close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. పుర సవరణ 

పురపాలక ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికే ఉంటుంది. ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కల్పిస్తూ రూపొందించిన కొత్త పురపాలక బిల్లుకు గవర్నర్‌ నరసింహన్‌ అభ్యంతరం చెప్పారు. ఆయన సూచనను పరిగణనలోకి తీసుకొని సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీంతో కొత్త పురపాలక చట్టం-2019 అమల్లోకి వచ్చింది. చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విధివిధానాలు ప్రకటించనుంది. ఈ కొత్త చట్టం ప్రకారమే పురపాలక ఎన్నికలు జరుగుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. పింఛన్‌ గొడవ పెంచెన్‌

‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పింఛను’ అంశంపై మంగళవారం శాసనసభలో పెనుదుమారం రేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. తెదేపా శాసనసభాపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడుల సస్పెన్షన్‌కు దారి తీసింది. 45 ఏళ్లకు పింఛను స్థానంలో వైఎస్సార్‌ చేయూత తెచ్చామని సీఎం జగన్‌ వివరణ ఇవ్వడంతోపాటు తాను గతంలో చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పింగులను సభాపతి అనుమతితో సభలో ప్రదర్శింపజేశారు. ఆ తర్వాత కూడా తెదేపా సభ్యుల ఆందోళన సాగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. కాళేశ్వరానికి జలకళ 

కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు జలాశయాలు క్రమంగా జలకళను సంతరించుకుంటున్నాయి. ప్రాణహిత నది నుంచి వస్తున్న నీటితో మేడిగడ్డ బ్యారేజీ సముద్రాన్ని తలపిస్తోంది. దీంతో కన్నెపల్లి పంపులను పూర్తి సామర్థ్యం మేరకు నడుపుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలకుగాను ప్రస్తుతం 7 టీఎంసీలు చేరుకున్నాయి. బ్యారేజీ సమీపంలోని కన్నెపల్లి పంపుహౌస్‌ ఐదు పంపుల ద్వారా అన్నారం బ్యారేజీకి నీటిని ఎత్తిపోస్తున్నారు. 1, 2, 3, 4, 6 పంపుల నుంచి రోజుకు 11,500 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఇసుక సరఫరా పెంచండి

రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నట్లు తనకు సమాచారముందని.. సరఫరా పెంచాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. రేషన్‌కార్డును గ్రామ సచివాలయమే ముద్రించి లబ్ధిదారునికి అందిస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోతలు ఉండకూడదని స్పష్టం చేశారు. వర్షాలకు ముందు లైన్ల నిర్వహణకు గత ప్రభుత్వం అంగీకరించకపోవడం వల్లే ఇప్పుడా పనుల్ని చేయాల్సి వస్తోందని, దీనివల్లే అక్కడక్కడా అంతరాయాలు వస్తున్నాయని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయం నుంచి స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ట్రంప్‌ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్‌ 

కశ్మీర్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌... పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి సోమవారం వాషింగ్టన్‌లో అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇటీవల జపాన్‌లో జీ-20 సదస్సు సందర్భంగా మోదీ నన్ను కలిశారు. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని అడిగారు. ఉభయ దేశాలు కోరితే నేను అందుకు సిద్ధం. నేను ఏదైనా సాయం చేయగలనంటే చేస్తాను’’ అని అన్నారు. విషయం తెలియగానే భారత్‌లో రగడ మొదలైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కూటమికి ఓటమి 

కర్ణాటక రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చిస్తున్న వేళ.. గత గురువారమే ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఐదు రోజులుగా చర్చలు, వాయిదాల పర్వమే కొనసాగింది. సభకు హాజరైన సభ్యులు 204 మంది. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 105 ఓట్లు.. అనుకూలంగా 99 ఓట్లు వచ్చాయి. ఆ వెంటనే పాలకపక్షం సభ విశ్వాసాన్ని కోల్పోయినట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఓటింగ్‌ ముగిశాక రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం తన రాజీనామాను గవర్నర్‌ వజూభాయి వాలాకు అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. బ్రిటన్‌ నూతన ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

బ్రెగ్జిట్‌ నేపథ్యంలో రాజకీయ సంక్షోభానికి గురైన బ్రిటన్‌కు కన్జర్వేటివ్‌ పార్టీ సీనియర్‌ ఎంపీ బోరిస్‌ జాన్సన్‌ (55) కొత్త ప్రధానమంత్రి కానున్నారు. మంగళవారం ఆయన కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా గెలుపొందారు. వివిధ దశల్లో వడపోత తర్వాత బ్రిటన్‌ విదేశీ వ్యవహారాల మాజీమంత్రి బోరిస్‌ జాన్సన్‌, ప్రస్తుత విదేశీ వ్యవహారాల మంత్రి జెరెమీ హంట్‌ పోటీలో నిలిచారు. కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో మూడింట రెండువంతుల మంది జాన్సన్‌ వైపే మొగ్గుచూపారు. థెరిసా మే బుధవారం  ఎలిజబెత్‌ రాణిని కలిసి రాజీనామా సమర్పించనున్నారు. ఆ వెంటనే బోరిస్‌ జాన్సన్‌ నూతన ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. హైదరాబాద్‌లో పేపాల్‌ కార్యాలయం

డిజిటల్‌ చెల్లింపుల కంపెనీ పేపాల్‌ హైదరాబాద్‌లో తన గ్లోబల్‌ టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇప్పటికే చెన్నై, బెంగళూరులలో కేంద్రాలను ఏర్పాటు చేసిన పేపాల్‌ సైబర్‌ మోసాల నివారణ సంస్థ సిమిలిటీని 2018లో స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇక్కడ కార్యక్రమాలను ప్రారంభించింది. ఆ తర్వాత సంస్థ విస్తరణలో భాగంగా.. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ముఖ్య అతిథిగా హాజరై ఈ నూతన కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ మొత్తం 100 మంది సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారు. ప్రస్తుతం 60 మందిని తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. క్రికెటర్ల సంఘానికి బీసీసీఐ ఆమోదం

కొత్త రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ)ను బీసీసీఐ ఆమోదించింది. మాజీ క్రికెటర్లు (పురుషులు, మహిళలు) మాత్రమే ఈ సంఘంలో సభ్యత్వానికి అర్హులు. బీసీసీఐతో సంబంధం లేకుండా.. ఐసీఏ స్వతంత్రంగా పని చేస్తుంది. తన నిధులను తానే సమకూర్చుకోవాలి. ఆరంభంలో బోర్డు నుంచి కాస్త ఆర్థిక సహాయం అందుతుంది. భారత మాజీ క్రికెటర్లు కపిల్‌దేవ్‌, అజిత్‌ అగార్కర్‌, శాంత రంగస్వామి ఐసీఏకు డైరెక్టర్లుగా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఎన్టీఆర్‌ సరసన ఇంగ్లిష్‌ నాయికేనా?

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో ఎన్టీఆర్‌ సరసన ఇంగ్లిష్‌ సుందరే ఆడిపాడనుందా? తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అవుననే సమాధానమే  వినిపిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ తెరకెక్కుతోంది. రామ్‌చరణ్‌ సరసన అలియాభట్‌ కథానాయికగా నటిస్తోంది. ఎన్టీఆర్‌ కోసం బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ని ఎంపిక చేసినా, ఆమె కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకొంది. అప్పట్నుంచి ఎన్టీఆర్‌తో నటించే కథానాయిక కోసం చిత్ర బృందం అన్వేషిస్తోంది. పలువురు హిందీ కథానాయికల పేర్లు వినిపించినా, తాజాగా ఇంగ్లిష్‌ నాయిక ఎమ్మా రాబర్ట్స్‌ పేరు తెరపైకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.