close

తాజా వార్తలు

చంద్రబాబుకుకాదు ప్రజలకు దత్తపుత్రుడిని:పవన్‌

విశాఖ: కార్మికుల్లో ఎంత ఆవేదన ఉందో రోడ్లపైకి వచ్చిన వారినే చూస్తే తెలుస్తుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో లాంగ్‌మార్చ్‌ నిర్వహించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. ప్రభుత్వం సరిగా పనిచేయనందునే ఇంతమందిలో ఆవేదన పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారన్నారు. వైకాపా నేతల ఆరోపణలపై స్పందిస్తూ..  ప్రజలకు మాత్రమే తాను దత్తపుత్రుడినని, చంద్రబాబుకుకాదని స్పష్టం చేశారు. తన ప్రసంగంలో వైకాపా ప్రభుత్వం, ఆ పార్టీ నేతల తీరుపై పవన్‌ నిప్పులు చెరిగారు.

అద్భుత పాలన అందిస్తే నేను.. సినిమాలు చేసుకుంటా

‘‘అధికారం కోసం అర్రుల చాచే వ్యక్తిని కాదు. రాజకీయాలు అంటే అందరికీ సంపాదనేమో.. నాకు మాత్రం బాధ్యత. ప్రజల ఆవేదనే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. నాయకులంతా బాధ్యతగా ఉండుంటే జనసేన పెట్టే అవసరమే లేకపోయేది. సీఎం జగన్‌ అద్భుత పాలన అందిస్తే నేను మళ్లీ సినిమాలు చేసుకుంటా. ఇసుక కొరత వల్లే అభివృద్ధి ఆగిపోయింది. భవన నిర్మాణ కార్మికుల కష్టం చాలా బలంగా నా మనసును తాకింది. ఆ కార్మికుల కష్టాల్లో నాకు దేవుడు కనిపించాడు. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే ప్రజలు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారో ఆలోచించాలి’’ అని పవన్‌ అన్నారు.

కన్నబాబును రాజకీయాల్లోకి తెచ్చిందే మేము!

‘‘నన్ను విమర్శిస్తున్న నాయకుల బతుకులు తెలుసు. కన్నబాబును నాగబాబు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన నన్ను విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయామని అలుసా? ఓటమి, గెలుపు కాదు.. పోరాటమే మాకు తెలుసు. నన్ను విమర్శించే నాయకుల్లా నాకు వేల ఎకరాలు లేవు. వైకాపా నేతల్లా రాజకీయాల్లో రూ.వందలకోట్లు ఖర్చు పెట్టలేను. నన్ను విమర్శించే నాయకులంతా ఓ పార్టీ పెట్టి చూడండి. పార్టీని నడపడం అంటే ఆషామాషీ కాదు. నేను డబ్బుతో పార్టీ నడిపే వ్యక్తిని కాదు..భావజాలంతో నడుపుతున్నా’’ అని చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు

‘‘భవన నిర్మాణ కార్మికుల విషయంలో వైకాపా ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నాం. ప్రభుత్వం చేసిన తప్పునకు ఉపాధి కోల్పోయి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఒక్కో కార్మికుడికి రూ.50వేల సాయం ఇవ్వాలి. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందజేయాలి. రెండు వారాల్లో ప్రభుత్వం స్పందించకపోతే అమరావతి వీధుల్లో నడుస్తా. ఎవరు అడ్డుకుంటారో చూస్తా. చంద్రబాబుపై కోపం కార్మికులపై చూపొద్దు. పార్టీ అధికారంలోకి రాగానే ఎవరైనా నిర్మాణాలతో పాలన మొదలెడతారు.. వీళ్లు మాత్రం కూల్చివేతలతో మొదలెట్టారు. ఎంతవేగంగా నిర్మాణాలను కూల్చివేశారో ప్రభుత్వం కూడా అంతేవేగంగా పడిపోతుంది’’ అని పవన్‌ దుయ్యబట్టారు.  

రెచ్చిపోతే బండారం బయటపెడతా..
‘‘వైకాపా నేతలు దిల్లీకి వెళ్లి భాజపా నేతల వద్ద ఎలా ఉంటారో తెలుసు. డొంక తిరుగుడు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు.  ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా నీతులు చెబుతున్నారు. ఆయన దిల్లీ వెళ్లి నాలుగు గోడల మధ్య ఎలా వ్యవహరిస్తారో నాకు తెలుసు. కానీ సభాముఖంగా చెప్పడం సంస్కారం కాదు. రెచ్చిపోతే మీ బండారం బయటపెడతా. రాష్ట్రంలో పార్టీలు, మన రాష్ట్రంలో ప్రజలు కులాల వారీగా విడిపోవడం మన దౌర్బాగ్యం. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యపై  అక్కడి పార్టీలన్నీ కలిసి పోరాడుతున్నాయి. నేటి యువతరంలో మార్పు రావాలి. భవన నిర్మాణ కార్మికుల సమస్య ఏ ఒక్క పార్టీదో కాదు. ఇక్కడ కూడా అన్ని పార్టీలు కలిసి పోరాడాలి’’ అన్నారు. 

‘హోదా’ను వదిలిపెట్టలేదు..
‘‘ప్రత్యేక హోదా అంశాన్ని అందరూ వదిలేసినా నేను మాత్రం వదిలిపెట్టలేదు. ప్రజల ఆకాంక్ష కోసం నన్ను ప్రేమగా పిలిచే మోదీతో కూడా విభేదించా. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని దిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు తెలియజేస్తా’’ అని పవన్‌ తెలిపారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.