close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జేపీ నడ్డా

భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జేపీ నడ్డా నియమితులయ్యారు. ఈ మేరకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి నడ్డా పేరును ఖరారు చేస్తూ భాజపా పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నడ్డా.. గత ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా, భాజపా పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. స్వాత్మానందేంద్రగా కిరణ్‌కుమార్‌ శర్మ

విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా సన్యాస స్వీకరణ మహోత్సవం విజయవాడలోని కృష్ణానదీ తీరాన గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో వైభవంగా జరుగుతోంది. శారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌ శర్మ దీక్షను స్వీకరించారు. సన్యాస దీక్ష అనంతరం ఆయనకు స్వాత్మానందేంద్ర సరస్వతిగా స్వరూపానందస్వామి నామకరణం చేశారు. రుద్రాక్ష మాల వేసి, హారతి ఇచ్చి పట్టాభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్వరూపానందస్వామి పాదాలకు స్వాత్మానందేంద్ర సరస్వతి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ హాజరై పుష్పాలు, ఫలాలు, వస్త్రాలు సమర్పించారు. స్వాత్మానందేంద్ర సరస్వతికి కిరీట ధారణ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వైద్యుల భద్రత కోసం నోడల్‌ అధికారులు

పశ్చిమబెంగాల్‌లో జూనియర్‌ వైద్యుల సమ్మె తీవ్రరూపం దాల్చడంతో ఎట్టకేలకు రాష్ట్రప్రభుత్వం దిగొచ్చి వారితో చర్చలు జరిపింది. వైద్యుల డిమాండ్‌ మేరకు మీడియా సమక్షంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల నుంచి వచ్చిన 31 మంది డాక్టర్లతో కూడిన ప్రతినిధి బృందంతో సీఎం మమతాబెనర్జీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వైద్యులు ముఖ్యమంత్రికి వివరించారు.  వైద్యులపై దాడులు జరగకుండా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నోడల్‌ అధికారిని నియమించాలని ఈ సందర్భంగా కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ అంజు శర్మను మమత ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 20న పోలవరానికి సీఎం జగన్‌

నవ్యాంధ్ర ప్రజల జీవనాడి ప్రాజెక్టు పోలవరాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈ నెల 20న సందర్శించనున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా వెళ్లి ఈ  ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆయన పరిశీలించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన తొలి సమీక్షలో పోలవరాన్ని అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని, నిర్మాణం వేగవంతం చేయాలని జగన్‌ అధికారుల్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన పోలవరాన్ని సందర్శించి ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఉద్యోగ నియామకాల్లో 11%వృద్ధి నమోదు

దేశవ్యాప్తంగా ఐటీ - సాఫ్ట్‌వేర్‌ రంగంలో నియామకాలు పెరగడంతో ఈ ఏడాది మే నెలలో మొత్తంగా 11 శాతం మేర ఉద్యోగ నియామకాల్లో వృద్ధి నమోదైందని తాజా నివేదికలో వెల్లడైంది. జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ పేరుతో ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ నౌకరీ డాట్‌కామ్‌ తాజా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. గత ఏడాది మే నెలతో పోల్చితే 2019 మే నెలలో 11 శాతం వృద్ధి నమోదు చేసినట్లు నివేదికలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘జగన్‌ మాటిస్తే జీవోలు, చట్టాలు అవసరం లేదు’

మహిళల కోసం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టిందని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ‘అమ్మ ఒడి’ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని ఆమె చెప్పారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రోజా మాట్లాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల్లాగే అమ్మ ఒడి కూడా అత్యంత ఆదర్శవంతంగా నిలుస్తుందన్నారు. సీఎం జగన్‌ మాటిస్తే జీవోలు, చట్టాలు అవసరం లేదన్న నమ్మకం ప్రతి మహిళకు కలుగుతుందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ముగిసిన సీఎంల భేటీ.. ఏం చర్చించారంటే?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. సుమారు గంటన్నరకు పైగా కొనసాగిన ఈ భేటీలో అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై ఇద్దరు సీఎంలూ చర్చించారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ప్రభుత్వరంగ సంస్థల విభజనపై దృష్టి పెట్టారు. అలాగే, విద్యుత్‌ ఉద్యోగుల విభజన, విద్యుత్‌ బకాయిల పరిష్కారంపైనా చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపైనా సమాలోచనలు జరిపారు. విభజన చట్టంలోని పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపైనా సానుకూల వాతావరణంలో ఇద్దరు సీఎంలు చర్చించినట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాపై జరిమానా

 ప్రముఖ టెలికాం నెట్‌వర్క్‌ రిలయన్స్‌ జియోకు ఇంటర్‌ కనెక్షన్‌ పాయింట్లను కేటాయించేందుకు నిరాకరించిన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలపై భారీ జరిమానా విధించేందుకు డిజిటల్‌ కమ్యునికేషన్స్‌ కమిషన్‌ (డీసీసీ) ఆమోదం తెలిపింది. రిలయన్స్‌ జియోకి ఇంటర్‌ కనెక్టివిటీ పాయింట్లను కేటాయించేందుకు నిరాకరించాయనే కారణాలతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలపై రూ. 3,050 కోట్ల జరిమానా విధించాల్సిందిగా భారతీయ టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) డీసీసీకి 2016 అక్టోబరులో ప్రతిపాదించింది. ఈ మేరకు ట్రాయ్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ వాటిపై భారీ జరిమానా విధించేందుకు అంగీకరిస్తూ డీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాల విక్రయం..?

బలహీనంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రభుత్వానికి ఉన్న వాటాలను విక్రయించాలని భావిస్తోంది. ఈ విక్రయం ద్వారా వచ్చిన నిధులను గ్రామీణ ప్రాంతాల్లో గృహనిర్మాణాలకు వినియోగించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు వచ్చాయి. ప్రస్తుతానికి ఇది తొలిదశలోనే ఉంది. దీనిపై మరింత కసరత్తు చేయాల్సి ఉంది. ఒక వేళ దీనికి ఆమోదం పొందితే జులై 5న బడ్జెట్‌ ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భాజపా నేతలెవరూ నన్ను సంప్రదించలేదు:జేసీ

భాజపా నేతలెవరూ తనను సంప్రదించలేదని తెదేపా నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టంచేశారు. తాను రాజకీయాలు నుంచి విరమించుకున్నానన్న ఆయన.. కొంత మంది భాజపాతో టచ్‌లో ఉన్నారనేది మాత్రం వాస్తవమని వ్యాఖ్యానించారు. సోమవారం అమరావతిలోని అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ..  తాను పార్టీ మారడం లేదని జేసీ స్పష్టంచేశారు. భాజపా బలోపేతానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేసుకోవడం తప్పుకాదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.