close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. పట్టణ ఇళ్లకు రివర్స్‌ టెండరింగ్‌

పట్టణాల్లో పేదలకు నిర్మిస్తున్న గృహాల నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని,  ఈ వ్యవహారంలో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. చదరపు అడుగుకు రూ.1,100 అయ్యే ఖర్చుని ‘షేర్‌వాల్‌ టెక్నాలజీ’ పేరుతో రూ.2,200-2,300కి పెంచి దోచేశారని, ఉచితంగా ఇళ్లు ఇవ్వాల్సింది పోయి రూ.3 లక్షల భారం వేశారని పేర్కొన్నారు. ‘‘రివర్స్‌ టెండరింగ్‌లో ఎక్కువ మంది పాల్గొనేలా అర్హతలను తగ్గిద్దాం. పునాది స్థాయి దాటని, మంజూరైనా పనులు ప్రారంభంకాని ఫ్లాట్లపై ఎలాంటి టెక్నాలజీనైనా అనుమతించండి. ఎంత ఆదా చేయగలమో అనేది ఆలోచించాలి. నిర్మాణాల నాణ్యతలో, సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దు. ప్రస్తుతం నిర్మాణంలోని ఇళ్లు అత్యవసరంగా పూర్తి చేయాలి’’ అని ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. 9, 10 షెడ్యూలు సంస్థలపై నేడు సీఎంకు తుదినివేదిక

తెలంగాణలోని తొమ్మిది, పది షెడ్యూలు సంస్థల స్థితిగతులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుధవారం నివేదిక ఇవ్వాలని ఉన్నతస్థాయి అధికారుల కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలో మొదలైన కసరత్తు బుధవారంతో ముగియనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య కుదిరిన అవగాహనకు అనుగుణంగా 9, 10 షెడ్యూలు సంస్థల విభజన విషయమై నివేదిక ఇవ్వడానికి కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. 35 సంస్థల స్థితిగతులపై వాటి మాతృశాఖల కార్యదర్శులు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీకి సోమవారం నివేదిక ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. కొలిక్కివస్తున్న బడ్జెట్‌ కసరత్తు

రాష్ట్ర శాసనసభకు ఈ నెల 12న సమర్పించబోయే బడ్జెట్‌కు సంబంధించి ఆర్థికశాఖ అధికారుల కసరత్తు  కొలిక్కి వస్తోంది. అన్ని ప్రభుత్వశాఖలకు సంబంధించిన ప్రాధాన్యాలు, వారి డిమాండ్లపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆయా శాఖల మంత్రులు, అధికారులతో రెండు రోజుల పాటు నిర్వహించిన సమీక్షలు మంగళవారం ముగిశాయి. ఎన్నికలకు ముందు ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో దాదాపు రూ.2.26 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ సమర్పించారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కొత్త ప్రభుత్వం సమర్పించనున్న బడ్జెట్‌ స్వరూపం కొంత మేర తగ్గే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత సమాచారం ప్రకారం రూ.2.10లక్షల కోట్లను దాట వచ్చని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ముంబయిని ముంచెత్తిన వర్షాలు

దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా నాలుగో రోజైన మంగళవారం కూడా ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో మహానగరంలో జనజీవనం స్తంభించింది. వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న దుర్ఘటనల్లో సుమారు 37 మంది మృత్యువాత పడ్డారు. మరో 80 మంది క్షతగాత్రులయ్యారు! చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఎక్కడికక్కడ భారీగా నీరు చేరడంతో రవాణా సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు రైళ్లు నిలిచిపోయాయి. ముంబయి నుంచి హైదరాబాద్‌ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 203 విమానాల సేవలు రద్దయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. స్థానిక సంస్థల్లో సత్తా చాటుదాం

‘రాజకీయాల్లో గెలుపోటములు సహజం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీలు ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాయి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయి. అప్పుడు మన సత్తా చాటుదాం’ అని కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. గతంలోనూ పార్టీ అనేక అపజయాలు చూసిందని, ఆ తర్వాత మళ్లీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాట తప్పకుండా ప్రజా సంక్షేమానికి పని చేసే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది తెదేపాయేనని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత తొలిసారిగా మంగళవారం చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నేటి నుంచి అవగాహన సదస్సు

శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు అసెంబ్లీ వ్యవహారాలు, బడ్జెట్‌ పరిశీలన, వాటిని అర్థం చేసుకోవడంపై రెండ్రోజులపాటు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమం బుధవారం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు వెలగపూడిలోని అసెంబ్లీలో కమిటీ హాలు-1లో ఈ సదస్సు మొదలుకానుంది. శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌, పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ హెడ్‌ చక్షూ రాయ్‌, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఐవైఆర్‌ కృష్ణారావు తదితరులు మాట్లాడతారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఆనకట్టకు గండి..23 మంది గల్లంతు

ఆర్థిక రాజధాని ముంబయిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మందికిపైగా గాయాలపాలయ్యారు. తాజాగా రత్నగిరిలోని తివారి ఆనకట్టకు గండి పడింది. ఆనకట్ట దిగువన ఉన్న 7 గ్రామాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఇద్దరు మృతి చెందారు. మరో 23 మందికి గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహయ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. వరద ఉద్ధృతికి 12 ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. 

8. సాధ్యమైనంత త్వరగా పుర ఎన్నికలు

‘ప్రస్తుతం ఉన్న అవరోధాలన్నీ అధిగమించి సాధ్యమైనంత వేగంగా పుర, నగరపాలక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదే విషయమై ముఖ్యమంత్రితోనూ చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం’ అని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురపాలక, నగరపాలక సంస్థల కమిషనర్‌ల సమావేశంలో..అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీల గుర్తింపు ప్రక్రియ పూర్తయినందున రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. పురపాలక, నగరపాలక సంస్థల్లో ఇదివరకే కలిపిన ప్రాంతాలకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి ఎన్నికలు నిర్వహిస్తాం.’ అని మంత్రి వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. భారత్‌కు ‘నాటో భాగస్వామి’ హోదా

అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి సభ్య దేశాలతో సమాన హోదాను భారతదేశానికి కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును సెనేట్‌ ఆమోదించింది. ఈ బిల్లును ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌)లో నెలాఖరులోగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రతినిధుల సభలోనూ బిల్లు ఆమోదం పొందితే ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా వంటి దేశాల మాదిరిగా అమెరికాతో రక్షణ సహకారాన్ని మరింతగా పెంపొందించుకొనేందుకు వీలుకలుగుతుంది. హిందూమహాసముద్రం ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సముద్రపు దొంగతనాలను అడ్డుకోవటానికి, సముద్రంలో భద్రత విషయంలో అమెరికా తోడ్పాటునందిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఇదిగో వచ్చేశాం

ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మళ్లీ గెలుపు బాట పట్టింది. ఎడ్జ్‌బాస్టన్‌లో రెండు రోజుల కిందట ఇంగ్లాండ్‌ చేతిలో కంగుతిన్న కోహ్లీసేన.. అదే మైదానంలో మంగళవారం బంగ్లాదేశ్‌ను 28 పరుగుల తేడాతో ఓడించింది. పాయింట్లను 13కు పెంచుకుని పట్టికలో రెండో స్థానానికి చేరిన భారత్‌.. సెమీస్‌ బెర్తును కూడా ఖరారు చేసుకుంది. మొదట భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (104; 92 బంతుల్లో 7×4, 5×6), కేఎల్‌ రాహుల్‌ (77; 92 బంతుల్లో 6×4, 1×6) జట్టుకు అద్భుత ఆరంభాన్నివ్వగా.. చివర్లో రిషబ్‌ పంత్‌ (48; 41 బంతుల్లో 6×4, 1×6) రాణించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.