close

తాజా వార్తలు

పుట్టిన రోజు వేడుకల్లో విష సంస్కృతి

బర్త్‌డే బంప్స్‌ పేరిట చితక్కొట్టుడు
నడిరోడ్డుపై చిందులతో హంగామా

‘‘వినీత్‌ (పేరు మార్చాం) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. మరుసటి రోజు అతడి పుట్టినరోజు కావడంతో కొందరు స్నేహితులు ముందు రోజు రాత్రే బర్త్‌డే వేడుకలకు ప్రణాళిక వేశారు. ఓ ప్రముఖ హోటల్‌లో రూం బుక్‌ చేశారు. రాత్రి పది గంటల సమయంలో అంతా అక్కడికి చేరారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో కేక్‌ కట్‌ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అంతలో ప్రణీత్‌ ఈసారి వేడుకల్ని వెరైటీగా చేద్దామని మిగిలిన మిత్రులతో ప్రతిపాదించాడు. అక్కడున్న స్నేహితులంతా వినీత్‌ను సరదాగా కొట్టాలనేది ఆ ప్రతిపాదన. అందుకు అందరూ ఒప్పుకోవడంతో అంతా కలిసి వినీత్‌ను కొట్టడం ఆరంభించారు. చేతులతో కొట్టడం కాస్తా కింద పడేసి కాళ్లతో తన్నడం వరకు వెళ్లింది. అది శ్రుతి మించడంతో వినీత్‌ గట్టిగా అరిచి మరీ ఆ తన్నుడు కార్యక్రమాన్ని ఆపాల్సి వచ్చింది’’.

హైదరాబాద్‌: జన్మదిన వేడుకలు అంటే శుభాకాంక్షలు పొందడం.. గుడికెళ్లడం.. కేక్‌ కోయడం.. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా గడపడం.. ఆ రోజంతా తీపి జ్ఞాపకాలతో నింపేసుకోవడం.. ఇవీ పుట్టిన రోజు నాడు చోటు చేసుకునే మధుర స్మృతులు. కానీ కొత్తగా కొన్ని పెడధోరణులు ఆ వేడుకల్ని కబళించేస్తున్నాయి. ఒకప్పటిలా కేక్‌ కోసి నోరు తీపి చేసే సంస్కృతి శ్రుతి మించుతోంది. అదే కేక్‌ను మొహంపై పూయడం.. కోడిగుడ్లు నెత్తిపై పగులగొట్టడం.. డ్రింక్స్‌ గుమ్మరించుకోవడం.. లాంటి ధోరణులు బయలుదేరాయి. తాజాగా ఇవి పరాకాష్టకు చేరాయి. ‘బర్త్‌డే బంప్స్‌’ పేరిట సరికొత్త విష సంస్కృతి పెచ్చరిల్లిపోతోంది. ఐర్లాండ్‌, కెనడాల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యవహారం ఇటీవల భారత్‌కూ విస్తరించింది. బర్త్‌డే బాయ్‌ను విపరీతంగా కొట్టడమే దీని పరమార్థం. అతడిపై ఏవైనా దుష్టశక్తులు ఉంటే గనక అలా కొట్టడం వల్ల పారిపోతాయనే ఉద్దేశాన్ని దీనికి ఆపాదించారు. ఎంత ఎక్కువగా కొడితే అంత మంచిదనే ధోరణి కనిపిస్తోంది. చేతులతో కొట్టడం.. కాళ్లతో ఇష్టారీతిన తన్నడం.. చెప్పులతో చితకబాదడం.. కొనసాగుతోంది. శరీరంలోని సున్నిత ప్రాంతాల్నీ వదలకుండా కొడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొద్దిరోజుల క్రితం దిల్లీ ఐఐఎం విద్యార్థి ఒకరి ప్రాణం మీదకు తెచ్చిందనే ప్రచారం వైరల్‌గా మారింది. బర్త్‌డే బంప్స్‌ పేరిట తోటి విద్యార్థులు అతడిని ఎడాపెడా చితక బాదడంతోపాటు కింద పడేసి తన్నడంతో విపరీతంగా దెబ్బలు తగిలాయని.. ఈక్రమంలో పాంక్రియాస్‌ దెబ్బతినడంతో ఆ విద్యార్థి రెండు నెలలపాటు చికిత్స పొందుతూ మృతి చెందాడనేది  ఆ ప్రచారం సారాంశం. ఈ ఘటనపై మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్వీట్‌ చేసి అనంతరం తొలగించారు. ఈ ఘటన వాస్తవికతపై నిర్ధారణ లేకపోయినా బర్త్‌డే బంప్స్‌ విష సంస్కృతి మాత్రం మన మెట్రో నగరాల్లో పెరిగిందనేది నిర్వివాదాంశంగా మారింది.

రహదారులపై రచ్చ..
హైదరాబాద్‌లోనూ ఈ పెడధోరణి ఇంకా విజృంభించక పోయినా మరో తరహాలో జన్మదిన వేడుకలు దారి తప్పుతున్నాయి. నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఈ వేడుకలు రోడ్డున పడుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రహదారుల్ని ఆక్రమించి నిర్వహించడం ఫ్యాషన్‌గా మారింది. ఈ విషయంలో యువకుల వ్యవహారం మరీ శ్రుతి మించుతోంది. సరిగ్గా అర్ధరాత్రి సమయాల్లో ఈ మూకలు రహదారుల్ని ఆక్రమించేస్తున్నాయి. నడిరోడ్డు మధ్యనే బైక్‌లు, కార్లను ఆపేసి వాటిపైనే కేకులు కోయడం ఆనవాయితీగా మారుతోంది. కేసులను కోసి తినడమే కాకుండా అక్కడే మద్యం సేవిస్తూ హంగామా సృష్టించడం ఆందోళన కలిగిస్తోంది. ఈక్రమంలో తోటి వాహనదారులు గనక ఆ రహదారిపై ప్రయాణిస్తే ఇబ్బందులు తప్పడం లేదు. తప్పనిసరిగా ఆ మూకను తప్పుకొని పోవాల్సి వస్తోంది. ఎవరైనా వారిని వారిస్తే తాగిన మైకంలో వారంతా చేసే హంగామా అంతా ఇంతా కాదు. గల్లీ రహదారుల్లోనే కాకుండా జంటనగరాల్లో కీలకమైన ప్రధాన రహదారుల్నీ వదలడం లేదు. ఆ సమయంలో గస్తీ నిర్వహించే పోలీసులు కనిపిస్తే మాత్రం ఈ మూకలు తోక ముడుస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే పోలీసులకు కూడా ముడుపులిచ్చి తమ పని కానిచ్చేస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. ఇలాంటి ఘటనలు పెచ్చరిల్లుతున్నా కేసులు పెద్దగా నమోదు కాకపోవడం విమర్శలకు తావిచ్చే అంశంగా మారింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.