close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్ @ 9 AM

1. వద్దే వద్దు

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాహుల్‌ గాంధీ బుధవారం బహిరంగంగా ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నట్లు తెలిపిన ఆయన... పార్టీ పునఃనిర్మాణానికి కఠిన నిర్ణయాలు అవసరమని అభిప్రాయపడ్డారు. పార్టీని పూర్తిగా సంస్కరించాల్సి ఉందని చెప్పారు. ఈ మేరకు సీడబ్ల్యూసీకి రాసిన నాలుగు పేజీల లేఖను బుధవారం ఆయన ట్విటర్‌ ద్వారా బహిర్గతం చేశారు. తన స్థానంలో నూతన అధ్యక్షుడిని ఎంపిక చేసే బాధ్యతను ఒక బృందానికి అప్పగించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి సూచించారు. కొత్త నేతను తానే ఎంపిక చేయాలనటం భావ్యంకాదని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అన్నదాతకు మద్దతు

కేంద్ర ప్రభుత్వం 2019-20 ఖరీఫ్‌ సీజన్‌కు కనీస మద్దతు ధరల్ని(ఎంఎస్‌పీ) పెంచింది. వరి ధరను క్వింటాకు రూ.65 పెంచింది. రైతుకు సాగు ఖర్చుపై 50% అదనపు ధర కల్పిస్తామని చెప్పిన మాటను దృష్టిలో ఉంచుకుని తాజాగా కనీస మద్దతు ధరలను నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 14 పంటల కనీస మద్దతు ధరను ఖరారు చేశారు. తాజా ఎంఎస్‌పీ ఖరారు వల్ల తాము పెట్టిన ఖర్చులపై సజ్జ రైతులకు 85%, మినుము రైతుకు 64%, కంది రైతుకు 60% అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 2 రాష్ట్రాలు రెండేసి టీఎంసీలు?

గోదావరి నది నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలకు నీటిని మళ్లించేందుకు సూత్రప్రాయంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించిన నేపథ్యంలో సాగుతున్న తదనంతర కసరత్తు 2 రాష్ట్రాల్లో ఊపందుకుంది. గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించే వివిధ ప్రతిపాదనలపై బుధవారం 2 రాష్ట్రాల నిపుణులు విడివిడిగా హైదరాబాద్‌లో సమావేశమై చర్చించారు. ఒకేచోట నుంచి కాకుండా 2 రాష్ట్రాల నుంచి రెండేసి టీఎంసీల చొప్పున నీటిని మళ్లించే ప్రతిపాదననూ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెలుగులోనూ సుప్రీంకోర్టు తీర్పులు

సుప్రీంకోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనూ చదువుకోవచ్చు. తీర్పు కాపీలు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేసిన సూచన ఈ నెలాఖరు నుంచి అమల్లోకి రానుంది. ప్రాంతీయ భాషల్లోనూ తీర్పులు అనువాదం చేయడానికి వీలుగా సాఫ్ట్‌వేర్‌ను సుప్రీంకోర్టు అభివృద్ధి చేస్తోందని ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి కూడా తెలిపారు. ఆంగ్లంలో తీర్పులు అదే రోజున వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ప్రాంతీయ భాషల్లో అనువదించినవి వెబ్‌సైట్‌లో ఉంచడానికి వారం రోజులు పట్టనుంది. తెలుగుతోపాటు అస్సామీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా భాషల్లోకి తీర్పులు అనువదిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మండలాల్లో నేటి నుంచి కొత్త పాలన

గ్రామీణ వ్యవస్థలో మరో నూతన అధ్యాయం ఆవిష్కృతం కాబోతోంది. రాష్ట్రంలోని 537 మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్టెడ్‌ సభ్యులను జూన్‌ 7న ఎన్నుకోగా 498 మండలాల్లో నూతన పాలకవర్గాలు గురువారం నుంచి విధి నిర్వహణలో నిమగ్నమవుతాయి. కొత్తగా ఆవిర్భవించిన 112 మండల పరిషత్‌లూ ఇందులో ఉన్నాయి. పాత పాలకవర్గాల అయిదేళ్ల పదవీకాలం బుధవారంతో ముగియటంతో.. కొత్త పాలకవర్గాల తొలి సమావేశాలను గురువారం నిర్వహించటానికి వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. పదవీ కాలం ఇంకా మిగిలి ఉన్నందున 39 మండల పరిషత్‌ల పాలకవర్గాలు మాత్రం ఆగస్టు 7న అధికార పగ్గాలను చేపడతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రముఖ పారిశ్రామికవేత్త బి.కె.బిర్లా కన్నుమూత

దేశవ్యాప్తంగా ఉన్న 25 విద్యా సంస్థలు, ఎన్నో కంపెనీలను, దాతృత్వ సంస్థలను.. ముఖ్యంగా కుటుంబ సభ్యులను శోక సముద్రంలో ముంచి.. ఆయన వెళ్లిపోయారు. పారిశ్రామిక దిగ్గజం ఘన్‌శ్యామ్‌ దాస్‌ చిన్న కుమారుడు, ఆదిత్య విక్రమ్‌ తండ్రి, కుమార మంగళం బిర్లా తాతయ్య అయిన బి.కె. బిర్లా(98) బుధవారం ముంబయిలో తనువు చాలించారు. వయసు సంబంధిత అనారోగ్యాల వల్ల మరణించిన బిర్లాకు కోల్‌కతాలోని బిర్లాపార్క్‌లోని ఆయన సొంత గృహం వద్దే అంత్యక్రియలను నిర్వహించనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సచివాలయం తరలింపుపై స్టేకు నిరాకరణ

నూతన నిర్మాణాల నిమిత్తం ప్రస్తుత సచివాలయ భవనం కూల్చివేతతోపాటు తరలింపును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. సచివాలయం కూల్చివేసి కొత్త నిర్మాణాలను చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ.. నిర్మాణాన్ని కూల్చివేసి కొత్త నిర్మాణం చేపట్టాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం చెల్లదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పశ్చిమబెంగాల్‌ పేరును బంగ్లాగా మార్చండి

పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర పేరును బంగ్లా గా మార్చే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బుధవారం లేఖ రాశారు. ఇందుకు సంబంధించి రాజ్యాంగ ప్రక్రియను ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే పూర్తి చేయాలని ఆమె కోరారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌ పేరును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి అనుమతి ఇవ్వలేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ రాజ్యసభకు తెలిపారు.

9. ఈసీబీ అధ్యక్షురాలిగా క్రిస్టిన్‌ లగార్డే

యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) అధ్యక్షురాలిగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ప్రస్తుత మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టిన్‌ లగార్డేను ఎంపిక చేశారు. ఆమె 2019 నవంబరు 1 నుంచి ఆ బాధ్యతలు స్వీకరిస్తారు. లగార్డే 2011 జులై 5న ఐఎంఎఫ్‌ 11వ ఎండీగా నియమితులయ్యారు. అలాంటి కీలక స్థానంలో ఒక మహిళ ఎంపిక కావడం అదే తొలిసారి. ఇప్పుడామె ఈసీబీ అధ్యక్షురాలిగా మారియో డ్రాగి స్థానాన్ని భర్తీ చేయబోతున్నారు. ఆయన ఎనిమిదేళ్ల కాల పరిమితి 2019 అక్టోబరు 31న ముగియనుంది. ఆ తర్వాత నవంబరు 1 నుంచి లగార్డే ఈసీబీకి నేతృత్వం వహిస్తారు. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్‌కు తాత్కాలిక ఎండీగా డేవిడ్‌ లిప్టన్‌ను నియమిస్తున్నట్లు ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎన్నేళ్లకెన్నేళ్లకు 

ఫేవరెట్‌ ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 119 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించింది. బెయిర్‌స్టో (106; 99 బంతుల్లో 15×4, 1×6), జేసన్‌ రాయ్‌ (60; 61 బంతుల్లో 8×4) మెరవడంతో మొదట ఇంగ్లాండ్‌ 8 వికెట్లకు 305 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్‌ 45 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. 14 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయిన కివీస్‌ ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంగ్లాండ్‌ బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. చాలా ముందే కివీస్‌ పరాజయం ఖాయమైంది. 1992 తర్వాత ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ చేరడం ఇంగ్లాండ్‌కు ఇదే తొలిసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.