close

తాజా వార్తలు

కార్యాలయ నిర్మాణాల్లో దూకుడు 

దేశంలో అత్యధికంగా హైదరాబాద్‌లో లీజింగ్‌ 
ఈనాడు, హైదరాబాద్‌

నగరవాసులు ఇళ్లు కొనడమే కాదు.. ఇటీవల వాణిజ్య, కార్యాలయ నిర్మాణాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. గృహ అద్దెలతో పోలిస్తే వీటిలో అద్దెల రాబడి ఎక్కువగా ఉంటుందని మొగ్గు చూపుతున్నారు. వీరి అంచనాలకు తగ్గట్టుగానే ఆఫీసు మార్కెట్‌ దూసుకెళుతోంది. కార్యాలయాల లీజింగ్‌లో హైదరాబాద్‌ తొలిసారి బెంగళూరు నగరాన్ని అధిగమించింది. ముంబయి, దిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2019 తొలి త్రైమాసికం నివేదికను సీబీఆర్‌ఈ తాజాగా వెల్లడించింది. ఈ సానుకూల ప్రభావం గృహ నిర్మాణ రంగంపై రెండు మూడేళ్ల వరకు ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇళ్లకు మరింత గిరాకీ పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి. 

హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగం ఇతర నగరాలతో పోల్చినప్పుడు మూడు నాలుగేళ్లుగా వృద్ధి బాటలో కొనసాగుతోంది. డిమాండ్‌తో పాటు గృహ, కార్యాలయ స్థలాల సరఫరా అధికంగానే ఉంది. రాజకీయ స్థిరత్వంతో పాటు నివాస యోగ్యమైన నగరంగా గుర్తింపు, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల లభ్యతతో ఇక్కడ కొత్త కంపెనీలు ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. దీంతో ఏటా కార్యాలయ లీజింగ్‌ పెరుగుతోంది. 
2018 తొలి త్రైమాసికంలో 11లక్షల చ.అ.ఉన్న లీజింగ్‌ ఏడాది తిరిగేసరికి 35 లక్షల చ.అడుగులకు పెరిగింది. 
దేశవ్యాప్తంగా 9 నగరాల్లో 1.28 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలాలను లీజుకు తీసుకుంటే అందులో పావు వంతు హైదరాబాద్‌లో నమోదవడం విశేషం. 
ఐటీ కారిడార్‌-2లో.. గచ్చిబౌలి, కొండాపూర్‌ ప్రాంతాలు ఐటీ కారిడార్‌-2 కిందకు వస్తాయి. ఇక్కడ ఒక భారీ సెజ్‌, రెండు ఐటీ సంస్థలు లీజుకు తీసుకోవడంతో 2019 తొలి త్రైమాసికంలో మిగతా నగరాలను వెనక్కి నెట్టింది. 
రాయదుర్గం, నానక్‌రాంగూడ, మణికొండ, కోకాపేట ప్రాంతాలు పొడిగించిన ఐటీ కారిడార్‌-2గా స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థలు పరిగణిస్తున్నాయి. కోకాపేటలో మధ్యస్థాయి సెజ్‌తో చుట్టుపక్కల స్థిరాస్తి కార్యకలాపాలు పెరిగాయి. 
మిగతా నగరాల్లో.. 
పలు నగరాల్లో వృద్ధి తగ్గుముఖం పట్టింది. బెంగళూరులో క్రితం ఏడాది 55 లక్షల చదరపు అడుగుల నుంచి ఈ ఏడాది 25 లక్షలకు చ.అడుగులకు లీజింగ్‌ పడిపోయింది. దిల్లీ రాజధాని ప్రాంతం 21 లక్షల చ.అడుగుల నుంచి 16 లక్షల చ.అ.విస్తీర్ణానికి తగ్గింది. ఫుణెలో 10 లక్షల నుంచి 9 లక్షల చ.అడుగులకు లీజింగ్‌ పడిపోయింది. 
ముంబయిలో 15 లక్షల చ.అ. నుంచి 21 లక్షలకు పెరిగింది. చెన్నైలో 11 లక్షల నుంచి 15 లక్షల చ.అడుగులకు పెరిగింది. 
కార్యాలయ స్థలాల లీజింగ్‌ 
(2019 తొలి త్రైమాసికంలో) 
నగరం       చ.అడుగులు 
హైదరాబాద్‌    35 లక్షలు 
బెంగళూరు     25 లక్షలు 
ముంబయి      21 లక్షలు 
దిల్లీ         16 లక్షలు 
చెన్నై         15 లక్షలు 
అద్దెల్లోనూ వృద్ధి.. 
ఐటీ కారిడార్‌-1లోని మాదాపూర్‌, హైటెక్‌సిటీతో పాటు ఐటీకారిడార్‌-2లోనూ కార్యాలయాల అద్దెలు పెరిగాయి. ఇక్కడ అద్దెలు చ.అ.నెలకు రూ.65 నుంచి రూ.70 వరకు ఉంది. గత ఏడాదితో పోలిస్తే అద్దెలు కొంత పెరిగాయి. 2నుంచి 5 శాతం వరకు పెరుగుదల నమోదైంది. 
సోమాజిగూడ, బేగంపేట, పంజాగుట్ట వంటి సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్‌ ప్రాంతాల్లో ‘గ్రేడ్‌ ఏ’ రకం కార్యాలయ స్థలాల అద్దె చ.అ.నెలకు రూ.50 వరకు ఉంది. 
బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్‌, హిమాయత్‌నగర్‌లో ‘ఐటీయేతర గ్రేడ్‌ ఏ’ రకం కార్యాలయాల అద్దె చ.అ.కు రూ.46 వరకు ఉంది. 
ఉప్పల్‌, పోచారం, శంషాబాద్‌లో గ్రేడ్‌ ఏ ఐటీ కార్యాలయం అద్దెలు చదరపు అడుగు నెలకు రూ.32 వరకు ఉంది. ఐటీ కారిడార్‌లో సగం అద్దెకు ఇక్కడ దొరుకుతున్నాయి. కొత్త సంస్థలు ఇక్కడ ఏర్పాటుచేయాలని.. ఖర్చు కలిసి వస్తుందని ప్రభుత్వం ఐటీ సంస్థలను కోరుతోంది. వీటి రాకతో ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. 
అమెరికన్‌ కంపెనీలతో.. 
ఐటీ సంస్థలే ఎక్కువగా లీజుకు తీసుకున్నాయి. తర్వాత ఇంజినీరింగ్‌, ఉత్పత్తి రంగాల సంస్థలు ఉన్నాయి. లక్ష చదరపు అడుగుల పైనే ఈ సంస్థలు లీజుకు తీసుకున్నాయి. ఐటీలో ఎక్కువగా అమెరికన్‌ కార్పొరేట్‌ కంపెనీలు వచ్చాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.