close

తాజా వార్తలు

పిల్లలు దిద్దిన పిరియడ్‌ కథ

ఆస్కార్‌ బరిలో నిలిచేంత ఏముంది అందులో? 
పురస్కారం గెలిచేంత ఏం చూపారు అందులో? 
ఆడపిల్ల జీవితంలో వారికే అర్థం కాని అధ్యాయం నెలసరి. 
అసలు సంగతి తప్ప.. భారతావని వనితల్లో దానిపై ఒక్కొక్కరిదీ ఒక్కో అవగాహన. 
‘అదంతా దైవ నిర్ణయం...’ కొందరి నమ్మకం 
‘తెలియద’ని అనేవాళ్లు కొందరైతే... 
దానిపై మౌనం వహించేవాళ్లు ఎందరో.. 
ఈ అనుమానాలకు అసలైన జవాబు ‘పిరియడ్‌-ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’ డాక్యుమెంటరీ 
అరగంట కూడా లేని ఈ పరిశోధనాత్మక డాక్యుమెంటరీ నెలసరిపై సరికొత్త జడ్జిమెంట్‌  ఇచ్చింది. అందుకే అది అస్కార్‌ బరిలో నిలిచింది. పురస్కారం గెలిచింది.

దాదాపు మూడునాలుగేళ్లక్రితం లాస్‌ ఏంజిలస్‌లోని ఓక్‌వుడ్‌ స్కూల్లో ప్రారంభమైందీ కథ. నెలసరి- శానిటరీ ప్యాడ్లకు సంబంధించి ఓ ప్రాజెక్టు చేయాలనుకుందో తరగతి. దానిపేరు ‘ది ప్యాడ్‌ ప్రాజెక్ట్‌’. ఆ స్కూల్లోని ఇంగ్లిష్‌ టీచర్‌ మెలిస్సా బెర్టన్‌ తన విద్యార్థులతో ఆ ప్రాజెక్టు చేయించేందుకు సిద్ధమైంది. అందులో బెర్టన్‌ కూతురు హెలెన్‌ కూడా ఉంది. ఆ బృందమంతా ఇతర దేశాల్లో నెలసరికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుంది. అలా భారత్‌లోని కొన్ని ప్రాంతాలనూ పరిశీలించింది. భారత్‌లో నెలసరి అనే పదం వాడటానికి కూడా చాలామంది మహిళలు ఇష్టపడరని, ఆ చర్చ తేవడానికి కూడా ఆసక్తి చూపరని వాళ్లకు అర్థమైంది. పైగా చాలామంది మహిళలకు నెలసరి సమయంలో వాడే శానిటరీ న్యాప్‌కిన్ల గురించి అసలు అవగాహన లేదు. ఇవన్నీ గమనించిన ఆ బృందం ఏదో ఒకటి చేయాలనుకుంది. అంతా కలిపి పదిమంది. పైగా వయసు పన్నెండు నుంచి పద్నాలుగేళ్లలోపు. అయినా ఏదో ఒకటి చేయాలనుకున్నారా అమ్మాయిలు. బేకింగ్‌ చేసి రకరకాల ఆహారపదార్థాలు అమ్మారు. యోగథాన్లు నిర్వహించారు. అలా 3000 డాలర్లను సేకరించి తక్కువ ఖరీదులో బయోడీగ్రేడబుల్‌ శానిటరీ న్యాప్‌కిన్లు తయారుచేసే యంత్రాన్ని కొన్నారు. ఏదయినా ఓ పట్టణానికి అందివ్వాలనుకున్నారు. టీచర్‌ మెలిస్సా బెర్టన్‌ సాయంతో ఆ అమ్మాయిలు గాళ్స్‌ లెర్న్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ యాక్షన్‌ ఇండియా ద్వారా దిల్లీకి దగ్గర్లోని హాపూర్‌కి ఈ యంత్రాన్ని అందించింది. అయితే అంతటితోనే తమ పని అయిపోయిందనుకోలేదు వాళ్లు.

నిధులు సేకరించి మరీ... 
తమకు తెలిసిన అనుభవాలనే డాక్యుమెంటరీగా తీయాలనుకున్నారు. . అయితే దానికోసం అమ్మాయిలు మరో క్యాంపెయిన్‌ని మొదలుపెట్టి నలభైవేల డాలర్లు సేకరించి.. డాక్యుమెంటరీకి సిద్ధమయ్యారు. అలా 2016లో ‘పిరియడ్‌ - ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’ డాక్యుమెంటరీ ప్రారంభమైంది.  గునీత్‌ మోంగా సహ నిర్మాతగా వ్యవహరిస్తే, ఇరానియన్‌ అమెరికన్‌ రేకా జెతాబ్చీ దర్శకత్వం వహించేందుకు సిద్ధమయ్యారు. హాపూర్‌ ప్రాంతానికి యంత్రాన్ని ఇచ్చారు కాబట్టి.... ఆ తరువాత వాళ్ల జీవనవిధానం ఎలా మారిపోయిందనేదీ ఇందులో చూపించారు.

ఏంటా కథ 

ఈ డాక్యుమెంటరీ నిడివి 26 నిమిషాలే. భారత్‌లో చిన్న పట్టణంలో మొదలవుతుంది. ఇందులో భాగంగా యాక్షన్‌ ఇండియా ఎంతోమందిని నెలసరి -శానిటరీ న్యాప్‌కిన్లకు సంబంధించిన ప్రశ్నలు వేస్తూ ఇంటర్వ్యూ చేస్తుంది. చాలామంది తాము శానిటరీ ప్యాడ్ల గురించి వినలేదని చెప్పడం, ఆ ప్రస్తావన రాగానే సిగ్గుపడటం, అలాంటివి బహిరంగంగా మాట్లాడకూడదని అనడం...ఈ డాక్యుమెంటరీలో చూడొచ్చు. అబ్బాయిల్ని ప్రశ్నించినప్పుడు అసలు పిరియడ్‌ అంటే తెలియదని అనడం లేదా స్త్రీకి సంబంధించిన ఓ అనారోగ్యం అని చెప్పడం కూడా కనిపిస్తుంది. అది అంటరాని సమస్యగా భావించే కొందరు మహిళలు... రాత్రుళ్లు అంతా పడుకున్నాక తువాళ్లలో దూదిని పేర్చి ఆ సమయాల్లో వాడుకుంటామని చెప్పారు. వాళ్ల దృష్టిలో నెలసరి అనేది అశుభ్రం, సిగ్గు. అంతేనా... చాలామంది అమ్మాయిలు రుతుక్రమం మొదలయ్యే సమయానికి బడి మానేసేవారట.

గునీత్‌ మోంగా: ‘మేం గెలిచాం. ఈ భూమి మీద ఉన్న ప్రతి బాలిక కోసం గెలిచాం. మీరు దేవతలన్న విషయం తెలుసుకోండి. ఒక వేళ స్వర్గం ఇది వింటుంటే.. మేం దీన్ని మ్యాప్‌ పై పెట్టాం. అరుణాచలం మురుగనాథన్‌ చాలా సంవత్సరాలు కష్టపడి తక్కువ ఖర్చుతో శానిటరీ ప్యాడ్స్‌ తయారు చేసే విధానం కనుగొనడం కూడా తెలుసుకున్నాం.

అడ్డంకి కాకూడదు... 
మెలిస్సా: ‘మా పాఠశాల విద్యార్థినుల శ్రమను గుర్తించినందుకు ధన్యవాదాలు. అలాగే ఎన్నో ఏళ్లుగా  యాక్షన్‌ ఇండియా నడిపిస్తోన్న గౌరీ చౌదరి కష్టం. ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పునరుత్పత్తి హక్కుల(రిప్రొడక్టివ్‌ రైట్స్‌) కోసం పోరాడుతోంది. పిరియడ్స్‌ అనేవి సాధారణమైనవే. అవి ఎట్టి పరిస్థితుల్లోను మహిళలు ఎదుగుదలకు అడ్డంకిగా మారకూడదు. భారతదేశం లేదా ప్రపంచంలో ఎక్కడైనా సరే దీని గురించి ఎటువంటి బెరుకు లేకుండా చెప్పుకోవాలి. పిరియడ్‌ అనేది ఒక వాక్యంలో ముగించేది మాత్రమే... ఒక బాలిక లేదా విద్యార్థిని జీవితాన్ని ముగించేది కాదు.’

దర్శకురాలు రేకా జెతాబ్చీ 
‘దీనికి అవార్డు వస్తుందని నేను ఊహించలేదు. చాలామంది ఆ డాక్యుమెంటరీని సమర్థించకపోవడమే దానికి కారణం. నెలసరి సమస్యలనేవి కేవలం భారత్‌లోనే కాదు అమెరికా, ఇతర సంస్కృతుల్లో కూడా ఉన్నాయి అని ఇప్పుడు తెలిసింది. నెలసరి, రుతుక్రమం గురించి మహిళలు ధైర్యంగా మాట్లాడినప్పుడే, మహిళా సాధికారత మొదలవుతుంది. నెలసరికి సంబంధించిన అపోహలు, భయాలు పోవాలి. ఇది మహిళలకు కాదు... సమాజానికి సంబంధించిన డాక్యుమెంటరీ.’ ‘ఈ డాక్యుమెంటరీ అందరి హృదయాలు గెలిచినందుకు ఆశ్చర్యంగా ఉంది...’ అని అంటారు భారత ప్యాడ్‌మాన్‌ అరుణాచలం మురుగనాథన్‌.

డాక్యుమెంటరీ పూర్తయ్యాక ఆ అమ్మాయిలు, మెలిస్సా బెర్టన్‌ కూడా హాపూర్‌కి వచ్చారు. ప్యాడ్‌ ప్రాజెక్ట్‌ పేరుతో ఓ ఎన్జీఓను ప్రారంభించారు. నెలసరిపై అవగాహన కల్పించడంతోపాటు శానిటరీ ప్యాడ్లు తయారుచేసే యంత్రాలు అవసరమైన ప్రాంతాలకు అందివ్వడం ఈ సంస్థ ప్రధానోద్దేశం. అది యాక్షన్‌ ఇండియా సాయంతో జరుగుతుంది. చిన్నపట్టణాలకు ఆ యంత్రాలు పంపడం వల్ల నెలసరి భయాలు, అపోహలు కొంతవరకూ దూరం అవుతాయి అంటారీ అమ్మాయిలు. ‘ఈ డాక్యుమెంటరీ విడుదలయ్యాక విద్యార్థులు నలుగురిలో నెలసరి గురించి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. అదీ అబ్బాయిల ఎదుట. అబ్బాయిల్లోనూ మార్పు కనిపిస్తోంది. సంభాషణ గౌరవపూర్వకంగా ఉంటోంది’ అని అంటోంది హెలెన్‌ బృందం.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.