close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. పార్టీకి ఓనర్లు ఉండరు

తెలంగాణ రాష్ట్ర సమితిలో క్రమశిక్షణ రాహిత్యాన్ని ఏ మాత్రం సహించేది లేదని, ఎంతటి వారైనా ఉపేక్షించబోమని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరించారు. క్రమశిక్షణను ఉల్లంఘించి మాట్లాడడం డెంగీ వ్యాధికన్నా ప్రమాదకరమైందని  వ్యాఖ్యానించారు. సీఎం అన్ని కోణాల్లో పరిశీలించి మంత్రివర్గ విస్తరణ చేపట్టగా కొందరు తమకు తోచిన విధంగా మీడియాలో ప్రకటనలు చేస్తుండడం సహేతుకం కాదని అన్నారు. ‘ఆస్తులకు ఓనర్లు ఉంటారు తప్ప అస్తిత్వాలకు ఉండరు. నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీక తెరాస. ఎవరికి వారు నేనే ఓనర్‌ అంటూ మాట్లాడం సరికాదు’ సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 72 ఏళ్ల కశ్మీర్‌ శాపం 72 గంటల్లో సమాప్తం

 ‘ప్రధాని మోదీ 100 రోజుల పాలనలో పలు ప్రగతిశీల నిర్ణయాలు జరిగాయి. అదే.. 100 రోజులు వేరే వాళ్లకీ పూర్తయ్యాయి. కానీ.. వారు మాత్రం అమరావతి పోవాలా? ఇంకా ఎటైనా పోవాలా? అని నిర్ణయించుకోలేని పరిస్థితిలోనే ఉన్నారు’ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అన్నారు. విజయవాడలో బుధవారం రాత్రి ‘కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు- ప్రయోజనాలు’ అన్న అంశంపై పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కశ్మీర్‌కు 72 ఏళ్ల నుంచి శాపంగా ఉన్న 370 అధికరణను ప్రధాని మోదీ 72 గంటల్లో సమాప్తం చేశారు’ అని రాంమాధవ్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పార్టీ మార్పిళ్లపై ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదు

ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ రైతు సమస్యలను తీర్చడంలో లేదని అధికార తెరాసపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. యూరియా కొరతకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెరాస విస్మరించినందుకు నిరసనగా టీపీసీసీ పిలుపు మేరకు బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఉత్తమ్‌ పాల్గొని మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌ ఆలస్యంగా ప్రారంభమైనా యూరియా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. రైతు బంధు పథకం డబ్బులను ప్రభుత్వం జూన్‌లో ఇవ్వాల్సి ఉండగా నేటికీ అందించలేదని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇసుకపై విమర్శలు రానివ్వొద్దు

ఇసుక సరఫరాలో అవినీతిని అడ్డుకోగలిగామని, దానిని సహించలేని వారే ఇంకా విమర్శలు చేస్తున్నారని, ఇలాంటి వాటికీ తావులేకుండా సరఫరా పారదర్శకంగా జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. గ్రామ సచివాలయాల్లో 237 రకాల పౌర సేవలు అందించాలని, ప్రతి మండలానికో జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సచివాలయంలో బుధవారం ఇసుక విధానం, గ్రామ, వార్డు సచివాలయాలు, విద్యాశాఖలపై వేర్వేరుగా ఆయన సమీక్షలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భాగ్యనగరంలో మొదలైన గణేశ్‌ శోభాయాత్ర

భాగ్యనగరంలో గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర మొదలైంది. ఇవాళ్టి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ నిమజ్జనం కొనసాగనుంది. నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ఉదయం ఆరుగంటల నుంచే రంగురంగుల అలంకరణలతో నగరంలో శోభాయాత్ర ప్రారంభమైంది. అయితే హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడుతోంది. అయినప్పటికీ వర్షం మధ్యే ఎన్టీఆర్‌ మార్గ్‌లో భక్తులు విగ్రహాల నిమజ్జనం కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో సుమారు 40వేల వరకు గణనాథుడి ప్రతిమలను గురువారం నిమజ్జనం చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమరావతి నిర్మాణానికి నిధుల్లేవ్‌

రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల్లేవని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధిని ఒక నగరానికే పరిమితం చేయడం కాక, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం, అందరికీ సుస్థిర జీవనం, అన్నిచోట్లా ఉత్పాదకరంగ అభివృద్ధికి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనే ప్రభుత్వ ప్రాధమ్యాలని తేల్చి చెప్పారు. భారత్‌- సింగపూర్‌ వ్యాపార, ఆవిష్కరణల సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ తరఫున హాజరైన ఆయన అక్కడి ఆంగ్ల పత్రిక ‘ద స్ట్రెయిట్స్‌ టైమ్స్‌’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అమరావతిలో ఆర్థిక నగరం అభివృద్ధికే సింగపూర్‌ సంస్థలు పరిమితమని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారతీయ విద్యార్థులకు బ్రిటన్‌ తీపి కబురు

ఉన్నత చదువుల కోసం బ్రిటన్‌ వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు శుభవార్త! విదేశీ విద్యార్థులు తమ దేశంలో చదువు పూర్తిచేసుకున్నాక రెండేళ్లపాటు పనిచేసే వెసులుబాటు కల్పించనున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఇందుకోసం రెండేళ్ల కాల వ్యవధితో కూడిన విద్యానంతర ఉపాధి వీసా విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అక్కడ విద్యానంతర ఉపాధి వీసా విధానం గతంలోనూ ఉండేది. 2012లో థెరెసా మే హోంమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి బ్రిటన్‌లో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రూ.99కే యాపిల్‌ టీవీ ప్లస్‌

ఐఫోన్‌ల నుంచి ఐప్యాడ్‌, యాపిల్‌ టీవీ, మ్యాక్‌లు, ఐపాడ్‌ టచ్‌ల వరకు వినియోగదారుల మనసు గెలుచుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ కంపెనీ పరికరాలు 140 కోట్ల మేర వినియోగంలో ఉన్నాయి. తాజాగా ఈ టెక్‌ దిగ్గజం ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) విభాగంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించింది.. కంటెంట్‌ స్ట్రీమింగ్‌ విభాగంలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌, హెచ్‌బీఓ, అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీలకు ‘యాపిల్‌ టీవీ+’ గట్టి పోటీ ఇవ్వనుంది. నవంబరు 1 నుంచి అందుబాటులోకి రానున్న ఈ సేవలకు అమెరికాలో నెలవారీ చందా 4.99 డాలర్లుగా ప్రకటించారు. భారత్‌లో ఇది రూ.99గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శ్రీలంక జట్టుకు ఉగ్ర ముప్పు!

భద్రత కారణాలతో కెప్టెన్‌ కరుణరత్నె, మలింగ, మాథ్యూస్‌ సహా పది మంది సీనియర్‌ ఆటగాళ్లు పాకిస్థాన్‌ వెళ్లడానికి నిరాకరించినా వెనక్కి తగ్గని శ్రీలంక బోర్డు.. ఆ దేశంలో పర్యటనకు ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. అయినా శ్రీలంక జట్లు పాకిస్థాన్‌లో పర్యటించడం అనుమానంగానే మారింది. పర్యటన సందర్భంగా తమ ఆటగాళ్లను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకునే ప్రమాదం ఉందంటూ తమకు హెచ్చరికలు వచ్చాయని లంక బోర్డు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రాబిన్‌హుడ్‌ సందడి

‘దబాంగ్‌’, ‘దబాంగ్‌ 2’ చిత్రాల్లో చుల్‌బుల్‌ పాండేగా ఆకట్టుకున్నారు సల్మాన్‌ ఖాన్‌. ఈసారి చుల్‌బుల్‌ రాబిన్‌హుడ్‌ పాండేగా మరింత సందడి చేయడానికి ‘దబాంగ్‌ 3’తో రాబోతున్నారు. సల్మాన్‌ కథానాయకుడిగా నటించడంతో పాటు  నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ కన్నడ నటుడు సుదీప్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రభుదేవా దర్శకుడు.మూడో ‘దబాంగ్‌’లోనూ సోనాక్షి సిన్హానే కథానాయిక. డిసెంబరు 20న ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. అంటే  విడుదలకు ఇంకో 100 రోజులు ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.