close

తాజా వార్తలు

ఎందుకొచ్చిన మధుపాట్లు

తెలియక చేస్తే పొరపాటు. మరి తెలిసి చేస్తే? మధుమేహం విషయంలో ఎంతోమంది చేస్తున్నదిదే! ప్రస్తుతం మధుమేహం గురించి మనకు అంతో, ఇంతో బాగానే తెలుసు. ఇది ఒకసారి వచ్చిందంటే పూర్తిగా నయమయ్యే సమస్య కాదనే సంగతి తెలుసు. మందులతో, జీవనశైలి మార్పులతో దీన్ని నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి మరో మార్గం లేదని తెలుసు. దీర్ఘకాలంగా రక్తంలో గ్లూకోజు నియంత్రణలో లేకపోతే చూపు పోవటం, నాడులు దెబ్బతినటం, పాదాల మీద పుండ్లు పడటం వంటి తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తుందని తెలుసు. వీటి మూలంగా ఎంతో ఖర్చు భరించాల్సి వస్తుందని, ఎన్నెన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలుసు. కొన్నిసార్లు ప్రాణాపాయం సంభవించొచ్చనీ తెలుసు. అయినా కూడా ఎంతోమంది ఎన్నెన్నో పొరపాట్లు చేస్తుండటం గమనార్హం. మందులు వేసుకోవటం దగ్గర్నుంచి, పరీక్షల వరకూ ఎన్నో తప్పులు దొర్లుతుండటం చూస్తూనే ఉన్నాం. ఎందుకిలా? తెలిసి తెలిసీ పొరపాట్లు ఎందుకు చేస్తున్నాం? మనమంతా తక్షణం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.
మధుమేహం§
మధుమేహం రోజురోజుకీ విజృంభిస్తోంది. మన సమాజంలో నూటికి 13 మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. మున్ముందు దీని బారినపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని ప్రపంచ ఆరోగ్యసంస్థ, భారతీయ వైద్య పరిశోధన మండలి గట్టిగానే హెచ్చరిస్తున్నాయి. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే మార్గాలు, పద్ధతులు తెలిసినా పరిస్థితి ఇలా నానాటికీ దిగజారుతోందంటే కారణమేంటి? మంచి మందులు అందుబాటులో ఉన్నా దుష్ప్రభావాలకు దారితీసే స్థాయికి సమస్య చేరుకుంటోందంటే అర్థమేంటి? ఇదంతా మన అలసత్వానికి నిదర్శనమే. ఇప్పటికైనా కళ్లు తెరవటం మంచిది. పొరపాట్లకు, అశ్రద్ధకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం ఉన్నా కూడా ఆరోగ్యంగా జీవించొచ్చు. దీంతో మనకే కాదు.. మన కుటుంబానికి, మన సమాజానికి మేలు చేసినట్టూ అవుతుంది.
ఇన్సులినా.. అమ్మో..
ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ అవసరం అని డాక్టర్‌ చెప్పినపుడు చాలామంది ముందుగా ‘వద్దండీ’ అనేస్తుంటారు. ‘ఇన్సులిన్‌ ఒకసారి మొదలెడితే జీవితాంతం వాడాలట కదా. బాగా జబ్బు ముదిరినవారికే ఇన్సులిన్‌ ఇస్తారటగా. అంటే నా పని అయిపోనట్టేనా?’ అని భయపడిపోతుంటారు. ఇలాంటి అపోహలు, భ్రమలు పెట్టుకోవద్దు. కొన్నిసార్లు క్లోమగ్రంథికి విశ్రాంతి ఇవ్వటానికి, మాత్రలతో గ్లూకోజు నియంత్రణలోకి రానివారికి, గర్భిణులకు, అలాగే మధుమేహ దుష్ప్రభావాలు గలవారికి ఇన్సులిన్‌ వాడుకోవాల్సిన అవసరముంటుంది. ఇన్సులిన్‌ వాడిన తర్వాత మాత్రలు పనిచేయవని అనుకోవటం నిజం కాదు. అవసరానికి ఇన్సులిన్‌ వాడుకున్నాక గ్లూకోజును అదుపులోకి తెచ్చే మాత్రలు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు.
పరీక్షల్లో తప్పులు
* చాలామంది ఉదయం లేవగానే తొలిసారి వచ్చిన మూత్రాన్ని పరీక్షకు ఇస్తుంటారు. నిజానికి ఒకసారి మూత్రం పోశాక.. అరగంట తర్వాత వచ్చే మూత్రాన్ని పట్టాలి. లేదంటే టిఫిన్‌ గానీ భోజనం గానీ చేసిన తర్వాత వచ్చే మూత్రాన్ని గ్లూకోజు పరీక్షకు ఇవ్వాలి. అయితే మూత్రంలో గ్లూకోజు ఉన్నంత మాత్రాన అది మధుమేహం కాదు. రక్తపరీక్షతోనే సమస్య కచ్చితంగా తేలుతుంది. ఇది చాలా ముఖ్యం. కొన్నిసార్లు గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, అలాగే విటమిన్‌ సి, యాంటీబయోటిక్‌ మందులు, టెట్రాసైక్లిన్‌ వంటివి తీసుకునేవారికి మూత్రపరీక్షలో గ్లూకోజులాగా కనబడొచ్చు. రీనల్‌       గ్లైకోసూరియా సమస్యతో బాధపడేవారికి గ్లూకోజు నార్మల్‌గా లేదా తక్కువగా ఉన్నా కూడా మూత్రంలో గ్లూకోజు ఉండొచ్చు. ఇలాంటివారికి మధుమేహ చికిత్స చేస్తే గ్లూకోజు బాగా పడిపోతుంది.
* పరగడుపున (రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఏమీ తినకుండా) చేసే రక్త పరీక్షను ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపే చేయించుకోవాలి. కానీ కొందరు ఉదయం 10 గంటలకు వచ్చి ‘పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేదు. పరీక్ష చేయండి’ అని అంటుంటారు. ఇందులో గ్లూకోజు మోతాదులు కచ్చితంగా తెలియవు. ఈ సమయానికి ఒంట్లో హార్మోన్లు విడుదలై గ్లూకోజు మోతాదులను సరిచేస్తాయి. అలాగే తిన్నాక చేసే పరీక్షను భోజనం చేసిన 2 గంటల తర్వాతే చేయాలి.
* 3 నెలల కాలంలో రక్తంలో గ్లూకోజు మోతాదుల సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్షను ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఇది 6.5% దాటితే మధుమేహం ఉందనే అర్థం. చికిత్స తీసుకుంటున్నప్పుడు 7% లోపు ఉండేలా చూసుకోవటం ముఖ్యం.

రక్తంలో గ్లూకోజు పరగడుపున 110ఎంజీ ఉన్నట్టయితే మధుమేహం ఉందేమోనని అనుమానించాల్సి ఉంటుంది. తిన్న తర్వాత అయితే 140ఎంజీ లోపే ఉండాలి. 200ఎంజీ దాటితే మధుమేహం ఉందనే అర్థం. ఇక రోజులో ఎప్పుడైనా చేసే పరీక్షలో (ఆర్‌బీఎస్‌) గ్లూకోజు 200ఎంజీ దాటితే మధుమేహం ఉన్నట్టు. అయితే 160, 170 ఎంజీ ఉన్నంత మాత్రాన సమస్య లేదని కాదు. దీన్ని నిర్ధరించటానికి మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

డాక్టర్‌కు చెప్పకపోవటం
కొందరికి తమకు మధుమేహం ఉందని తెలుసు. మాత్రలు వేసుకుంటూ ఉండొచ్చు. కొంతకాలం వేసుకొని ఆపేసి ఉండొచ్చు. లేదూ మాత్రల మోతాదు తగ్గించి వాడుతుండొచ్చు. అయినా కూడా జ్వరానికో, దగ్గుకో డాక్టర్‌ దగ్గరికి వచ్చినపుడు చాలామంది తమకు మధుమేహం ఉందనే విషయాన్ని చెప్పనే చెప్పరు. మధుమేహం ఉందా అని అడిగితే లేదంటారు. ఏదైనా అనుమానం వచ్చి.. తరచి తరచి అడిగితే గానీ నోరు విప్పరు. ఎప్పుడో రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండేది, మాత్రలు వాడితే తగ్గిపోయిందని నెమ్మదిగా అసలు విషయం చెబుతుంటారు. ఇలా సమస్యను దాచిపెట్టటం మంచిది కాదు. మధుమేహంతో బాధపడేవారు ఎప్పుడు డాక్టర్‌ దగ్గరికి వెళ్లినా దాని గురించి ముందుగానే చెప్పాలి. ఎందుకంటే రక్తంలో గ్లూకోజు అదుపులో లేకపోతే ఎన్నెన్నో దుష్ప్రభావాలు ముంచుకొస్తాయి. కాబట్టి ఇలాంటి పొరపాటు చేయొద్దు.
ఒక్క మాత్రలతోనే కాదు..
మధుమేహంతో బాధపడేవారిలో చాలామంది చేసే పొరపాటు మందులు వేసుకుంటే సరిపోతుందనుకోవటం. గ్లూకోజు అదుపులో ఉండాలంటే మందులతో పాటు ఆహార నియమాలు, వ్యాయామం చాలా ముఖ్యం. ‘టీ, కాఫీల్లో చక్కెర వేసుకోవటం లేదు. కొంచెమే తింటున్నాను. గ్లూకోజు కంట్రోల్‌లో లేదు’ అని చాలామంది చెబుతుంటారు. కొంచెం తింటున్నారు సరే. దాంతో లభించే కేలరీలు ఖర్చు కావటానికి ఏం చేస్తున్నారు? కాఫీ, టీలో పంచదార వేసుకోవటం లేదు సరే. మరి పాలలో చక్కెర లేదా? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలే. ఇక వ్యాయామం అనగానే ‘ఆఫీసు పని, ఇంట్లో పని. సమయం ఉండటం లేదు’ అంటారు. ఆరోగ్యం కోసం సమయం కేటాయించకపోతే ఎలా? అసలు విషయం ఏంటంటే- బద్ధకం. చలికాలమైతే చలి.. ఎండకాలమైతే ఉక్కపోత, నీరసం.. వానకాలమైతే వర్షం. ఏదో ఒక పేరుతో నడక, వ్యాయామాలను పక్కన పెట్టేయటానికే ప్రయత్నిస్తుంటారు. దీంతో పూర్తిగా మందుల మీదే ఆధారపడాల్సి వస్తుంటుంది. ఇది మంచి పద్ధతి కానే కాదు.
జనరిక్‌ మందులపై అనుమానాలు
ప్రస్తుతం మందులు ఖరీదయ్యాయన్నది నిజమే. అందరూ కొనుక్కోలేని పరిస్థితి ఉందనేదీ నిజమే. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం జనరిక్‌ మందులను అందుబాటులోకి తెచ్చింది. వీటి ధర తక్కువ కాబట్టి పనిచేయవనేది చాలామంది అనుమానం. అందుకని వాడరు. కంపెనీ మందులను కొనలేనివారు జనరిక్‌ మందులు వాడుకోవచ్చు. ఇవి మంచివే.
ఇష్టానుసారంగా మందులు..
డాక్టర్‌ చెప్పటం వల్లనో, భయంతోనో మొదట్లో మందులు బాగానే వేసుకుంటారు. మధ్యలో ఒకసారో, రెండు సార్లో పరీక్షలు చేయించుకుంటారు. గ్లూకోజు అదుపులో ఉందని తేలగానే తమకు తామే మాత్రలు తగ్గిస్తారు. ఆహార నియమాలు పెద్దగా పట్టించుకోరు. డాక్టర్‌ దగ్గరకు వచ్చినపుడు పరీక్ష చేస్తే గ్లూకోజు మోతాదులు పెరిగి ఉంటాయి. మందులు సరిగా వేసుకుంటున్నారా? అని అడిగితే.. మాత్రలతో నీరసం వచ్చింది, షుగర్‌ డౌన్‌ అయ్యింది.. మాత్రలు తగ్గించాను అని చెబుతుంటారు. గ్లూకోజు తగ్గింది కదాని ఆహారం తిరిగి మామూలుగానే తీసుకుంటున్నానని అంటుంటారు. ఇది పెద్ద పొరపాటు. మందులను డాక్టర్‌ చెప్పినట్టు క్రమం తప్పకుండా వేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు. మందులు వేసుకోవటం వల్లనే గ్లూకోజు అదుపులోకి వచ్చిందనే సంగతిని గుర్తించాలి. రక్తంలో గ్లూకోజు బాగా పడిపోవటం (హైపోగ్లైసీమియా) ప్రమాదకరమైందే. కాదనటానికి లేదు. దీని విషయంలో జాగ్రత్త తప్పనిసరి. కానీ కాస్త చెమటలు పట్టాయనో, నీరసంగా ఉందనో మాటిమాటికి మందుల మోతాదు తగ్గించటం, మానెయ్యటం తగదు. ప్రస్తుతం గ్లూకోమీటర్లు తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటున్నాయి. వీటిల్లో ఐదారు సెకన్లలోనే గ్లూకోజు మోతాదులు తెలుస్తాయి. గ్లూకోజు బాగా తక్కువగా ఉంటే అప్పటికి మాత్ర మానేసి.. కొద్దిగా పంచదార నోట్లో వేసుకొని.. తర్వాత డాక్టర్‌ను కలవాలి. అవసరమైతే డాక్టర్లు మందుల మోతాదులు సరిచేస్తారు.
నివారించే, నయం చేసే మందుల్లేవు
ప్రస్తుతానికి మధుమేహాన్ని రాకుండా ఆపే మందులేవీ లేవు. కానీ దీని బారినపడకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో, రక్త సంబంధికుల్లో ఎవరికైనా మధుమేహం ఉంటే ఆహార నియమాలు పాటించటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది. వీటి ద్వారా మధుమేహాన్ని దూరంగా పెట్టుకోవచ్చు. ఇక మధుమేహం వచ్చినా కుంగిపోవాల్సిన పనిలేదు. ఏమీ తినకూడదేమోనని బెంగ పడొద్దు. ఏం తిన్నా మితంగా తినాలి. మరికొంచెం వ్యాయామం ఎక్కువగా చేయాలి. రోజుకు అరగంట సేపు వేగంగా నడిచినా చాలు. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించొచ్చు.
నాకెందుకు వస్తుంది?
ఇది అతిపెద్ద పొరపాటు. ‘మధుమేహం నాకెందుకు వస్తుంది? నేను చాలా ఆరోగ్యంగానే ఉన్నాను కదా. మూత్రం ఎక్కువగా ఏమీ రావటం లేదే. రాత్రిపూట పడుకున్న తర్వాత మూత్రం పోయటానికి లేవనే లేవనాయె. ఆకలి కూడా ఎక్కువగా వేయదాయె. నీరసమనేదే ఉండదు. మధుమేహం మా వంశంలో ఎవరికీ లేనే లేదు. మీకు తెలుసో తెలియదో నాకు దెబ్బ తగిలితే చిటికెలో తగ్గిపోతుంది. మందులు కూడా వేసుకోను’ -ఇలా మనదగ్గర ఎంతోమంది ఎవరికి వారు తమకు మధుమేహం వచ్చే అవకాశమే లేదని చెబుతుంటారు. నిజమే. ఆకలి ఎక్కువగా వేయటం, నీరసం, మూత్రం ఎక్కువగా రావటం మధుమేహ లక్షణాలే కావొచ్చు. అయితే ఇవి లేనంతమాత్రాన మధుమేహం రానే రాదని, లేదని అనుకోవటం సరికాదు. టైప్‌-1 మధుమేహంలో (చిన్న వయసులో వచ్చేది) తప్ప టైప్‌-2 మధుమేహంలో ఇలాంటి లక్షణాలు ఉండవనే సంగతిని తెలుసుకోవాలి. మా వంశంలో ఎవరికీ మధుమేహం లేదని అనుకోవటం ఎంతమాత్రమూ తగదు. తాత, ముత్తాతలలో ఎవరికైనా మధుమేహం ఉంటే తెలిసే అవకాశం ఉండొచ్చు. కానీ అమ్మ తరఫు బంధువుల్లో ఎవరికి మధుమేహం ఉందనేది తెలిసే అవకాశం తక్కువ. పైగా ఆ రోజుల్లో ఇన్ని పరీక్షలు లేవు. ఇంత వైద్యమూ అందుబాటులో లేదు. ఎవరికైనా మధుమేహం ఉన్నా వాళ్లకు ఆ సంగతే తెలియకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ.. ముఖ్యంగా 40 ఏళ్ల వయసు వచ్చినవారంతా క్రమం తప్పకుండా మూత్ర, రక్త పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి. పిల్లలకు మధుమేహం (టైప్‌-1) ఉంటే లక్షణాలు కనబడుతుంటాయి కాబట్టి గుర్తించే అవకాశం ఎక్కువ. తల్లిదండ్రులిద్దరికీ మధుమేహం ఉన్నట్టయితే పిల్లలకు తరచుగా మూత్ర, రక్త పరీక్షలు చేయించాలి.

కొత్త మందుల మీద మోజు
కొందరికి కొత్త మందులన్నా, ఖరీదైన మందులన్నా మోజు. ‘డాక్టర్‌ గారూ.. ఖరీదైన మందులు రాయండి. ఫర్వాలేదు. వేసుకుంటాం’ అని అంటుంటారు. ముందు ఆర్భాటంగానే మొదలెడతారు. కనబడినవారితో ‘అబ్బా ఏం మందండీ. చిటికెలో షుగర్‌ కంట్రోల్‌ అయ్యింది’ అని చెబుతుంటారు. కానీ ఆ తర్వాత కొనటం మానేస్తారు. ఇవి పాత మందులని ఇష్టం లేక వాడరు. ధరను బట్టి కాదు. అవసరాన్ని బట్టి, పనితీరుని బట్టి డాక్టర్లు మందులను ఎంపిక చేస్తారని తెలుసుకోవాలి. పక్కింటివారు వాడుతున్నారనో, తెలిసినవారు చెప్పారనో మందులను కొని వాడుకోవటం ఏమాత్రం మంచిది కాదు.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.