
తాజా వార్తలు
ముంబయి: క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై అప్పుడే ఆరేళ్లు గడిచాయి. 2013లో విండీస్.. భారత పర్యటన సందర్భంగా రెండు టెస్టుల సిరీస్ ఆడింది. ఆ సిరీస్‌లో రెండో టెస్టు ముంబయి వేదికగా వాంఖడేలో జరిగింది. అది మాస్టర్ బ్లాస్టర్‌కు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అవడంతో పాటు 200వ టెస్టు కూడా. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు 182 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా 495 పరుగులు చేసింది. పుజారా(133), సచిన్(74), రోహిత్‌శర్మ(111) రాణించడంతో 313 పరుగుల ఆధిక్యం లభించింది. ఫాలోఆన్ ఆడిన వెస్టిండీస్ 187 పరుగులకే మరోసారి కుప్పకూలడంతో టీమిండియా ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో విజయం సాధించింది.
కాగా, ఆ మ్యాచ్‌లో సచిన్ ఔటవగానే స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశబ్ధం ఆవహించింది. తమ అభిమాన క్రికెట్ దేవుడు మరోసారి బ్యాట్ పట్టడని తెలిసి అభిమానులంతా దుఖఃసాగరంలో మునిగిపోయారు. టీమిండియా విజయం సాధించాక కరతాళ ధ్వనులతో సచిన్‌కు వీడ్కోలు పలికారు. భారత ఆటగాళ్లు లిటిల్ మాస్టర్‌ను భుజాలపై ఎత్తుకొని స్టేడియం చుట్టూ తిరిగారు. 1989 నవంబర్ 15న పాకిస్థాన్‌పై అరంగేట్రం చేసిన క్రికెట్ లెజెండ్ మొత్తం 200 టెస్టులతో పాటు 463 వన్డేలు ఆడాడు. టెస్టు కెరీర్లో 15,291 పరుగులు చేయగా అందులో 51 శతకాలు, 68 అర్ధశతకాలు సాధించాడు. ఇక వన్డేల్లో 18,426 పరుగులు చేయగా అందులో 49 శతకాలు, 96 అర్ధశతకాలు సాధించాడు.