close

తాజా వార్తలు

మా దారి కొత్త దారి!

యువావిష్కరణలు

కళ్లు లేని వాళ్లకు దారి చూపే షూ చూశారా?
విద్యుదాఘాతానికి ఆస్కారం లేని స్టార్టర్‌ గురించి విన్నారా?
నీరు అవసరం లేని, దుర్గంధం రాని మరుగుదొడ్డి ఉందంటే నమ్ముతారా?
కొండపల్లి బొమ్మల నుంచి... పెంబర్తి కళ వరకూ... అన్నీ యువతను ఆకట్టుకునే ట్రెండ్‌ ఎలా అయ్యాయో తెలుసా?
యువత కృషి వల్ల.. యువత కొత్త ఆవిష్కరణల వల్ల.. యువత సృజనాత్మకత వల్ల.. వీరిలో స్నేహితుల కష్టాలు చూసి చలించిన వారు కొందరైతే... సాటి మనుషుల కన్నీళ్లు తుడవాలని నడుంబిగించిన వారు మరికొందరు. వీరెవరో? వీరు చేసిన ఆవిష్కరణలేంటో? వాటి ఉపయోగాలేంటో? చదవండి.

‘సత్య’ శోధన
రైతుల కోసం ప్రత్యేక స్టార్టర్‌

ప్పటి దాకా తనతో కలిసి ఆడుకున్న స్నేహితుడి గుండె ఆగిపోతే... ఎంత బాధ? ఎగిరేసిన గాలిపటం విద్యుత్తు తీగలకు తగిలి కళ్ల ముందే ఫ్రెండ్‌ ప్రాణాలు వదిలేస్తే... ఎంత కష్టం? ఆ బాధ, ఆ కన్నీళ్లు ఒక ఆవిష్కరణకు ప్రాణం పోశాయి. హైదరాబాద్‌కు చెందిన సత్యాను ప్రయోగాల వైపు మళ్లించాయి.

ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడు ఎలక్ట్రికల్‌ సేఫ్టీపై ప్రాజెక్టు చేయమన్నారు. పరిశోధనలో భాగంగా 30 మంది మిత్రులతో కలిసి వికారాబాద్‌ జిల్లా పరిగి వెళ్లాడు సత్యా. అప్పుడు తెలిసింది విద్యుదాఘాతంతో మన రాష్ట్రంలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని. తన స్నేహితుడి మరణం కళ్లలో కన్నీరైంది. అప్పుడే ఈ విద్యుదాఘాత మరణాలను ఆపేందుకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. గ్రామాల్లో మోటారు స్టార్టర్ల కారణంగానే 30శాతం మరణాలుంటున్నాయని గుర్తించిన ఆతను రైతుల కోసం ప్రత్యేక స్టార్టర్లను తయారు చేశాడు. స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి కర్షకులకు తాను రూపొందించిన స్టార్టర్లను విక్రయించడమే కాకుండా.. విద్యుత్తు ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇతని ప్రతిభను గుర్తించిన జర్మన్‌ ఎంబసీ ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు చేయడానికి గతేడాది 7000 డాలర్ల ఉపకారవేతనం ఇచ్చింది. ప్రస్తుతం కేరళలోని ‘‘కాంతారి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ విజనరి’’లో ఉంటున్న సత్యా విద్యుదాఘాతంతో చనిపోయిన వారి కుటుంబ స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నాడు.

‘భూ’పతి
నీరు అవసరం లేని మూత్రశాల

క్క టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి ఏటా 1,50,000 లీటర్ల నీరు అవసరమౌతుంది. అసలు నీరు అవసరం లేని టాయిలెట్‌ ఉంటే...! ఆ నీరంతా మిగులేకదా! ఈ ఆలోచనే హైదరాబాద్‌కు చెందిన పీఎల్‌ భూపతికి వచ్చింది. స్వతహాగా ప్లాస్టిక్‌ ఇండస్ట్రీలో నిపుణులైన ఆయన సుమారు నాలుగేళ్లు కష్టపడి దుర్గంధం రాని, నీటి అవసరం లేని, పర్యావరణ హితమైన మూత్రశాలని రూపొందించారు. ఇది ఆదా చేసే 1,50,000 లీటర్ల నీరు సంవత్సర కాలంలో 150 మంది తాగే నీటితో సమానం. టాయిలెట్‌ శుభ్రం చేయడానికి విరివిగా వాడేస్తున్న 150 లీటర్ల రసాయనాల వాడకాన్ని పూర్తిగా నియంత్రించవచ్చు. టాయిలెట్‌ సీట్‌ కింద నీరుపోయేలా అమర్చిన ప్రత్యేక పరికరమే దుర్గంధం వ్యాప్తి చెందకుండా చేస్తుంది. ప్రతి రోజు శుభ్రం చేయాల్సిన అవసరం కూడా లేదు. నెలరోజులకోసారి పర్యావరణహితమైన ద్రావణం పోసి స్పాంజ్‌తో శుభ్రం చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మియాపూర్‌ మెట్రో స్టేషన్‌లో దీని పనితీరును పరిశీలించారు. విజయవంతం కావడంతో త్వరలోనే 30 మెట్రో స్టేషన్లలో ఈ తరహా మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ (హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌) సన్నాహాలు చేస్తోంది. భారతీయ రైల్వేలోనూ వీటిని అమర్చే అంశం పరిశీలనలో ఉంది. 

స్నేహితుడికి చూపై..
అంధుల కోసం సెన్సార్‌ షూ

క్కన మనిషి సాయం లేనిదే బయటకు రాలేని స్నేహితుడి నరకయాతన కళ్లారా చూశాడో యువకుడు. కళ్లు లేని మిత్రుడికి కళ్లుగా మారదామనుకున్నాడు విశాఖపట్నంకు చెందిన కృష్ణసాయి. ఫ్రెండ్‌ చేతికర్రతో పడుతున్న ఇబ్బందులను గమనించాడు. కొత్తగా దీనికి పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితుడి(ప్రీతం) కోసం ప్రత్యేక పాదరక్షలు (బూట్లు) తయారు చేయాలని అనుకున్నాడు. దాదాపు రెండేళ్లు కష్టపడి 2015లో సెన్సార్‌ బూట్లను రూపొందించాడు. అవి ప్రీతంకు ఇచ్చి నడవమన్నాడు. చాలా సౌకర్యంగా ఉన్నాయని స్నేహితుడు చెప్పినప్పుడు సంతోషంతో పొంగిపోయాడు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో బోధకుడిగా ఉన్న కృష్ణసాయి.. బ్లైండ్‌ పీపుల్‌ ఆసోసియేషన్‌తో కలిసి తన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. నడుస్తున్నప్పుడు రెండు మీటర్ల దూరంలో ఉన్న గుంతలు, అడ్డంకులను సెన్సార్స్‌ ద్వారా ఈ పాదరక్షలు పసిగడతాయి. గుంతలను గుర్తించగానే బూటులో ఉండే సెన్సార్‌ పాదాలను ట్యాప్‌(తట్టడం) చేస్తుంది. మరీ దగ్గరగా ఉంటే తట్టే వేగం పెరుగుతుంది. దీంతో నడుస్తున్న వ్యక్తి వెంటనే దిశను మార్చుకునే వీలుంటుంది. రూ.3500లతో ఈ బూట్లను తయారు చేయొచ్చని కృష్ణసాయి చెబుతున్నాడు. వీటి ప్రత్యేకతను గుర్తించిన బాటా కంపెనీ ప్రస్తుతం అతనితో చర్చలు జరుపుతోంది. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద, బ్లైండ్‌ పీపుల్‌ అసోషియేషన్‌తో కలిసి వినియోగంలోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నాడీ యువ తరంగం.

కళాభివందన
స్నేహితుల ఫ్యాషన్‌ డిజైనింగ్‌

రేఖ, వంద్య చదివింది ఫ్యాషన్‌ డిజైనింగ్‌. చేసేది హస్త కళలను ప్రోత్సహించడం. హైదరాబాద్‌లోని నిఫ్ట్‌ కళాశాలలో చదువుతున్న రోజుల్లో కొండపల్లి వెళ్లిన వీళ్లు, అక్కడ చెక్కతో బొమ్మ చేసిన దశావతారాలను చూశారు. ఎప్పటినుంచో ఒకే రకమైన బొమ్మలు చేస్తుండటంతో కొండపల్లి బొమ్మలకు డిమాండ్‌ తగ్గిపోతుందని గుర్తించి, కొత్తరూపం ఇవ్వాలనుకున్నారు. 2014లో చదువు పూర్తవగానే రెండేళ్లు పరిశోధన చేసి కొండపల్లి మొదలు, అనంతపురం తోలుబొమ్మలు, ఏటికొప్పాక లక్కపిడతలు, పెంబర్తి బ్రాస్‌వర్క్‌(ఇత్తడి పని) చేసే కళాకారులు, రంగారెడ్డి జిల్లా లంబాడీ మహిళలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. నేటి తరాన్ని ఆకర్షించేలా డిజైన్లు రూపొందించి చెక్కబొమ్మలు, లోహపు వస్తువులు, ప్రతిమలు, అభరణాలు, నగలు తయారు చేస్తున్నారు. మొదట ఇద్దరూ కలిసి రూపొందించిన డిజైన్లను కళాకారులకు పంపిస్తారు. వాటిని అనుసరించి అక్కడి వారు తయారు చేసిన వస్తువులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి, తుది మెరుగులు దిద్దాక ఇస్మా.ఇన్‌లో, హైదరాబాద్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో విక్రయిస్తుంటారు. ఈ పనితో తమకు ఆదాయంతో పాటు కళాకారులకు ఉపాధీÅ దొరుకుతుందని, ముఖ్యంగా పురాతన కళలను బతికిస్తున్నామనే సంతృప్తి మిగులుతుందని చెబుతున్నారు స్నేహితురాళ్లు.

- గుళ్లపెల్లి సిద్ధార్థ, హైదరాబాద్‌

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.