close

తాజా వార్తలు

బుమ్రా వెస్టిండీస్‌లోపుట్టుంటే...!

అరివీర భయంకరులు ఐదుగురు అయ్యేవారు

ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌

రెండేళ్ల వయసు బుజ్జాయిలు స్మార్ట్‌ ఫోన్‌ ఆపరేట్‌ చేస్తుంటే అబ్బో..! ఇంత చిన్ని బుర్రలో ఎన్ని తెలివితేటలో అని మురిసిపోతుంటారు బామ్మలు, తాతయ్యలు. వెంటనే వారిని ఎత్తుకొని ఓ ముద్దు పెట్టేస్తారు. టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రాకూ ఇదే వర్తిస్తుంది. ఆడింది 11 మ్యాచులే కానీ 100 టెస్టుల అనుభవం ప్రదర్శిస్తున్నాడని అలనాటి కరీబియన్‌ పేసర్లు  ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అతడి ఆలోచనల్లో స్పష్టత, మ్యాచ్‌పై పట్టు, బంతితో దాడి చేసే శైలికి ఫిదా అంటున్నారు. తమ దేశంలో పుట్టుంటే వెస్టిండీస్‌ పేస్‌బౌలింగ్‌ చతుష్టయంలో ఒకడయ్యేవాడని పేర్కొంటున్నారు.  

అత్యుత్తమ బౌలర్‌

వెస్టిండీస్‌తో తొలి టెస్టు. మొదటి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ మాత్రమే తీశాడు బుమ్రా. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం రెచ్చిపోయాడు. 7 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. 318 పరుగుల విజయంలో కీలక భూమిక పోషించాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన ఏకైక ఆసియా బౌలర్‌గా ఘనత అందుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌కు చూసి ముచ్చట పడుతున్నాడు ఆండీ రాబర్ట్స్‌. తాను చూసిన అత్యుత్తమ భారత బౌలర్‌ అతడేనంటూ ఆకాశానికెత్తేశారు.

అంతు చిక్కడు

‘మా కాలంలో భారత్‌ దాడిలో అంతా స్పిన్నే. మంచి బౌలర్లే కానీ విదేశాల్లో మ్యాచ్‌లు గెలిపించేవారు కాదు. కపిల్‌దేవ్‌ సహా మరికొందరు పేసర్లను చూసినప్పటికీ వారు బుమ్రా అంత ప్రమాదకారులు కాదు. నేను చూసిన భారత అత్యుత్తమ బౌలర్‌ అతడే. బౌలర్‌ రన్నప్‌ చేస్తుంటే ఓసారి బ్యాట్స్‌మెన్‌ను చూడండి. అప్పటికే అతడిపై ఓ అవగాహన ఉంటుంది. అతడి శైలి, పరుగు, బంతి విడిచే కోణం ఇలా అన్నీ వారి స్మృతిపథంలో దర్శనమిస్తాయి. బుమ్రా శైలి, లయ మాత్రం వారికి అంతుచిక్కడం లేదు’ అని రాబర్ట్స్‌ అన్నారు.

గేమ్‌ సెన్స్‌ అద్భుతం

‘బుమ్రా వేసిన ఏ రెండు బంతులూ ఒకేలా రావు. ఒకటి పక్కకు వెళ్తే మరోటి దేహం మీదికి వస్తుంది. ఒకటి వికెట్లపైకి వస్తే మరోటి ఔట్‌స్వింగ్‌ అవుతుంది. మా కాలంలో ఇలా వేసేవాళ్లం. ఇదంతా ఏళ్ల తరబడి ఆడిన అనుభవంతో వస్తుంది. బుమ్రా మాత్రం అతితక్కువ సమయంలో ఎదిగాడు. అతడి వయసెంత? ఎన్ని టెస్టులు ఆడాడు? ఎంత త్వరగా అర్థం నేర్చుకుంటున్నాడో చూడండి. అదే అతడిలో ప్రత్యేకత. కొందరు దీన్ని పరిణతి అంటారు. నేను ఆటపై అవగాహన (గేమ్‌ సెన్స్‌) అంటాను. అతడి ఆలోచనల్లో స్పష్టత ఉంది. అదే అతడి బంతుల్లో కనిపిస్తోంది. కొంతమందికి ఎంత నైపుణ్యం ఉన్నా 10 ఏళ్లైనా అది అబ్బదు’ అని రాబర్ట్స్‌ ప్రశంసించారు.



వైవిధ్యంలో అదుర్స్‌

బుమ్రా తెలివితేటలకు కోర్ట్లీ ఆంబ్రోస్‌ సైతం ముచ్చటపడ్డారు. అతడు అవసరానికి తగినట్టు లెంగ్త్‌లు మారుస్తూ తన కొత్త బంతి భాగస్వామి కోర్ట్నీ వాల్ష్‌ను గుర్తుకు తెస్తున్నాడని పేర్కొన్నారు. ‘పిచ్‌లు, బ్యాట్స్‌మెన్‌ను బట్టి అతడు ప్రపంచకప్‌లో లెంగ్త్‌ల్లో వైవిధ్యం ప్రదర్శించడం నేను చూశా. అది బ్యాట్స్‌మెన్‌కు చాలా కష్టం. అతడు నాకు వాల్ష్‌ను గుర్తుకు తెస్తున్నాడు. పరిస్థితులను అనుసరించి బంతులు వేయడంలో అతడు అద్భుతం’ అని బుమ్రాను కోర్ట్లీ ఆంబ్రోస్‌ ప్రశంసించారు.

కనిపించని దూకుడు

‘నేనిక్కడ దేహభాష గురించి మాట్లాడ్డం లేదు. ప్రత్యర్థితో కవ్వింపుల గురించి మాట్లాడ్డం లేదు. ప్రతిఒక్కరు దూకుడును బయటకు ప్రదర్శించరు. అది వ్యక్తిగత స్వభావాన్ని బట్టి ఉంటుంది. నా వరకైతే అది బంతి ఎలా వేస్తున్నాం? ఆ డెలివరీలో దూకుడు ఎంత? అన్నదాంట్లో కనిపిస్తుంది. బుమ్రా దాన్ని చాలా చూపిస్తున్నాడు. అతడి విభిన్నమైన రన్నప్‌, బంతి విడుదల చేసే విధానం అతడి దాడిలో ప్రత్యేకం. క్రికెట్‌ మైదానంలో నేను చూసిన అత్యంత విచిత్ర శైలి అతడిదే. అతడి శైలిలోని ప్రత్యేకతలు, కోణాల్ని అర్థం చేసుకోవడానికి నాకు కాస్త సమయం పడుతుంది’ అని ఆంబ్రోస్‌ అన్నారు.

మాలో ఒకడు

‘బుమ్రా మా కాలంలో వెస్టిండీస్‌లో పుట్టుంటే అతడు కచ్చితంగా మాలో ఒకడయ్యేవాడు. మా బౌలింగ్‌ లైనప్‌లో లేనిది అతడు చూపించే భయమే! మా గడ్డ నుంచి రాని ప్రత్యేకమైన బౌలర్‌ బుమ్రా ఒక్కడే. భారత్‌ సైతం అతడిలాంటి వేరే బౌలర్‌ను చూస్తుందని అనుకోను. కొన్ని సార్లు అతడు మా పాత రోజుల్ని గుర్తు తెస్తాడు. ఆ వేగం, ఆ దూకుడు, ఆ కవ్వింపులు, ఆ కళ, బ్యాట్స్‌మెన్‌ను తుత్తునియలు చేసిన విధానం, తన తెలివితో అతడు బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించే పద్ధతి చూస్తుంటే అతడు కచ్చితంగా మాలో ఒకడయ్యేవాడు. బుమ్రా మా తరంలో ఆడుంటే ఒక పరిపూర్ణ బౌలర్‌ అయ్యేవాడు’ అని ఆంబ్రోస్‌ ప్రశంసించారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.