close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. తెదేపా మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూత

తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ ఎన్‌.శివప్రసాద్‌ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1951 జులై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో శివప్రసాద్‌ జన్మించారు. తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ అభ్యసించిన శివప్రసాద్‌.. ఆ తర్వాత రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెరాస గెలుపు నల్లేరుపై నడకే: జగదీశ్‌ రెడ్డి

హుజూర్‌నగర్‌లో తెరాస గెలుపు నల్లేరుపై నడకేనని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పోలింగ్ సమీపించాక తమకు మెజార్టీ ఎంతనేది చెప్పగలమని వ్యాఖ్యానించారు. తమకు పోటీ కాంగ్రెస్‌తోనేనని అన్నారు. భాజపా ప్రభావం ఉండదని చెప్పారు. తెరాసను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో సంబంధం ఉండదని, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఫలితాలు పునరావృతం అవుతాయని జగదీశ్‌ రెడ్డి అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వరద బాధితులకు ఇళ్లు: జగన్‌

వరదల వల్ల నష్టపోయిన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో వరదలు వస్తే నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన సీఎం జగన్‌ విహంగ వీక్షణం ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. సహాయ, పునరావాస చర్యలపై నంద్యాలలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద బాధితుల్లో ప్రతి ఇంటికీ అదనంగా రూ.2 వేలు సాయం అందిస్తామని.. వరద బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని జగన్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఐటీఐఆర్‌కు నయాపైసా ఇవ్వలేదు: కేటీఆర్‌

యూపీఏ హయాంలో ఐటీఐఆర్‌కు నయాపైసా ఇవ్వలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.ఐటీఐఆర్‌ ప్రాజెక్టు పురోగతిపై అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు బట్టి విక్రమార్క ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా రాష్ట్రంలో 12.67 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. ఐటీ రంగంలోనూ గణనీయమైన ప్రగతి సాధిస్తున్నామన్న కేటీఆర్‌.. ఆ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 5.5 లక్షలకు చేరిందని తెలిపారు.బెంగళూరును తలదన్నేలా ఐటీలో దూసుకెళ్తున్నామని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వారంలో ఇద్దరు నేతల్నికోల్పోయాం:చంద్రబాబు

తెదేపా మాజీ ఎంపీ డాక్టర్‌ ఎన్‌. శివప్రసాద్‌ మృతి పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తంచేశారు. ఆయన తనకు చిరకాల మిత్రుడని తెలిపారు. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో హామీల అమలు కోసం రాజీలేని పోరాటం చేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. శివప్రసాద్‌ మృతి చిత్తూరు జిల్లాకే కాకుండా యావత్‌ ఆంధ్ర రాష్ట్రానికే తీరని లోటన్నారు. శివప్రసాద్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు సీనియర్‌ నేతలను కోల్పోవడం తమ పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 30వేల మెజార్టీతో గెలుస్తాం: ఉత్తమ్‌

హుజూర్‌నగర్‌ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో 30వేల మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. హుజూర్‌ నగర్‌ స్థానానికి సంబంధించి పోలింగ్‌ తేదీని ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. జానారెడ్డి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం చేస్తామని వివరించారు. ఈ ఎన్నిక అధికార అహంకారానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆగ్రహించిన రైతన్నలు..దిల్లీకి పాదయాత్ర

ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ వేలాది మంది ఉత్తర్‌ప్రదేశ్‌ రైతులు దేశ రాజధానికి పాదయాత్రగా బయలుదేరారు. చెరకు రైతుల బకాయిలను చెల్లించడం సహా ఉచిత విద్యుత్‌ లాంటి 16 హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. సహరాన్‌పూర్‌ నుంచి రాష్ట్రీయ కిసాన్‌ సంఘ్‌ నేతృత్వంలో సెప్టెంబరు 11నే పాదయాత్ర ప్రారంభించిన వీరు నోయిడాలో భారతీయ కిసాన్ సంఘటన్‌, వ్యవసాయశాఖ అధికారులతో చర్చలు జరిపారు. కానీ, అవి విఫలం కావడంతో శనివారం ఉదయం దిల్లీకి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జిమ్‌లో కసరత్తులు చేసిన టీమిండియా

దక్షిణాఫ్రికాతో జరిగే ఆఖరి టీ20కి టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా కష్టపడుతున్నారు. తదుపరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా సాధన చేస్తున్నారు. ఇప్పటికే రెండో మ్యాచ్‌లో గెలుపొందిన కోహ్లీసేన మూడో మ్యాచ్‌పై కన్నేసింది. ఎలాగైనా చివరి టీ20లో విజయం సాధించి సిరీస్‌ గెలవాలని చూస్తోంది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు బెంగళూరు జాతీయ అకాడమీలో సాధన చేశారు. అక్కడి వ్యయామశాలలో చెమటోడ్చి కష్టపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 46 పాక్‌ విమానాలు ఖాళీగానే తిరిగాయ్‌!

ప్రయాణించేవారు లేక పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఏఐ) సంస్థ ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. 2016-17 ఏడాదిలో ఇస్లామాబాద్‌ విమానాశ్రయం నుంచి 46 విమాన సర్వీసులు ప్రయాణికులు లేకుండానే నడిచాయని పేర్కొంది. దీంతో ఆ దేశానికి సుమారు 1.1 మిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లినట్టు జియో న్యూస్‌ వెల్లడించింది. ఈ గణాంకాలు ఆడిట్‌ నివేదికలోని వెల్లడయ్యాయని పేర్కొంది. పాక్‌ ఎయిర్‌లైన్స్‌ పెను నష్టాల్లో కూరుకుపోయిన విషయం అధికారులకు తెలిసినప్పటికీ దీనిపై విచారణ చేపట్టలేదని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘అసందర్భ వాదనలతో ఐరాసలో కాలం వృథా’

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచదేశాల మద్దతు కూడగట్టడం భారత విదేశీ విధానాల్లో భాగమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. ఉగ్రవాద నిరోధంపై భారత్‌ చేస్తున్న పోరాటానికి 2019లో రెండు గొప్ప విజయాలు దక్కాయన్నారు.  ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా దాడిని వ్యతిరేకిస్తూ ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ) తీర్మానం చేయడం ఒకటన్నారు. ప్రమాణాలకు విరుద్ధంగా అసందర్భ వాదనలతో తమ కాలాన్ని వృథా చేసుకునే నాయకులెవరైనా ఉంటే అది వారికే వదిలేస్తున్నామని పరోక్షంగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కి చురకలంటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.