close

తాజా వార్తలు

నైట్రేట్లే ఆ 86 గోవులను చంపాయ్‌!

మోతాదుకు మించి 4.47 గ్రాములు
గోవుల మృతిపై ముగిసిన సిట్‌ దర్యాప్తు
నివేదిక సమర్పించిన బృందం
ఈనాడు - విజయవాడ

సంచలనం సృష్టించిన ఆవుల మృతి ఘటనపై అనుమానాలు నివృత్తి అయ్యాయి. ఇప్పటికే పూర్తి అయిన దర్యాప్తునకు సంబంధించి, సిట్‌ తన నివేదికను సమర్పించింది. గ్రాసంలో చేరిన అధిక శాతం నైట్రేట్ల కారణంగానే మరణాలు సంభవించాయని బృందం తేల్చింది. నగర శివారు కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో పెద్ద సంఖ్యలో ఆవులు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆగస్టు, 10వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 86 ఆవులు మరణించాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించి సిట్‌ను ఏర్పాటు చేసింది. సభ్యులను సీపీ ద్వారకా తిరుమలరావు నియమించారు. బృందానికి సీసీఎస్‌ ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వం వహించారు. సభ్యులుగా చలపతిరావు (సీఐ, సీసీఎస్‌), ఉమర్‌ (సీఐ, రెండో పట్టణ స్టేషన్‌), శేఖర్‌ బాబు (ఎస్‌.ఐ., రెండో పట్టణ స్టేషన్‌), అర్జున్‌ (ఎస్‌.ఐ., టాస్క్‌ఫోర్స్‌), దీపిక (ఎస్‌.ఐ., సైబర్‌ క్రైం) ఉన్నారు. ఈ బృందం గోవుల మృతికి సంబంధించి అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించారు.

పక్కాగా పరిశీలన
గోవుల మృతికి సంబంధించి అన్ని అంశాలను పరిశీలించారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఏదైనా ఉందా?, కాకతాళీయంగా జరిగిందా?, గ్రాసం, నీరు కారణంగా మరణించాయా?, విష ప్రయోగం జరిగిందా? అన్న కోణాల్లో చూశారు. ఘటన జరిగిన తర్వాత పశువైద్యులు ఆవులు తాగిన నీరు, మేసిన గడ్డి నమూనాలు సేకరించారు. పోస్టుమార్టం  సందర్భంగా కాలేయం, కిడ్నీలు, తదితర భాగాలను విస్రా పరీక్ష కోసం తీసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. కొన్ని నమూనాలను పశుసంవర్ధక ప్రయోగశాలకు కూడా పంపించారు.

* గ్రాసం తీసుకుంటూ మరణించాయి కాబట్టి, దీని కారణంగానే ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్థరణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచే పరిశోధన ప్రారంభించారు. ఆవులు మృతి చెందిన ఘటన సమయంలో గ్రాసం వివిధ ప్రాంతాల నుంచి సరఫరా అయింది. ప్రకాశం జిల్లా అద్దంకి పరిసర ప్రాంతాల నుంచి అధికంగా వచ్చింది. మిగిలింది కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి తీసుకున్నారు.
* దీంతో సిట్‌ అధికారులు ప్రకాశం జిల్లా వెళ్లారు. అక్కడ నమూనాలను తీసుకుని పరీక్షలకు పంపించారు. రసాయన అవశేషాలు ఉన్నాయా? అన్న విషయం తెలుసుకునేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్‌తో పాటు, వెటర్నరీ ల్యాబ్‌, గుంటూరు జిల్లా లాం లోని పరిశోధనా కేంద్రానికి పంపారు.

శాస్త్రీయంగా శోధన: కొత్తూరు తాడేపల్లిలోని గోశాల పరిసర ప్రాంతాల వివరాలు సేకరించారు. అక్కడ ఉన్న సెల్‌ టవర్లకు సంబంధించిన వివరాలను తీసుకుని వడపోశారు. అక్కడి టవర్ల నుంచి బయటకు వెళ్లిన, బయట నుంచి ఇక్కడికి వచ్చిన కాల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక వీఆర్వో, పెద్ద మనుషుల ద్వారా అక్కడ అనుమానాస్పద వ్యక్తుల కదలికల గురించి ఆరా తీశారు. ఎక్కడా ఆధారాలు లభించలేదు. బయట నుంచి ఎవరూ రాలేదని నిర్ధరణకు వచ్చారు.

* అక్కడకు వెళ్లే దారుల్లోని అన్ని సీసీ కెమెరాల దృశ్యాలను చూశారు. గోశాలలోని కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించారు. డీవీఆర్‌ను స్వాధీనం చేసుకుని విశ్లేషణ కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. అప్పటికి మూడు నెలల నుంచి దృశ్యాలు నమోదు కాలేదని తేల్చారు. వాటి తీగలను కోతులు తెంచాయి.
* గోశాలలో దాదాపు 30 మంది ఒడిశా రాష్ట్రం కియోంజర్‌ జిల్లాకు చెందిన వారు పనిచేస్తున్నారు. వారి వ్యక్తిగత వివరాలు, ఆ రాష్ట్రంలోని వారి పూర్వ చరిత్ర గురించి కూడా ఆరా తీశారు. వారిని వ్యక్తిగతంగా విచారించారు. ఆవులకు గోధుమ పొట్టును కూడా దాణాగా పెడుతున్నట్లు తెలుసుకున్నారు. అది ముగ్గురు డీలర్ల నుంచి సరఫరా అవుతున్నట్లు తెలుసుకుని అక్కడకు వెళ్లి పరిశీలించినా ఏదీ బయట పడలేదు.

తేలింది ఇదీ..: వివిధ ప్రయోగశాలల్లో చేయించిన పరీక్షలలో విష ప్రయోగం జరిగినట్లు ఆనవాళ్లు లభించలేదు. గ్రాసం తీసుకోవడం ద్వారానే మరణాలు సంభవించాయని అన్ని నివేదికల్లో బయటపడింది. గడ్డికి తెగుళ్లు ఆశించవని, పురుగు మందులు పిచికారీ చేయరు. పెరుగుదలకు మాత్రం యూరియా వాడతారని తెలుసుకున్నారు. దీని పంట కాలం 45 రోజులు. ప్రతి 15 రోజులకోసారి చొప్పున మొత్తం మూడు సార్లు చల్లుతారు.

* మొక్కలకు వేసిన యూరియా ఎండా కాలంలో కరగడానికి వారం పడుతుంది. అదే వర్షాల సమయంలో అయితే ఒక్క రోజులో కరుగుతుంది. వర్షా కాలంలో ఎండ పెద్దగా ఉండదు. దీని వల్ల మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ జరగదు. ఇది జరగకపోతే మొక్కల్లోని కాండం, ఆకుల్లో నైట్రేట్ల రూపంలో పేరుకుపోతుంది. గోశాలకు వచ్చిన గడ్డి విషయంలో ఇదే జరిగింది.
* సాధారణంగా పచ్చి గడ్డిలో నైట్రేట్ల అవశేషాలు ఉంటాయి. ఇవి 1.6 శాతం లోపు ఉండాలి. పరిధి దాటితే విషపూరితం అవుతుంది. అన్ని నమూనాల్లోనూ ఇవి 2 నుంచి 3 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. 3.79 గ్రా. నుంచి గరిష్ఠంగా 4.47 గ్రాముల వరకు నైట్రేట్లు ఉన్నట్లు బయటపడింది. వర్షాలు పడడంతో గడ్డి పెరగడంతో, దాతలు భారీగా గోశాలకు ఇచ్చారు. గ్రాసం అందుబాటులోకి రావడంతో ఆవులకు ఎక్కువగా వేశారు. అధిక పరిమాణంలో తిన్నవే మరణించాయి.
* ఎక్కువ పరిమాణంలోని నైట్రేట్లు హిమోగ్లోబిన్‌లోకి వెళ్లిన తర్వాత చర్య జరిగి మెత్‌హిమోగ్లోబిన్‌గా మారింది. దీని వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌కు  ప్రాణవాయువును తీసుకెళ్లే సామర్థ్యం తగ్గడంతో శ్వాస ఆగిపోయి గోవులు మృతి చెందాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.