close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 1 PM

1. దేశీయ కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను తగ్గింపు

మందగమనంలో ఉన్న దేశ ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించే దిశగా మరిన్ని ఉద్దీపనలతో ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దేశీయ కంపెనీల కార్పొరేట్‌ పన్నును(సర్‌ఛార్జ్‌, సెస్‌ కలిపి)  30శాతం నుంచి 25.17శాతానికి తగ్గించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. జోరు మీదున్న మార్కెట్లు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజా ఉద్దీపనల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సెన్సెక్స్‌ 1731 పాయింట్లు లాభపడి 37,825 వద్ద కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ 512 పాయింట్లు ఎగబాకి 11,216 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువరూ.70.95గా ఉంది. 

3. గోదావరి ఘటనలో మరో మృతదేహం లభ్యం

గోదావరి బోటు మునక ఘటనలో తాజాగా మరో మృతదేహం లభ్యమైంది. కచ్చులూరు సమీపంలో ఓ మహిళ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. మహిళ మృతదేహాన్ని దేవీపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఇప్పటి వరకు బయల్పడిన మృతుల సంఖ్య 35కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. చౌక బియ్యానికి నగదు బదిలీ లేదు: గంగుల

చౌక బియ్యానికి నగదు బదిలీ చేసే అలోచన లేదని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ కన్నా పెద్ద రాష్ట్రాలు చాలా ఉన్పప్పటికీ.. పథకం అమలు ఇక్కడే పక్కాగా అమలవుతోందన్నారు. రాష్ట్రంలో రూపాయికి కిలో బియ్యం పథకం ద్వారా 2.66 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. నెలలో ఒకేసారి రేషన్‌ తీసుకెళ్లడం డీలర్లకు ఇబ్బందిగా మారిందంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. దానిని మార్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.

5. లారీ-వ్యాను ఢీ..నలుగురి మృతి

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖపట్నానికి చెందిన 11మంది కుటుంబసభ్యుల బృందం వ్యానులో ఏలూరు వైపు  వెళ్తుండగా.. ఓ లారీ ఎదురుగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ పురుషుడు, ఒక మహిళ సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరు చిన్నారులు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. అత్యాచార కేసులో చిన్మయానంద్‌ అరెస్టు

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌ను సిట్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించారు. న్యాయ విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడినట్లు చిన్మయానంద్‌పై గతకొంతకాలంగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. కులవివక్ష పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష, వేధింపులపై రోహిత్ వేముల, పాయల్ తద్వి తల్లులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం దీనికి సంబంధించి ఇప్పటికే యూజీసీ నియంత్రణలు ఉన్నాయని తెలిపింది. అయితే అవి అమలు కావడం లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. పాక్ దిగజారితే.. భారత్‌ తీవ్రంగానే స్పందిస్తుంది

రానున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి పాకిస్థాన్‌ తన దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తే.. భారత్ అందుకు దీటుగా స్పందిస్తుందని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ హెచ్చరించారు. ఇప్పటికే పాక్‌ చేసిన పలు విఫలయత్నాలను భారత్‌ ఎలా తిప్పికొట్టిందో అంతర్జాతీయ సమాజం చూసిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ధోనీ టైమ్‌ అయిపోయింది: గవాస్కర్

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ భవితవ్యంపై రోజుకో వార్త ప్రచారంలో ఉంది. అతడి రిటైర్మెంట్‌పై అనేక వార్తలు వినిపిస్తున్న తరుణంలో లెజెండరీ బ్యాట్స్‌మన్‌, మాజీ సారథి సునీల్‌గవాస్కర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  ‘అతడి మీదున్న గౌరవంతో చెబుతున్నా.. ధోనీ టైమ్‌ అయిపోయింది. టీమిండియా భవిష్యత్‌పై దృష్టిసారించాలి. అయితే ధోనీని జట్టు సాగనంపకముందే.. అతడే వెళ్లిపోతాడని భావిస్తున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల కలకలం!

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగరంలో పలు వీధుల్లో గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రి కాల్పులకు తెగబడ్డట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఘటనా స్థలం శ్వేతసౌధానికి కొద్ది దూరంలోని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.