
తాజా వార్తలు
దిల్లీ: దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘావర్గాల హెచ్చరికలతో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పాక్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ముష్కరులు భారీ ఆయుధాలతో నగరంలోకి చొరబడ్డారని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చాయి. దీంతో అప్రమత్తమైన దిల్లీ పోలీసులు నగరంలోని పలు చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం ఉన్న ప్రతిచోటా బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపడుతున్నారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ పాక్ ఉగ్రవాదులు దేశంలో దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం నలుగురు ఉగ్రవాదులు భారీగా ఆయుధాలతో నగరంలోకి చొరబడ్డారన్న సమాచారంతో దేశరాజధాని నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దసరా వేడుకల నేపథ్యంలో ముష్కరులు దాడులకు తెగబడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ భద్రతా బలగాలను మోహరించి నిత్యం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.