close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ‘శివసేనతో మేం చేతులు కలపం’

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గడువు దగ్గర పడటంతో మరాఠా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. భాజపా - శివసేన మధ్య నెలకొన్న విభేదాలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తనతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన అనంతరం పవార్‌ మాట్లాడుతూ.. శివసేనతో తమ పార్టీ కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌తో కలిసి విపక్షంలోనే కూర్చుంటామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి. 

2. సెలవుపై వెళ్లనున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఏపీ మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం నెలరోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ)గా బాధ్యతలు చేపట్టకుండానే ఆయన సెలవు పెట్టనున్నారు. డిసెంబర్‌ 6 వరకు సెలవు పెట్టినట్లు సమాచారం. సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసింది. బాపట్లలోని ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

3. ఏపీ సహా 9రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

కేంద్ర సమాచార శాఖ కమిషనర్‌(సీఐసీ), రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌(ఎస్‌ఐసీ) నియామకాలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ విషయంపై కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ సహా మొత్తం తొమ్మిది రాష్ట్రప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నాలుగువారాల్లో నియామక ప్రక్రియపై స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

4. అంతరిక్ష కేంద్రానికి 12 బాటిళ్ల వైన్‌

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి డజన్‌ రెడ్‌ వైన్‌ బాటిళ్లు చేరుకున్నాయి. అయితే ఇవి ఐఎస్‌ఎస్‌లో ఉంటున్న వ్యోమగాముల కోసం కాదు.. పరిశోధనలకు మాత్రమే. రెడ్‌ బోర్డియక్స్‌ వైన్‌ భూమికి తిరిగి చేరుకునే ముందు అక్కడ ఒక ఏడాది పాటు ఉండనుంది. భార రహిత స్థితి, అంతరిక్ష రేడియేషన్‌.. వైన్‌ తయారీ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపనుందో పరిశోధనలు చేపట్టనున్నారు.  ఆహార పరిశ్రమలో కొత్త రుచులు, లక్షణాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

5. మైదానంలో బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు వాంతులు!

టీమిండియాతో తొలి టీ20 మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు సౌమ్య సర్కార్‌, మరో బంగ్లాదేశ్‌ ఆటగాడు మైదానంలోనే వాంతి చేసుకున్నారని సమాచారం. దిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానం ఈ పోరుకు ఆతిథ్యమిచ్చింది. దీపావళి ముందు నుంచే దేశ రాజధాని ప్రాంతంలో వాయుకాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. పండగ తర్వాత గాలి నాణ్యత సూచీలో కాలుష్యం తీవ్రత 999 దాటింది. శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డ ఆటగాళ్లు వాంతి చేసుకున్నారని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో ధ్రువీకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

6. ‘యడియూరప్ప రూ. 1000కోట్లు ఇచ్చారు’

కర్ణాటకలో అనర్హతకు గురైన ఎమ్మెల్యే ఒకరు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పపై చేసిన వ్యాఖ్యలు తాజాగా సంచలనానికి దారితీశాయి. భాజపాకు మద్దతిస్తే తన నియోజకవర్గమైన కృష్ణరాజపేట్‌ అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు ఇస్తామని యడియూరప్ప చెప్పారని, అన్నట్లుగానే సీఎం అయ్యాక ఆ నిధులను కేటాయించారని అనర్హత ఎమ్మెల్యే నారాయణ గౌడ అన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

7. జగన్‌ మూల్యం చెల్లించక తప్పదు:యనమల

ముఖ్యమంత్రి జగన్ సంతకం లేకుండానే పురస్కారం పేరు మారుస్తూ జీవో 301 విడుదల చేశారా? అని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. సీఎం చెప్పకుండానే మంత్రి జీవోపై సంతకం పెట్టారా? అని ప్రశ్నించారు. అబ్దుల్ కలాం ప్రతిభ అవార్డుల పేరు మార్చేసి వైఎస్సార్ పేరు పెట్టాలను కోవడాన్ని ఆయన తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. సంక్షేమం కోసం ప్రభుత్వ స్థలాల అమ్మకం మరో తుగ్లక్ చర్య అని దుయ్యబట్టారు. వీటికి జగన్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

8. హనీట్రాప్‌ వలలో ఇద్దరు జవాన్లు!

పాక్‌ మహిళతో హానీట్రాప్‌ వలలో పడిన ఇద్దరు భారత జవాన్లను ఇంటలిజెన్స్‌ అధికారులు మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఆమెకు ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. అధికారుల నుంచి అందిన సమాచారం మేరకు.. లాన్స్‌నాయక్‌ రవివర్మ, విచిత్ర బోహ్రా ఇద్దరు జవాన్లు పోఖ్రాన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వీరు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మహిళతో హనీట్రాప్‌ వలలో పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

9. రూ. 39వేల దిగువకు పసిడి

అంతర్జాతీయ బలహీన సంకేతాలు, డిమాండ్‌ లేమితో ఇటీవల బంగారం ధర దిగొస్తోంది. బుధవారం రూ. 301 తగ్గడంతో పసిడి ధర మళ్లీ రూ. 39వేల దిగువకు పడిపోయింది. నేడు దేశ రాజధానిలో 10 గ్రాముల పుత్తడి రూ. 38,870 పలికింది. అటు వెండి కూడా బంగారం దారిలోనే పయనిస్తోంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ఇవాళ ఒక్కరోజే రూ. 906 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 46,509గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

10. కొత్త శిఖరాల్లో.. మార్కెట్లు

దలాల్‌ స్ట్రీట్‌ మళ్లీ కొనుగోళ్లతో కళకళలాడింది. బ్యాంకింగ్‌, లోహ, స్థిరాస్తి రంగాల షేర్ల అండతో కొత్త శిఖరాల్లోకి దూసుకెళ్లింది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభంతో సరికొత్త రికార్డులో స్థిరపడగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 12,000 మార్క్‌కు కొద్ది దూరంలో నిలిచింది. నేటి సెషన్‌లో సెన్సెక్స్‌ 221 పాయింట్లు లాభపడి 40,470 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 11,961 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.99గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.