసరకు కొని వీటి తయారీ మొదలుపెట్టా. కేవలం వెదురుతోనే కాదు...కొబ్బరిచిప్పలు, కాగితం వంటివాటినీ ఉపయోగించి వివిధ వస్తువుల్ని రూపొందించడం ప్రారంభించా. వాటిల్లో రాఖీలు, గడియారాలు, బుట్టలు, పండ్ల రూపాలు, దీపాలు, దేవతలను పోలి ఉండే ఆకృతులెన్నో ఉన్నాయి. వాటిని స్థానిక దుకాణాలకు సరఫరా చేయడం ప్రారంభించా. నేను కాస్త నిలదొక్కుకున్నాక మా ఇంటి దగ్గర్లో ఉండే ఆదివాసీ మహిళలకు వీటి తయారీలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టా. నాతో పాటూ వారూ నెలకు ఐదువేల రూపాయల వరకూ ఆదాయాన్ని అందుకుంటున్నారు. మా పనితీరు, నాణ్యత గమనించి పెద్ద ఎత్తున సరఫరా చేయమని అడిగే దుకాణాలూ ఉన్నాయి. ఫేస్‌బుక్‌ ద్వారానూ ఆర్డర్లు అందుకుంటున్నా. ఇజ్రాయిల్‌, జెరూసలెం దేశంలోని మహిళలు, పిల్లలకు వెదురు వస్తువుల తయారీలో శిక్షణ ఇచ్చే అవకాశం లభించింది. త్వరలోనే అక్కడికి వెళ్లనున్నా.

- చొక్కాల రమేశ్‌, ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌.
 

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.